రతన్ టాటా భుజంపై చెయ్యేసేంత క్లోజ్ ఫ్రెండ్ మన తెలుగు కుర్రాడు ... ఎవరీ శంతను నాయుడు?
రతన్ టాటా భుజంపై చెయ్యేస్తూ కనిపించే యువకుడు తెలుగోడే. ఇంతకిీ అతడు ఎవరు? టాటాకి అంత క్లోజ్ ఎలా అయ్యాడో తెలుసుకుందాం.
Ratan Tata Passes Away
Ratan Tata Passes Away : టాటా... పరిచయం అక్కర్లేని పేరు. గుండు పిన్ను నుండి ఎయిర్ ప్లేన్ వరకు... ఈ సంస్థ చేయని వ్యాపారం లేదు. దేశంలోనే కాదు విదేశాల్లోనూ వ్యాపారాలు నిర్వహస్తోంది ఈ సంస్థ. అయితే అన్ని కార్పోరేట్ కంపనీల్లా కాకుండా అందరిలా కాకుండా వ్యాపారానికి సామాజిక బాధ్యతను జోడించి సామాన్య ప్రజల కోసం ఏదో చేయాలని పరితపించే సంస్థ టాటా. ఈ సంస్థను అలా తీర్చిదిద్దారు టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా.
వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత అయినప్పటికీ ఆయన సామాన్యులకు ఏనాడు దూరం కాలేదు... కానీ ఆ దేవుడే ఆయనను దూరం చేసాడు. భారత ప్రజలకు ఎంతో దగ్గరైన రతన్ టాటా వయోభారంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో యావత్ దేశం ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ నివాళి అర్పిస్తోంది. ఈ క్రమంలోనే రతన్ టాటా యువ స్నేహితుడితో కలిసున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అతడు ఎవరు? రతన్ టాటాకు ఎందుకంత క్లోజ్? చివరి రోజుల్లో రతన్ టాటాకు ఎందుకు సేవలు చేసాడు? అనేది తెలుసుకుందాం.
Shantanu Naidu
ఎవరీ శంతను నాయుడు?
టాటా సన్స్ ఛైర్మన్ బాధ్యతల నుండి తప్పుకున్నాక రతన్ టాటా శేష జీవితాన్ని ప్రశాంతంగా గడిపేందుకు ప్లాన్ చేసుకున్నాడు. అతడికి పెళ్లి కాలేదు... కాబట్టి పిల్లాపాపలు లేరు. ఈ క్రమంలోనే తన జంతుప్రేమ, మానవత్వంతో ఓ యువకుడు ఎంతగానో ఆకట్టుకున్నాడు. దీంతో వృద్దాప్యంలో తనకు సహాయకుడిగా నియమించుకున్నారు రతన్ టాటా. అతడే శంతను నాయుడు.
మహారాష్ట్రలోని పూణే నగరంలో నివాసముండే తెలుగు కుటుంబంలో 1993 లో శంతను నాయుడు జన్మించాడు. అతడి తండ్రి టాటా మోటార్స్ లో పనిచేసాడు. విద్యాభ్యాసమంతా స్వస్థలంలోనే పూర్తిచేసాడు. పూణేలోని సావిత్రబాయి పూలే విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ పూర్తి చేసాడు. కార్నెల్ జాన్సన్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ నుండి ఎంబిఏ పూర్తిచేసాడు. ఆ తర్వాత టాటా సంస్థలో ఉద్యోగంలో చేరాడు. టాటా ఎల్క్సీ లో ఆటోమొబైల్ డిజైన్ ఇంజనీర్ గా పనిచేసాడు శంతను.
Ratan Tata Shantanu Naidu Friendship
రతన్ టాటాతో శంతను నాయుడు స్నేహం :
రతన్ టాటా మంచి జంతు ప్రేమికుడు అనే విషయం అందరికీ తెలింసిందే. ఇదే ఆయన శంతను నాయుడును దగ్గరకు తీయడానికి కారణమయ్యింది. ఎంబిఏ పూర్తయిన తర్వాత టాటా సంస్థలో ఉద్యోగం చేస్తూనే తనకు ఇష్టమైన జంతుప్రేమను చాటుకున్నాడు శంతను. ఇది రతన్ టాటా దృష్టికి చేరడంతో తన హోదాను సైతం పక్కనబెట్టి శంతనుతో స్నేహం చేసారు.
