క్యాబ్ లో వెడుతూ మహిళ వ్యక్తిగత సంభాషణ.. డ్రైవర్ చేసిన పని షాకింగ్..
తన కారులో ప్రయాణించిన మహిళ నెం. తీసుకుని ఓ క్యాబ్ డ్రైవర్ బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు. ఆమె దగ్గర్నుంచి దాదాపు కిలో బంగారాన్ని కొట్టేశాడు.

బెంగళూరు : క్యాబ్లో వెళుతున్నప్పుడు మాట్లాడిన వ్యక్తిగత విషయాలను శ్రద్ధగా ఆలకించాడు ఓ డ్రైవర్. ఆ తర్వాత ఆ మహిళా ప్రయాణికురాలిని బ్లాక్ మెయిల్ చేస్తూ.. భారీ స్థాయిలో డబ్బులు గుంజిన ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. క్యాబ్ లోనో, ఆటోలోనో ఎక్కినప్పుడు…ప్రయాణమంతా ఖాళీగా ఉండడం ఎందుకు అన్నట్టుగా ఫోన్లో మాట్లాడడం. ప్రతీ ఒక్కరూ చేసే పనే.
ఇక ఆ క్యాబ్ ప్రయాణం గంటల తరబడి ఉన్నట్లయితే.. ఎప్పటి నుంచో పెండింగ్లో మాట్లాడాల్సి ఉన్న స్నేహితులతో.. లేదంటే లవర్స్ తో మాట్లాడుకుంటూ వెళుతుంటారు. ఇది చాలా కామన్ గా జరిగే ఘటనే.. అయితే ఇదే ఓ మహిళ కొంపముంచింది.
ఆమె మాట్లాడిన వ్యక్తిగత సంభాషణ అంతా శ్రద్ధగా విన్న ఆ డ్రైవర్. ఆమె నెంబర్ను సేవ్ చేసుకొని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అలా ఆమె దగ్గర నుంచి దాదాపుగా రూ.69 లక్షల రూపాయల విలువైన 960 గ్రాముల బంగారు నగల్ని కొట్టేశాడు.
కర్ణాటకలో జరిగిన ఈ షాకింగ్ సంఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే… ఓ మహిళ నిరుడు నవంబర్లో కిరణ్ అనే వ్యక్తి నడుపుతున్న క్యాబ్లో బాణసవాడి నుంచి ఓ ఎం బి ఆర్ లే అవుట్ కు ప్రయాణించింది. ఆ సమయంలో ఖాళీగా ఉండడం ఎందుకని ఆమె తన స్నేహితులతో ఫోన్లో సంభాషించింది.
ఆ సంభాషణలో వ్యక్తిగత వివరాలు చర్చలోకి వచ్చాయి. దీన్నంతా క్యాబ్ నడుపుతున్న డ్రైవర్ కిరణ్ శ్రద్ధగా విన్నాడు. అయితే, ఆ ఒక్కసారితో ఆమె ప్రయాణం ముగిస్తే గొడవ లేకపోయేది. కానీ ఆ తరువాత కూడా.. కొన్నిసార్లు అదే రూట్ లో ఆమె కిరణ్ కారులోనే ప్రయాణించింది. దీంతో కిరణ్ ఇది అలుసుగా తీసుకున్నాడు.
ఆమె ఫోన్ నెంబరు సేవ్ చేసుకున్నాడు. వేరే మూడో వ్యక్తిలా ఆ నెంబర్ కి ఫోన్ చేసి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆమె వ్యక్తిగత వివరాలను.. రహస్యాలను ప్రస్తావిస్తూ బ్లాక్మెయిల్ చేశాడు. దీంతో భయపడి పోయిన ఆమె.. అతను నుంచి తప్పించుకోవడానికి విడతల వారీగా రూ.20 లక్షలు చెల్లించుకుంది. ఈ డబ్బును అతడు చెప్పిన ఓ బ్యాంకు అకౌంట్లో జమ చేసింది.
ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమెకు తనను బ్లాక్ మెయిల్ చేస్తుంది కిరణ్ అని అనుమానం వచ్చింది. దీంతో కిరణ్ ని గట్టిగా హెచ్చరించింది. ఆమె హెచ్చరించడంతో అతను మరింత రెచ్చిపోయాడు. నన్నే హెచ్చరిస్తావా.. నీ రహస్యాలన్నీ బయటపెడతానుండు అంటూ తీవ్రంగా బెదిరింపులకు దిగాడు.
దీనికి భయబడి మళ్లీ 960 గ్రాముల బంగారాన్ని అతనికి ఇచ్చింది. ఇక ఆమె దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు. అయినా అతని వేదింపులు తగ్గలేదు. దీంతో ఇక తట్టుకోలేక రామమూర్తి నగర పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. అక్కడ కిరణ్ మీద కంప్లైంట్ ఇచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కిరణ్ ని పట్టుకుని… అతని దగ్గరి నుంచి నగలను స్వాధీనం చేసుకున్నారు. అతను వాటిని వేరువేరు ప్రైవేటు ఆర్థిక సంస్థల్లో కుదువపెట్టాడు. ఈ కేసు ఇప్పుడు దర్యాప్తులో ఉంది.