మూడు సార్లు ముఖ్యమంత్రి ... అయినా ఆస్తులు లక్షల్లోనే : ఎవరో తెలుసా?
ముఖ్యమంత్రి ... అంటే ఓ రాష్ట్రాన్ని శాసించే అధికారం చేతుల్లో వుంటుంది. ఒక్కసారి సీఎం అయితే తరతరాలు కూర్చునితిన్నా తరగని ఆస్తులు సంపాదిస్తారని అంటుంటారు. కానీ ఓ రాష్ట్రానికి మూడుసార్లు సీఎంగా చేసికూడా కేవలం లక్షల్లోనే ఆస్తులు కలిగివున్నారట. ఆ పేద సీఎం ఎవరో తెలుసా?

Poorest CM of India
ఓ రాష్ట్ర రాజకీయాాల్లో అత్యున్నత పదవి ముఖ్యమంత్రి. ఒక్కసారి రాష్ట్రానికి సీఎం అయితే చాలని చాలామంది రాజకీయ నాయకుల కోరిక. అలాంటిది ఓ మహిళ రాష్ట్రానికి మూడుసార్లు ముఖ్యమంత్రి. ఇంతకుముందు కేంద్ర మంత్రిగా కూడా పనిచేసారు. ఇలా అత్యున్నత పదవులు చేపట్టినా ఆమె ఆస్తులు మాత్రం కేవలం లక్షల్లోనే వున్నాయట. ఈ పేద సీఎం ఇంకెవరో కాదు మమతా బెనర్జీ.
Poorest CM of India
అత్యంత పేద సీఎం ;
నిన్న(సోమవారం) అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) దేశంలోని అన్నిరాష్ట్రాల ప్రస్తుత ముఖ్యమంత్రుల ఆస్తిపాస్తుల వివరాలను బైటపెట్టింది. ఇందులో అత్యల్ప ఆస్తులను కలిగిన సీఎంగా మమతా బెనర్జీ నిలిచారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ఆమె ఆస్తులు చాలా తక్కువగా వున్నట్లు ఏడిఆర్ పేర్కొంది.
ఎన్నికల సమయంలో నామినేషన్ తో పాటు సమర్పించే అఫిడవిట్ ఆదారంగా ఈ వివరాలను సేకరించింది ఏడిఆర్. అంటే మమతా బెనర్జీ తనకు తానే పేద సీఎంగా ప్రకటించుకున్నారన్నమాట. సుదీర్ఘంగా రాజకీయాల్లో వున్న ఆమె కేవలం లక్షల విలువైన ఆస్తులు కలిగి వున్నారంటే ఆశ్చర్యంగా వుంది.
ముఖ్యమంత్రుల ఆస్తుల జాబితాలో మమతా బెనర్జీ చివరన వున్నారు. ఆమె ఆస్తిపాస్తుల మొత్తం కేవలం 15,38,029 రూపాయలు మాత్రమేనట. ఈ మేరకు ఏడిఆర్ నివేదికలో పేర్కొన్నారు.
ఆసక్తికర విషయం ఏంటంటే మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీ సాలరీ తీసుకోవడంలేదు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జీతం తీసుకోనని ప్రకటించిన ఆమె కేవలం 1 రూపాయిని మాత్రమే తీసుకుంటున్నారు.
Richest CM of India
అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎవరు?
ఏడిఆర్ విడుదలచేసిన సీఎంల ఆస్తిపాస్తుల జాబితాలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొదటిస్థానంలో వున్నారు. చంద్రబాబు కుటుంబ ఆస్తులు ఏకంగా 931 కోట్ల రూపాయలు వున్నాయట. ఇంత భారీగా ఆస్తులు కలిగివున్న ఆయన భారతదేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా పేర్కొంది ఏడింది.
చంద్రబాబు తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు నిలిచారు. ఆయన కుటుంబ ఆస్తిపాస్తులు రూ.332 కోట్లు. అయితే ఆసక్తికర విషయం ఏమిటంటే అత్యధిక అప్పులు కలిగివున్నది కూడా ఈయనే. ఇతడికి రూ.180 కోట్ల వరకు అప్పు వుందట.
ఇక మూడో స్థానంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య వున్నారు. ఆయన ఆస్తులు రూ.51 కోట్లు... అప్పులు 23 కోట్లు వున్నాయట. ఇక జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కేవలం రూ.55 లక్షల ఆస్తులతో చివరినుండి రెండోస్థానం, కేరళ సీఎం పినరయి విజయన్ రూ.1.18 కోట్ల ఆస్తులతో చివరినుండి మూడోస్థానంలో వున్నారు.
మొత్తంగా చూసుకుంటే దేశంలోని అందరు ముఖ్యమంత్రుల సగటు ఆస్తి విలువ 1,630 కోట్ల రూపాయలు. కేవలం మమతా బెనర్జీ, ఒమర్ అబ్దుల్లా మినహా మిగతా ముఖ్యమంత్రులందరూ కోటీశ్వరులే. ఈ ఇద్దరు మాత్రమే లక్షాధికారులైన ముఖ్యమంత్రులు.