- Home
- National
- రూ.1,20,000 బైక్ రూ.60 వేలకే, రూ.60,000 ల్యాప్ టాప్ రూ.30వేలకే : ఇది స్కీం కాదు పర్ఫెక్ట్ స్కామ్
రూ.1,20,000 బైక్ రూ.60 వేలకే, రూ.60,000 ల్యాప్ టాప్ రూ.30వేలకే : ఇది స్కీం కాదు పర్ఫెక్ట్ స్కామ్
Kerala Scam : అత్యాశే పెట్టుబడిగా చేసుకుని జరుగుతున్న అనేక రకాల ఆన్ లైన్ స్కామ్ ల గురించి మనం ప్రతిరోజు వింటున్నాం. ఎంత జాగ్రత్తపడ్డా కేటుగాళ్లు కొత్తకొత్త మార్గాల్లో మోసాలు చేస్తూనేవున్నారు. తాజాగా కేరళలో స్కీంల పేరిట జరిగిన భారీ స్కాం బైటపడింది.

Half Price Scam
Half Price Scam : మనం ఏదయినా వస్తువు కొనాలంటే ముందుగా ఎక్కడ తక్కువ ధరకు దొరుకుతుందో చూస్తాం. లక్షల విలువచేసే వస్తువు కూడా రూ.500, రూ.1000 తక్కువకు వచ్చిందంటే సంబరపడిపోతాం...వెనకా ముందు చూడకుండా అక్కడే కొంటాం. అసలు తక్కువ ధరకు ఎందుకు ఇస్తున్నాడని కూడా ఆలోచించం. ఈ ఆశే కొందరు కేటుగాళ్లకు పెట్టుబడిగా మారుతోంది... తాజాగా ఇలాంటి భారీ మోసమే కేరళలో వెలుగుచూసింది.
కేవలం సగం ధరకే బైక్ లు, ల్యాప్ టాప్ లు, కుట్టుమిషన్లు... ఇలా సామాన్యులకు ఎంతగానో ఉపయోగపడే వస్తువులను అతి తక్కువ ధరకే అందిస్తామంటూ నమ్మించి ప్రజలను నిండా ముంచిందో ఓ ఎన్జివో. పెద్దపెద్ద కంపనీలు కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధులతో ఇలా తక్కువ ధరకు వస్తువులు అందిస్తామంటే కేరళ ప్రజలు నమ్మారు. కానీ ఇది స్కీం కాదు పెద్ద స్కామ్ అని తేలడంతో లబోదిబోమంటూ బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
అయితే ఈ సగం ధరకే వస్తువులను అందించే స్కాం వెనక కేరళలోని పెద్దపెద్ద తలకాయలు వున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ ఎమ్మెల్యే, మరో రిటైర్డ్ హైకోర్టు జడ్జి పేరు బయటకు వచ్చింది. అయితే ఇలా వందల కోట్ల ప్రజాధనాన్ని లూటీచేసింది ఓ 26 ఏళ్ల యువకుడంటే మీరు నమ్ముతారా... కానీ ఇదే నిజం. కేరళలో ఈ ఘరానా మోసం ఎలా జరిగిందో తెలుసుకుందాం.
Half price scam
సగం ధరకే బైక్స్, ల్యాప్ టాప్స్ స్కామ్ :
కేరళకు చెందిన 26 ఏళ్ల అనంతు కృష్ణ నేషనల్ ఎన్జిఓ కాన్పెడరేషన్ ను ఏర్పాటుచేసాడు. అంటే ఆ రాష్ట్రంలోని 170 కి పైగా ఎన్డిఓలను ఒక్కచోటికి చేర్చి దీన్ని ఏర్పాటుచేసాడు. 2022 లో దీన్ని స్థాపించి కొంతకాలం ప్రజలను నమ్మించాడు అనంతు కృష్ణ. ఈ ఎన్జిఓ పై ప్రజలకు బాగా నమ్మకం కుదిరాక భారీ స్కాంకు ప్లాన్ చేసాడు. భవిష్యత్ లో ఈ స్కాం గురించి ఎలాగూ బయటపడుతుంది... కాబట్టి సేఫ్ సైడ్ గా రాజకీయ, న్యాయ రంగాలకు చెందిన ప్రముఖులను భాగస్వాములుగా చేసుకున్నాడు. ఇలా పెద్ద హోదాలో పనిచేసిన వారికి నమ్మి ప్రజలు లక్షలకు లక్షలు చెల్లించి మోసపోయారు.
