- Home
- National
- స్వాతంత్రం వచ్చిన వెంటనే గణతంత్రం ఎందుకు రాలేదో తెలుసా.? రిపబ్లిక్ డే గురించి ఎవరికీ తెలియని విషయాలు.
స్వాతంత్రం వచ్చిన వెంటనే గణతంత్రం ఎందుకు రాలేదో తెలుసా.? రిపబ్లిక్ డే గురించి ఎవరికీ తెలియని విషయాలు.
Republic day: ప్రతీ ఏటా జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డేని జరుపుకుంటామని తెలిసిందే. జెండా ఎగరవేయడం, స్వీట్లు పంచుకోవడం స్కూల్ టైమ్‌లో ఇది కామన్. అయితే రిపబ్లిక్ డేకి సంబంధించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

26 జనవరి తేదీ వెనుక బలమైన చరిత్ర
26 జనవరి అనేది యాదృచ్ఛిక తేదీ కాదు. 1930 జనవరి 26న లాహోర్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో “సంపూపూర్ణ స్వరాజ్యం” ప్రకటించారు. అప్పటి నుంచి స్వాతంత్రం వచ్చేవరకు ఈ రోజునే స్వాతంత్ర దినంగా జరుపుకున్నారు. ఆ చారిత్రక సంకల్పానికి గౌరవంగా రాజ్యాంగాన్ని అమలు చేసే రోజుగా కూడా 26 జనవరి తేదీని ఎంచుకున్నారు.
స్వాతంత్రం వచ్చిన వెంటనే గణతంత్ర దేశం కాలేదు
1947 ఆగస్టు 15న భారత్ స్వతంత్ర దేశంగా మారింది. కానీ అప్పుడే గణతంత్ర దేశం కాలేదు. 1950 జనవరి 26 వరకు బ్రిటిష్ రాజు అధికారికంగా దేశాధినేతగా కొనసాగాడు. గవర్నర్ జనరల్ ద్వారా పాలన సాగింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాతే పూర్తిగా ప్రజాస్వామ్య గణతంత్రంగా మారింది.
రాజ్యాంగం సిద్ధం కావడానికి పట్టిన కాలం
భారత రాజ్యాంగం తయారవడం చిన్న విషయం కాదు. దీనికి 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు పట్టింది. రాజ్యాంగ సభ మొత్తం 165 రోజులు సమావేశమై ప్రతి అంశంపై చర్చించింది. మౌలిక హక్కులు, పాలన విధానం, రాష్ట్రాల వ్యవస్థ వంటి అంశాలపై లోతైన చర్చలు జరిగాయి. ఇది దేశ భవిష్యత్తుపై తీసుకున్న అత్యంత బాధ్యతాయుత నిర్ణయం.
26 నవంబర్ 1949కే సిద్ధమైన రాజ్యాంగం
రాజ్యాంగం పూర్తిగా సిద్ధమైంది 1949 నవంబర్ 26న. అయినా అమలు చేయలేదు. అప్పటి నాయకులు 1930 పూర్ణ స్వరాజ్య ప్రకటన తేదీతో అనుసంధానం చేయాలని నిర్ణయించారు. అందుకే రెండు నెలలు వేచి చూసి 1950 జనవరి 26న అమల్లోకి తీసుకొచ్చారు. ఇది హిస్టరీకి ఇచ్చిన గౌరవంగా చెప్పవచ్చు.
ముద్రించలేదు.. చేతితో రాసిన రాజ్యాంగం
భారత రాజ్యాంగం అసలు ప్రతులు ముద్రణలో తయారు కాలేదు. ప్రేమ్ బిహారి నారాయణ్ రాయిజాదా అనే కాలిగ్రాఫర్ చేతితో రాశారు. ఆ పేజీలపై భారతీయ సంస్కృతి ప్రతిబింబించే చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతులు ఇప్పటికీ పార్లమెంట్ గ్రంథాలయంలో భద్రంగా ఉన్నాయి.
రాజ్యాంగానికి ప్రాణం పోసిన నాయకుడు
భారత రాజ్యాంగం అనగానే ముందుగా గుర్తుకొచ్చే పేరు డా. బీఆర్ అంబేద్కర్. ఆయన రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్‌గా కీలక బాధ్యత వహించారు. సమానత్వం, న్యాయం, మౌలిక హక్కులు ప్రతి పౌరుడికి అందాలనే ఆలోచనను రాజ్యాంగంలో బలంగా స్థాపించారు. ప్రత్యేకంగా అణగారిన వర్గాలకు హక్కులు కల్పించడంలో అంబేద్కర్ పాత్ర అపూర్వం. భారతదేశం నిజమైన ప్రజాస్వామ్యంగా నిలవడంలో ఆయన ఆలోచనలు నేటికీ మార్గదర్శకంగా ఉన్నాయి.
గణతంత్ర దినోత్సవ పరేడ్ ఎలా మొదలైంది
మొదటి గణతంత్ర దినోత్సవ పరేడ్ రాజ్‌పథ్‌లో జరగలేదు. అప్పట్లో ఇర్విన్ స్టేడియం అనే ప్రదేశంలో నిర్వహించారు. 1955 తర్వాత రాజ్‌పథ్ (ఇప్పటి కర్తవ్య పథ్) శాశ్వతంగా మారింది. నేడు ఈ పరేడ్ దేశ శక్తి, సంస్కృతి ప్రతిబింబంగా నిలుస్తోంది.
గణతంత్ర దినోత్సవం ప్రభుత్వ వేడుక మాత్రమే కాదు
భారతీయులు తమకు తామే రాజ్యాంగం ఇచ్చుకున్న రోజు ఇది. ప్రతి పౌరుడికి హక్కులు ఇచ్చిన రోజు. అదే సమయంలో బాధ్యతలు గుర్తు చేసిన రోజు. ప్రజలు చైతన్యంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బలంగా నిలుస్తుంది అనే సందేశం ఈ రోజు ఇస్తుంది.

