వీధి కుక్కలు లేకపోతే ఎంత నష్టమో తెలుసా.? పెద్ద ప్రమాదమే..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వీధి కుక్కల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో వీధి కుక్కలను బయటకు పంపించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఎన్నో ప్రశ్నలకు కారణమవుతోంది.

భారీగా పెరిగిన వీధి కుక్కల సంఖ్య
ప్రస్తుతం వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగి పోయింది. ఇటీవల కాలంలో వీధి కుక్కల వల్ల మరణించినవారెందరో. కార్లలో వెళ్లే వారికి పెద్దగా సమస్య ఉండదు. కానీ కాలి నడక పోయే వారికి, ద్వి చక్ర వాహనదారులకు ఇవి ప్రాణాంతకంగా పరిణమించాయి . చిన్న పిల్లల సంగతి అయితే చెప్పనక్కరలేదు. ఈ పరిస్థితుల్లో వీధి కుక్కల పట్ల జన సామాన్యంలో విపరీతమయిన వ్యతిరేకత వచ్చింది. కొంతమంది జంతు ప్రేమికులు తప్పించి జనసామాన్యం వీధి కుక్కలను తీసుకెళ్లి షెల్టర్ జోన్ లు ఏర్పాటు చెయ్యాలని సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తీర్పు ను స్వాగతించారు .
KNOW
ఎన్నో సమస్యలు.
ఢిల్లీ లో మొత్తం పది లక్షల వీధి కుక్కలు ఉన్నాయని అంచనా . ఒక్కో షెల్టర్ కు 5000 కుక్కలు తరలిస్తే మొత్తం 200 షెల్టర్ లు కావాలి. తక్కువంటే ఒక్కో షెల్టర్‌కు రెండు మూడు ఎకరాల స్థలం కావాలి. అంటే మొత్తం అయిదు వందల ఎకరాల స్థలం కావాలి. ఢిల్లీలో ఇంత ఖాళీ స్థలం ఉందా? ఒక్కో కుక్కకు తిండికి నీళ్లకు ఆ షెల్టర్ మైంటెనెన్స్‌కు కలిపి సగటున యాభై రూపాయిలు కావాలి. అంటే పది లక్షల కుక్కలకు రోజుకు యాభై కోట్లు ఖర్చవుతుంది. ఇలా చూస్తే నెలకు 1500 కోట్లు, సంవత్సరానికి ఏకంగా 18000 కోట్లు కావాలి.
వీధి కుక్కలు లేకపోతే కలిగే నష్టాలు తెలుసా.?
కుక్కలు... ఎలుకలను, పంది కొక్కుల్ని చంపి తినేస్తాయి . మొత్తం కుక్కలను వీధుల్ని నుంచి నిర్మూలిస్తే ఎలుకలు పంది కొక్కుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఇప్పటికే కోతులు ఇళ్లపై దాడి చేస్తున్నాయి. అవి ఇప్పుడు చెట్లపైనే వస్తున్నాయి. కుక్కలు లేకపోతే కోతులు అన్ని వీధుల్లో నిండి పోతాయి. కర్ర చేతిలో ఉంటే కుక్కలు దరిచేరవు, కోతులు ఆలా కాదు.. చేతిలోని బ్యాగులను లాగుకొని పారిపోతాయి. వీధి కుక్కలు పారిశుధ్య కార్మికుల్లా పని చేస్తాయి. అవి లేక పొతే వీధుల్లో మలినాలు బాగా పెరిగి పోతాయి. కలరా లాంటి అంటూ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంటుంది.
వీధి కుక్కలకు లోకల్ ఫీలింగ్ ఎక్కువ .
వివిధ ప్రాంతాలనుంచి కుక్కల్ని తీసుకొని ఒకే షెల్టర్ లో పెడితే భీకర యుద్ధం ప్రారంభం అవుతుంది. రాత్రి పగలు అరుపులు. ఒకటి పై ఒకటి దాడి, చుట్టూ పక్కల రెండు కిలోమీటర్ ల వరకు మనుషులు నిద్ర పోలేరు. కుక్కలకు అంటువ్యాదులు బాగా సోకుతాయి. అన్ని కుక్కల్ని ఒకే చోట పోగేస్తే అంటు వ్యాధులు వస్తాయి. వాటిలో కొన్ని మనుషులకు సోకే ప్రమాదం ఉంటుంది.
మరేం చెయ్యాలి.?
* వీధి కుక్కల్ని ఇంట్లో వుంచుకోవడానికి సిద్ధంగా ఉన్నవారిని ప్రోత్సహించాలి . వారికి ఇంటి పన్నులో రాయితీ లాంటివి ఇవ్వొచ్చు .
