- Home
- National
- ఢిల్లీ ఉగ్ర లింకును బ్లాస్ట్ చేసింది మన కర్నూలు కుర్రాడే.. ఒక పోస్టర్‌తో మొత్తం గుట్టు లాగాడు
ఢిల్లీ ఉగ్ర లింకును బ్లాస్ట్ చేసింది మన కర్నూలు కుర్రాడే.. ఒక పోస్టర్‌తో మొత్తం గుట్టు లాగాడు
Sundeep Chakravarthy: దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన కారు పేలుడు ఉగ్రవాదుల చర్యేనని తేలింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఉగ్రదాడి లింకును బయటపెట్టిన అధికారుల్లో ఒకరైన సందీప్ చక్రవర్తి గురించి ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు.

పోస్టర్లతో మొదలైన అనుమానం
అక్టోబర్ 17న అనంతనాగ్ జిల్లా నవ్గాంలో ఉర్దూలో పోస్టర్లు కనిపించాయి. వీటిలో “భారత అధికారులకు సహాయం చేయొద్దు, షరియా వ్యతిరేకంగా ప్రవర్తించొద్దు” అని పేర్కొన్నారు. ఇవి జైషే మహ్మద్ అనే ఉగ్రసంస్థ పేరుతో విడుదలయ్యాయి. శ్రీనగర్ ఎస్ఎస్పీ డా. జీవి సందీప్ చక్రవర్తికి మాత్రం ఈ పోస్టర్లు అనుమానంగా కనిపించాయి. దీంతో ఆయన వెంటనే దర్యాప్తు మొదలుపెట్టాడు. సీసీటీవీ ఆధారంగా ముగ్గురు అనుమానితులు పట్టుబడ్డారు. అక్కడి నుంచి దర్యాప్తు జమ్మూ, హర్యాణా, యూపీ వరకు వెళ్లింది. ఈ కేసు వల్ల కాశ్మీర్ కు చెందిన కొంతమంది డాక్టర్లు సహా పలువురు అరెస్ట్ అయ్యారు. 2,900 కిలోల పేలుడు పదార్థం, AK రైఫిళ్లు స్వాధీనం అయ్యాయి. ఇలా ఢిల్లీ ఉగ్రదాడి వెనకాల ఉన్న వారిని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా సందీప్ నిలిచాడు.
ఇంతకీ ఎవరీ సందీప్ చక్రవర్తి
సుందీప్ చక్రవర్తి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో జన్మించారు. ఇంట్లో తండ్రి, తల్లి ఇద్దరూ ఆరోగ్య శాఖలో పనిచేసేవారు. మాంటెసోరి పబ్లిక్ స్కూల్‌లో చదివి, తరువాత కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. కొంతకాలం డాక్టర్ గా పనిచేసి, ప్రజలకు సేవ చేయాలన్న కోరికతో 2014లో ఐపీఎస్‌లో చేరారు.
జమ్మూ-కాశ్మీర్‌లో చేసిన సేవలు
జమ్మూ కశ్మీర్ లో ఆయన చాలా కఠినమైన ప్రాంతాల్లో పనిచేశారు. యూరి, సోపోర్, బారాముల్లా, హండ్వారా, కుప్వారా, కుల్గాం, అనంతనాగ్ వంటి సున్నిత ప్రాంతాల్లో ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించారు. 2025 ఏప్రిల్ 21న ఆయన శ్రీనగర్ ఎస్ఎస్పీ అయ్యారు. ఈ పోస్టు కశ్మీర్‌లో చాలా కీలకమైందిగా చెప్పొచ్చు.
‘ఆపరేషన్ స్పెషలిస్టు’గా ప్రసిద్ధి
చిన్న సమాచారం వచ్చినా వదిలిపెట్టకుండా దర్యాప్తు చేయడం సందీప్ అలవాటు. అదే కారణంగా నవ్గాం పోస్టర్ల కేసులో పెద్ద ఉగ్రముప్పును బయటపెట్టగలిగారు. మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్‌ను ప్రశ్నించగా, పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్న పెద్ద నెట్‌వర్క్ బయటపడింది. పలుచోట్ల నుంచి మొత్తం 2,921 కిలోల పేలుడు పదార్థం, బాంబులు తయారు చేసే సామగ్రి, AK రైఫిళ్లు బయటపడ్డాయి. ఫరిదాబాద్‌లో డాక్టర్లుగా కనిపించే కొంతమంది కూడా ఈ నెట్‌వర్క్‌లో ఉన్నట్టు తెలిసింది.
వ్యక్తిగత జీవితం, పురస్కారాలు
ఎప్పుడూ బిజీగా ఉండే పనిలో ఉన్నా.. ఆయనకు ట్రావెల్, డ్యాన్స్ వంటి ఆసక్తులు ఉన్నాయి. అతని జీవితంలో క్రమశిక్షణ, కష్టపడి పనిచేస్తారు.
పురస్కారాలు:
* రాష్ట్రపతి గ్యాలంట్రీ అవార్డు 6 సార్లు
* జమ్మూ కాశ్మీర్ పోలీస్ గ్యాలంట్రీ పతకం 4 సార్లు
* భారత సైన్యం నుంచి ప్రశంసా పతకం
ప్రజలతో నమ్మకం పెంచడం, మానవీయంగా వ్యవహరించడం, సమస్యలను వెంటనే పరిష్కరించడం — ఇవే ఆయన పనిచేసే విధానం. జమ్మూ కశ్మీర్ లాంటి క్లిష్ట ప్రాంతంలో ఆయన పని ధైర్యం, క్రమశిక్షణ, నిజాయితీకి ఉదాహరణగా నిలిచాయి.