ఇంతకూ ఈ పథకం ఏమిటంటే... అనంతు కృష్ణ స్థాపించిన ఎన్జివో చాలా కంపనీలతో తమకు సంబంధాలున్నాయని ప్రజలను నమ్మించింది. ఆ కంపనీలు సామాజిక బాధ్యతగా (CSR) కొంత డబ్బును కేటాయిస్తుందని... ఆ డబ్బులను తమ ఎన్జిఓ ద్వారా ప్రజాసేవ కోసం ఉపయోగిస్తున్నామని ప్రకటించారు. ఇలా సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడేలా లక్షల విలువచేసే వస్తువులను సగం ధరకే అందిస్తామని... మిగతాసగం డబ్బులు తమ ఎన్జిఓకు అందే సిఎస్ఆర్ నిధుల్లోంచి చెల్లిస్తామని నమ్మించారు.
అయితే అనంతు కృష్ణ చెప్పే మాటలు నమ్మశక్యంగా వుండటంతో చాలామంది ఈ స్కీం లో చేరాడు. ఈ పథకంలో చేరాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి... అందుకోసం రూ.500 వసూలు చేసారు. ఆ తర్వాత వాయిదాలవారికి డబ్బులు వసూలు చేసారు. మొదట్లో కొంతమందికి ప్రకటించినట్లుగానే సగం ధరకే బైకులు, ల్యాప్ టాప్ లు అందించారు.
ఇలా ప్రారంభంలో ఈ వస్తువుల పంపిణీచేసిన కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. రాజకీయ నాయకులతో పాటు కొందరు సెలబ్రిటీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా బాగా ప్రచారం చేయడంతో ఈ స్కీం గురించి బాగా ప్రచారం అయ్యింది. దీంతో సగం ధరకే వస్తువులు పొందేందుకు చాలా మంది జాయిన్ అయ్యారు.
Half price scam
స్కీం కాదు స్కాం అని ఎలా బైటపడింది :
సగం ధరకే వస్తువులు వస్తున్నాయంటే ఎవరు వద్దనుకుంటారు చెప్పండి... ఇదే ఆశతో చాలామంది అనంతు కృష్ణ మాయలో పడ్డారు. ప్రారంభంలో కొందరికి నిజంగానే రూ.1,20,000 విలువైన బైక్స్ కేవలం రూ.60,000 ఇచ్చాడు. అలాగే రూ.60,000 విలువైన ల్యాప్ టాప్ కేవలం రూ.30,000 వేలకే అందించాడు. ఇలా అందరినీ నమ్మించాడు.
కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వివిధ కంపనీల ద్వారా సాయం అందిస్తున్నానని చెప్పడంతో ఎవరికీ అనుమానం రాలేదు. ఇలా ఈ స్కీంలో చేరినవారు డబ్బులు కట్టుకుంటూ వెళ్లారు. ఇలా భారీ డబ్బులు జమయ్యాక అనంతు కృష్ణ అసలు రంగు బైటపెట్టాడు. సగం ధరకు వస్తువులు అటుంచి ఉన్నడబ్బులతో ఉడాయించేందుకు సిద్దమయ్యాడు.
అయితే డబ్బులు మొత్తం చెల్లించినా తమకు ఇవ్వాల్సిన వస్తువులు ఇవ్వకపోవడంతో కొందరికి అనుమానం వచ్చింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించడంతో మోసం బైటపడింది. అమాయక ప్రజలనుండి ఈ స్కీం పేరిట అనంతు కృష్ణ రూ.500 నుండి రూ.1000 కోట్ల వరకు వసూలు చేసినట్లు అనుమానిస్తున్నారు. ఇంతపెద్ద స్కాం బైటపడటంతో కేరళలో అలజడి రేగింది.
ఇది భారీ స్కాం అని గుర్తించిన పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు... ప్రధాన నిందితుడు అనంతు కృష్ణను ఎర్నాకుళం గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. ఈ స్కాంకు సంబంధించి వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి... ముఖ్యంగా ఈ వ్యవహారంలో ఎక్కువమంది బాధితులు మహిళలే ఉన్నారు. సగం ధరకే వస్తువులను అందిస్తామని ఆశచూపడంతో ఈ స్కీంలో చేరినట్లు మహిళలు చెబుతున్నారు.
ఈ స్కాంలో అనంతు కృష్ణ ఒక్కడే కాదు మరికొన్ని పెద్దతలల ప్రమేయం వున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హైకోర్టు రిటైర్డ్ జడ్జి రామచంద్రన్ నాయర్ కు ఈ వ్యవహారంతో సంబంధం వున్నట్లు కేసు నమోదయ్యింది. ఇక ఓ ప్రముఖ ఎన్జీఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఓ ఎమ్మెల్యే కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇంకా విచారణ జరుగుతోంది... కాబట్టి ఇంకెన్ని పేర్లు బయటకు వస్తాయో చూడాలి.