* యుద్ధ ప్రాతిపదికన కుక్కలకు సంతాన నియంత్రణ ఆపరేషన్ నిర్వహించాలి .
* ఇది లేకపోవడం వల్లే కుక్కల సంఖ్య ఇటీవల భారీగా పెరుగుతోంది.
* అల్ట్రా సోనిక్ డివైస్ లు పని చేయవు . అంతా డూపు . సినిమాల్లో అయినట్టు సమస్యలు చిట్కాలతో పరిష్కారం కావు . ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కానీ సమస్య మరింత జటిలం. చాలా మందికి అర్థం కాని ఒక సమస్య ఉంది.
వీధి కుక్కలు రాత్రిళ్ళు బాగా మొరుగుతాయి. ఒక కుక్కతో మొదలయ్యి పదహైదు కుక్కలు అర్ధ రాత్రి అప రాత్రి ... ఒక్కో సారి గంటల తరబడి మొరుగుతాయి. దీని వల్ల నిద్ర బాగా డిస్టర్బ్ అవుతుంది. దీంతో నిద్రలో ఉలిక్కి పడి లేచే వారెందరో. ఇలా తరచూ నిద్ర డిస్టర్బ్ కావడం ఆరోగ్యానికి ప్రమాదకరం . మానసిక ఒత్తిడి.. వ్యాకులత... గుండె జబ్బులు... ఇమ్మ్యూనిటి బలహీన పడడం లాంటి సమస్యలొస్తాయి .
ముందు గొయ్యి .. వెనుక నుయ్యి . మరేంటి పరిష్కారం అంటారా ?
చెప్పాను కదా . సమస్య జటిలం. తిరుపతిలో మా బంధువుల కుటుంబం. ఆ వీధిలో ఒక కుక్క ఆరు పిల్లలకు జన్మ నిచ్చింది . వారంలో తల్లి చనిపోయింది . తల్లి లేని చిన్న కుక్క పిల్లలు. అమ్మాయి {మా చెల్లి {కజిన్} కూతురు } జాలిపడి ఇంటి వాకిటి లోకి తెచ్చి వాటికి పాలు పోసి రక్షించింది . ఇప్పుడు ఆ ఆరు కుక్కలు పెరిగి పెద్దయ్యాయి .
గేట్ దాటి బయటకు పోవు . పొతే బతకలేవు . అవి రాత్రిళ్ళు వరస బెట్టి వంతులు వేసుకొని అరుస్తాయి. దీని వల్ల మా చెల్లి { కజిన్ ఆరోగ్యం} బాగా దెబ్బ తింటోంది . రాత్రిళ్ళు నిద్ర ఉండదు. పగలు డ్యూటీ . ఎక్కడైనా తీసుకొని వదిలితే వారు .. కుక్కలు కాదు మా చెల్లి బావమరిది బతకలేరు. ఆ మాట చెబితే ఏడుస్తారు. పక్కింటి వారితో గొడవ ఉంటుంది. పోలీస్ కేసులు దాక వెళ్ళింది. వదల లేరు, ఇంట్లో ఉంటే నిద్ర పట్టదు. మనఃశాంతి లేదు. సమస్యకు పరిష్కారం చెప్పలేక చేతులెత్తేసాను. అతి సర్వత్రా వర్జయేత్ అంటారు.
చెన్నై లో ఫ్రెండ్.. వాళ్ళమ్మాయి కి నాలుగేళ్ళ క్రితం పెళ్లయింది. అల్లారు ముద్దుగా పెంచారు . ఆమె చాలా సెన్సిటివ్. బాగా తెలివైంది. భర్త అలాంటివాడే దొరికాడు. వీధుల్లో గాయపడిన పిల్లుల్ని తీసుకొని వెళ్లి పెంచుకొంటున్నారు. ఇంట్లో ఇప్పుడు మొత్తం 18 పిల్లులు. ఒక పిల్లికి క్యాన్సర్. అది చచ్చిపోతుందని మూడు రోజులుగా ఈ యువ జంట నిద్రాహారాలు మానేశారు. వారికి ఇల్లు ఎవరూ ఇవ్వరు . చెన్నై శివారులో ఎక్కడో ఒక అపార్ట్మెంట్ ఉందట. అక్కడ ఇలాంటి వారికే ఇస్తారట. పిల్లుల కోసం అక్కడ ఇల్లు తీసుకొన్నారు. పిల్లుల కోసం పిల్లలని కనకూడదు అని దంపతులు ఇద్దరు నిర్ణయించుకున్నారు. ఇది చెబుతూ మా ఫ్రెండ్ మొన్న చెన్నై పోయినప్పుడు బాధ పడ్డాడు . నా కౌన్సిలింగ్ పనికి రాదని నాకు తెలుసు. జీవితంలో బాలన్స్ ముఖ్యం .