మహిళల వస్త్రధారణ మీద సల్మాన్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏమన్నారంటే...
మహిళల శరీరాలు విలువైనవి.. వాటిని దుస్తులతో సంరంక్షిస్తేనే మంచిది.. అంటూ సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారంగా మారుతున్నాయి.

ముంబై : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మహిళల దుస్తుల మీద చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. మహిళల శరీరాలు ఎంతో విలువైనవని.. వాటిని దుస్తులతో ఎంత ఎక్కువగా కప్పితే అంత మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. సల్మాన్ ఖాన్ ఆదివారం రాత్రి ప్రసారమైన ‘ ఆప్ కీ అదాలత్’ టీవీ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
సల్మాన్ ఖాన్ తో కలిసి నటించిన పాలక్ తివారి అంతకుముందు ఓ టీవీ షోలో మాట్లాడుతూ.. ‘సల్మాన్ తన సినిమా సెట్ లో ఉన్న మహిళలందరూ నిండుగా మెడవరకు దుస్తులు ధరించేలా చూస్తారు’ అని అన్నారు. ఆమె.. సల్మాన్ ఖాన్ తో కలిసి ‘కీసి కా భాయ్.. కిసీ కా జాన్’ సినిమాలో నటించింది. దీనిపై నెట్టింట్లో సల్మాన్ ఖాన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నటి పాలక్ తివారి వ్యాఖ్యల నేపథ్యంలోనే రజత్ శర్మ తన ‘ఆప్ కీ అదాలత్’కార్యక్రమానికి వచ్చిన సల్మాన్ ఖాన్ ను సూటిగా ఓ ప్రశ్న అడిగారు. ‘ మీ సినిమా సెట్ లోని మహిళల విషయంలో దుస్తులు నిండుగా కప్పుకోవాలని నియమం పెడతారట కదా.. కానీ సినిమాల్లో మీరు మాత్రం చొక్కా విప్పి నటించడం చేస్తారు కదా.. ఇది ద్వంద్వ ప్రమాణాల కిందికి రాదా?’ అంటూ నిలదీసినట్టుగా ప్రశ్నించారు.
దీనికి సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. ‘ దీంట్లో ద్వంద్వ ప్రమాణాలు ఏమీ లేవు. మహిళల శరీరాలు చాలా విలువైనవని నా అభిప్రాయం. అందుకే వాటిని ఎంత దుస్తులతో సంరక్షిస్తే అంత మంచిది. ఇది కేవలం మహిళల గురించి చెబుతున్న మాట మాత్రమే కాదు. మన తల్లులు, సోదరీమణులు, భార్యలు లాంటి మహిళలను వక్రబుద్ధితో చూసే కొందరి గురించి చెబుతున్న మాట. దుస్తుల పేరుతో మహిళలు అవమానాలకు గురికాకూడదని నేను కోరుకుంటున్నాను’ అని వివరించారు.
దీనికి సల్మాన్ ఖాన్ మళ్లీ వివరణ ఇస్తూ.. ఇది అబ్బాయిల గురించి కాదు అమ్మాయిల గురించి. వారు ఏ దృష్టితో అమ్మాయిలను చూస్తారో దాని గురించి.. మీ సోదరి, భార్య లేదా తల్లిని అలా చూడటం నాకు ఇష్టం లేదు. కాబట్టి, దానికి ఆస్కారం ఇచ్చేలా ఉండడం నాకు ఇష్టం లేదు" అని సల్మాన్, పితృస్వామ్య నిబంధనల సంరక్షకులు చెప్పే వాదనను వినిపించారు.
ట్విట్టర్‌లో కూడా దీనిమీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సల్మాన్ ఖాన్ చెప్పినదాంట్లో తప్పు చేయలేదని చాలా మంది అభిప్రాయపడ్డారు, అయితే సెటైర్ హ్యాండిల్ ది దేశ్ భక్త్ వంటి కొందరు యూజర్లు మాత్రం, అతని మాటలు మోసపూరితంగా ఉన్నాయన్నారు. అతని డేటింగ్ చరిత్రలో మహిళలపై హింసను గుర్తు చేశారు.