విడాకుల కోసం ఆర్నెల్లు ఎదురుచూడాల్సిన అవసరం లేదు : సుప్రీంకోర్టు
విడాకులకోసం వెళ్లే జంటలకు సుప్రీంకోర్టు పెద్ద ఉపశమనం కలిగించింది. విడాకుల కోసం ఆరునెలలు ఎదురుచూడాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. దీనికి కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది.

న్యూఢిల్లీ : విడాకుల విషయంలో సుప్రీంకోర్టు నేడు సంచలన తీర్పునిచ్చింది. విడిపోవాలని నిర్ణయించుకున్న జంటలకు ఆర్నెళ్లపాటు కలిసుండి, ఎదురుచూడాలన్న నిబంధనను ఎత్తివేసింది. ఇక కలిసుండలేం అనుకున్నవారికి ఫాస్ట్ ట్రాక్ ద్వారా వెంటనే విడాకులు మంజూరు చేయాలని ఆదేశించింది.
ఆర్టికల్ 142 ప్రకారం "ఇక పెళ్లి పునరుద్దరణ సాధ్యం కాదు" అనే కారణంతో వివాహాలను రద్దు చేయవచ్చని సుప్రీంకోర్టు ఈ రోజు పేర్కొంది. పరస్పర అంగీకారంతో విడాకుల కోసం అప్లై చేసుకున్న వారికి షరతులకు లోబడి ఆరు నెలల తప్పనిసరి నిరీక్షణ వ్యవధిని రద్దు చేయవచ్చని పేర్కొంది.
"వివాహంలో ఇక ఎప్పటికీ కోలుకోలేని పరిస్థితి ఎప్పుడు ఏర్పడుతుందో నిర్ణయించే అంశాలను కూడా నిర్దేశించాం" అని న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, ఏఎస్ ఓకా, విక్రమ్ నాథ్, జేకే మహేశ్వరిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ముఖ్యంగా మెయింటెనెన్స్, భరణం, పిల్లల హక్కులకు సంబంధించి ఈక్విటీలను ఎలా బ్యాలెన్స్ చేయాలో కూడా బెంచ్ వివరించింది.
హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13బి కింద నిర్దేశించిన విధంగా పరస్పర అంగీకారంతో విడాకుల కోసం తప్పనిసరి ఆర్నెళ్లు నిరీక్షణ కాలం ఉంటుంది. దీన్ని సుప్రీం కోర్ట్ ఆర్టికల్ 142 ప్రకారం తన అపారమైన అధికారాలను వినియోగించుకుని రద్దు చేయవచ్చా? అనేది రాజ్యాంగ ధర్మాసనానికి ఎదురైన అసలు సమస్య.
పరస్పర అంగీకారంతో విడాకుల కోసం వచ్చిన జంటలకు వెంటనే విడాకులు ఇవ్వకుండా.. సుదీర్ఘ న్యాయ విచారణలు, కౌన్సిలింగ్ ల కోసం కుటుంబ న్యాయస్థానాలకు పంపకుండా రద్దు చేయడం... ఇందులో ముఖ్యమైనది. అయితే, విచారణ సందర్భంగా, పూర్తిగా విచ్ఛిన్నం అయిన వివాహాలను రద్దు చేయవచ్చా అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయించింది.
"ప్రాథమిక హక్కుల దృష్ట్యా ఆర్టికల్ 142ని పరిగణనలోకి తీసుకోవాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 తన ముందు పెండింగ్‌లో ఉన్న ఏ విషయంలోనైనా "పూర్తి న్యాయం" చేయడానికి అత్యున్నత న్యాయస్థానం డిక్రీలు, ఆదేశాల అమలుతో వ్యవహరిస్తుంది.
ఈ కేసును ఏడేళ్ల క్రితం ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి బదిలీ పిటిషన్‌లో జస్టిస్‌లు శివ కీర్తి సింగ్, ఆర్ భానుమతి (ఇద్దరూ రిటైర్డ్) డివిజన్ బెంచ్ రిఫర్ చేశారు. వాదనలు విన్న తర్వాత, రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పును సెప్టెంబర్ 29, 2022న రిజర్వు చేసింది.