బెంగళూరులోని మారుమూల గ్రామంలో షాకింగ్ ఘటన, పాకిస్తాన్ జిందాబాద్ నినాదం
Pakistan Zindabad slogans: మన దేశానికి ప్రధాన శత్రువు పాకిస్థాన్ అని పెద్దలే కాదు చిన్న పిల్లలను అడిగినా చెప్పేస్తారు. అలాంటిది భారతదేశంలో పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదం వినిపిస్తే ఎలా ఉంటుంది? బెంగళూరు సమీపంలో ఉన్న గ్రామంలో ఇదే జరిగింది.

పాకిస్తాన్ జిందాబాద్ పేరుతో
పాకిస్తాన్ పెంచుతున్న ఉగ్రవాద మూలాలు అప్పుడప్పుడు భారతదేశంలో బయటపడుతూనే ఉన్నాయి. ప్రజల్లో కలిసిపోయి భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు పాక్ ముష్కరులు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. భారతదేశానికి ప్రధాన శత్రువు అయిన పాకిస్తాన్ ను పొగిడితే చిన్నపిల్లల రక్తం కూడా ఉడికిపోతుంది. అలాంటిది బెంగుళూరులోని ఒక గ్రామంలో పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదం వినిపించింది. దీంతో ఒక్కసారిగా అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. పాకిస్తాన్ తో లింకు పెట్టుకున్న వ్యక్తులు బెంగళూరులోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్నారా? అన్న అనుమానం మొదలైంది.
అసలేం జరిగింది?
మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో గోవర్ధన్ సింగ్ అనే వ్యక్తి బెంగళూరులోని జిగాని పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదును చేశాడు. దాని ప్రకారం పాకిస్తాన్ బెంగళూరులో ఉన్న కల్లుబోలు అనే గ్రామంలోని సహకార బ్యాంకు ఆవరణలో ఒక వైఫై కనెక్షన్ ఉందని.. దాని పేరు పాకిస్తాన్ జిందాబాద్ అని వస్తోందని చెప్పాడు. అక్కడున్న స్థానికులకు కూడా అది చూపించాడు. దీంతో వారు షాక్ అయ్యారు. దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారు ఆ ప్రాంతంలో ఉన్నారనే భయం వారిలో మొదలైంది. దీంతో వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేశారు.
గతంలో కూడా ఇలాగే
స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. అయితే ఎవరి వైఫై రౌటర్ కు ఈ పేరు పెట్టారో మాత్రం గుర్తించలేకపోయారు. ఈ విషయం తెలియడంతో బజరంగ్ దళ్ కార్యకర్తలు కూడా జిగాని పోలీస్ స్టేషన్ దగ్గర చేరి ఆ రౌటర్ ఎవరి పేరు మీద ఉందో కనిపెట్టాలనీ, తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం ప్రారంభంలో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ లో ఒక వ్యక్తి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అతనిపై కేసు పెట్టి మరీ అరెస్టు చేశారు.