జంతువుల ప్రేమను చాటుకుంటూ శంతను 'మోటో పా' పేరుతో ఓ స్టార్టప్ ప్రారంభించాడు. ఏ దిక్కు లేకుండా రోడ్లపై తిరిగే వీధికుక్కలను రక్షించడానికి ఈ ప్రాజెక్ట్ ను చేపట్టాడు. వాహనాల కిందపడి రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా కుక్కలను కాపాడేందుకు సరికొత్త ప్రయత్నం చేసారు. వీధి కుక్కల మెడలో రిప్లెక్షన్ లైట్స్ తో కూడిన బెల్ట్ లను తొడగడం ప్రారంభించారు. దీంతో రాత్రి సమయాల్లో కుక్కలు వాహనదారులగా ఈజీగా కనిపించేవి. తద్వారా ప్రమాదాలు తగ్గాయి.
ఇక రోడ్డు ప్రమాదాలకు గురయిన వీధి కుక్కలను గుర్తించి వాటికి శస్ర్త చికిత్స అందించేది 'మోటో పా'. ఇలా ప్రమాదాల బారినపడ్డ వీధి కుక్కలకు కృత్రిమ అవయవాలను కూడా అమర్చేది. ఇలా శంతను ఏ స్వార్థం లేకుండా చేస్తున్న జంతుసేవ స్వతహాగా జంతు ప్రేమికుడైన రతన్ టాటాకు ఎంతగానో నచ్చింది. దీంతో శంతను స్టార్టప్ సంస్థలో ఆయన పెట్టుబడి పెట్టారు.
ఈ క్రమంలోనే రతన్ టాటాను శంతను నాయుడు పలుమార్లు కలిసాడు. చిన్న వయసులోనే సాటి ప్రాణులపై ప్రేమను ప్రదర్శించడంతో పాటు ఇలాగే వృద్దులకు సాయం చేసేందుకు కూడా ఓ సంస్థను స్థాపించాలన్న ఆలోచనను కూడా రతన్ టాటాతో పంచుకున్నాడు. ఇలా ఎంతో ఉన్నత ఆలోచనలు కలిగిన ఆ యువకుడితో రతన్ టాటా స్నేహం చేసారు.
స్నేహానికి వయసుతో సంబంధం లేదు... మంచి మనసుంటే చాలని రతన్ టాటా, శంతను నాయుడు నిరూపించారు. కాలేజీ కుర్రాళ్లలా ఈ ఇద్దరూ ఎక్కడికి వెళ్లినా కలిసి వుండేవారు. ఇలా శంతనుతో స్నేహం బాగా నచ్చడంతో 2018 లో మేనేజర్ గా నియమించుకున్నారు రతన్ టాటా. అప్పటినుండి వ్యక్తిగత సహాయకుడిగా, ఓ స్నేహితుడిగా రతన్ టాటా వెన్నంటివుండి సహాయం చేసేవాడు శంతను.
రతన్ టాటాకే కాదు ఎందరో వృద్దులకు స్నేహితుడిగా మారిన శంతను...
వేలకోట్ల ఆస్తులు కలిగిన అపర కుభేరుడు రతన్ టాటా లాంటివారే వృద్దాప్యంలో ఇబ్బందిపడటం కళ్లారా చూసి చలించాడో...లేక మరేదైనా కారణముందో తెలీదుగానీ 'గుడ్ ఫెలోస్' పేరిట మరో స్టార్టప్ ప్రారంభించారు శంతను నాయుడు. దీని ద్వారా సీనియర్ సిటిజన్స్ కు సహాయ సహకారాలు అందించేవారు. మంచి మనసులో స్థాపించిన ఈ స్టార్టప్ లో కూడా రతన్ టాటా పెట్టుబడులు పెట్టాడు.
ఇలా జంతు ప్రేమికుడిగానే కాదు సాటి మనుషులపై ప్రేమను చాటుకున్నాడు శంతను. కేవలం 29 ఏళ్ల కుర్రాడు ఇంత ఉన్నత భావాలు కలిగివుండటం ఒక్క రతన్ టాటాకే కాదు ఎంతో మందిని ఆకట్టుకుంది. అందువల్లే శంతను స్థాపించిన గుడ్ ఫెలోస్ స్టార్టప్ రూ.5 కోట్ల విలువ సాధించింది.
రతన్ టాటా భుజాలపై చెయ్యేసేంత క్లోజ్ ఫ్రెండ్ శంతను :
రతన్ టాటా, శంతను నాయుడు స్నేహం చాలా అరుదైనది. ఒకరు వయసు మీదపడిన వ్యాపారదిగ్గజం కాగా మరొకరు నూనుగు మీసాల నవ యువకుడు. వీరి స్నేహం ఎంత బలంగా వుండేదో తెలియజేసే ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో అందరినీ ఆకట్టుకుంటున్న ఫోటో మాత్రం రతన్ టాటా భుజంపై చెయ్యేసిన శంతను నాయుడిది. అలాగే రతన్ టాటాకు శంతను కేక్ తినిపిస్తున్న ఫోటో కూడా వైరల్ గా మారింది.