RAW చీఫ్ గా ఆపరేషన్ సింధూర్ హీరో ... ఎవరీ పరాగ్ జైన్?
సీనియర్ ఐపీఎస్ పరాగ్ జైన్ RAW (రీసెర్చ్ ఆండ్ అనాలసిస్ వింగ్) కొత్త సెక్రటరీగా నియమితులయ్యారు. ఆయన రెండేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈయనకు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో మంచి అనుభవం ఉంది.

RAW చీఫ్ గా పరాగ్ జైన్
RAW : మోడీ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్‌ను RAW (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) కి కొత్త చీఫ్ గా నియమించింది. శనివారం ఆయన నియామకాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. రెండేళ్ల పాటు భారతదేశపు నిఘా సంస్థ RAW కి ఆయన నాయకత్వం వహిస్తారు.
పరాగ్ జైన్ పంజాబ్ కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. పరాగ్ ప్రస్తుత రా చీఫ్ రవి సిన్హా స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. సిన్హా పదవీకాలం జూన్ 30న ముగుస్తుంది... ఆరోజే పరాగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఆపరేషన్ సింధూర్ లో కీలక పాత్ర
పరాగ్ జైన్ ప్రస్తుతం ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్‌కి అధిపతిగా ఉన్నారు. పాకిస్తాన్ సైన్యాల గురించి కీలకమైన నిఘా సమాచారాన్ని సేకరించడంలో ఈయన కీలకంగా వ్యవహరించారు. ఈ సమాచారమే ‘ఆపరేషన్ సింధూర్’లో కీలక పాత్ర పోషించారు. ఆయన జమ్మూ కాశ్మీర్‌లో కూడా పనిచేశారు... ఆ ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక వ్యూహాలను సమర్ధవంతంగా అమలుచేసారు.
చండీగడ్ ఏఎస్పీగా పనిచేసిన పరాగ్
పరాగ్ జైన్ చండీగఢ్ ఎస్ఎస్పి గా పనిచేశారు. కెనడా, శ్రీలంకల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. నిఘా సమాచారం సేకరించడం, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో మంచి అనుభవం ఉంది.
సూపర్ డిటెక్టివ్ గా పేరుగాంచిన పరాగ్ జైన్
నిఘా వర్గాల్లో పరాగ్ జైన్ "సూపర్ డిటెక్టివ్" గా పేరుగాంచారు. మానవ నిఘాని సాంకేతిక నిఘాతో సమర్థవంతంగా కలిపి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇలా ఆయన పెద్ద ఆపరేషన్లలో చాలా కీలకంగా వ్యవహరించారు.
ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆయన నాయకత్వంలో సేకరించిన నిఘా సమాచారం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులకు దోహదపడింది. దీనికోసం ఆయన ఏళ్ల తరబడి కృషి చేశారు. జైన్ కి జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్ర వ్యతిరేక కార్యకలాపాల్లో మంచి అనుభవం ఉంది.
RAW లో పాకిస్తాన్ డెస్క్‌ను చూసుకున్న పరాగ్ జైన్
తన ప్రారంభ కెరీర్‌లో పరాగ్ జైన్ పంజాబ్‌లో ఉగ్రవాదం ఉధృతంగా ఉన్న సమయంలో కీలకమైన పనులు చేశారు. చాలా జిల్లాల్లో SSP, DIG గా పనిచేశారు. RAW లో జైన్ పాకిస్తాన్ డెస్క్‌ను చూసుకున్నారు.
ఆర్టికల్ 370 రద్దు సమయంలో జమ్మూ కాశ్మీర్‌లో సేవలందించారు. శ్రీలంక, కెనడాలో భారతీయ మిషన్లలో కూడా పనిచేశారు. కెనడాలో ఉన్నప్పుడు విదేశాల నుంచి నడిచే ఖలిస్థానీ ఉగ్రవాద ముఠాలపై నిఘా ఉంచారు.