రేపే కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం : కేసీఆర్, మమతా బెనర్జీలకు ఆహ్వానం..
మే 20న జరిగే కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి హేమంత్ సోరెన్, సీతారాం ఏచూరి, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వంటి అగ్రనేతలను కాంగ్రెస్ ఆహ్వానించింది.

న్యూఢిల్లీ : కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ల ప్రమాణస్వీకారోత్సవం మే 20న జరగనున్న భావసారూప్యత గల పార్టీల నేతలను కాంగ్రెస్ ఆహ్వానించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇటీవల ముంబైలో మహారాష్ట్ర శివసేన (యుబిటి) అధినేత ఉద్ధవ్ థాకరే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్‌లను కలిసిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆయన డిప్యూటీ తేజస్వీ యాదవ్‌లకు కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం అందినట్లు సమాచారం.
హేమంత్ సోరెన్, సీతారాం ఏచూరి, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో సహా భావసారూప్యత కలిగిన ప్రతిపక్ష పార్టీలకు, వాటి నేతలకు కూడా ఆహ్వానం పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఆహ్వానాలు పంపిన ఇతర ప్రతిపక్ష నాయకులలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు కూడా ఉన్నారు.
Mamata Banerjee
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా గాంధీ కుటుంబం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘెల్ సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరుకానున్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనేది ప్రకటించిన తర్వాత, కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య గురువారం గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌తో ఫోన్‌లో మాట్లాడారని, ఈ రోజు సాయంత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి స్టేక్ క్లెయిమ్ చేస్తారని వర్గాలు తెలిపాయి.
మే 20న ప్రమాణ స్వీకారం
మే 20వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరులో ప్రమాణస్వీకారోత్సవం జరుగుతుందని, ఇందుకోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే జి పరమేశ్వర ఆ పార్టీ ప్రతినిధిగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి.
"కర్ణాటక ముఖ్యమంత్రిగా నియమితులైన సిద్ధరామయ్య గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సిద్ధరామయ్య ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకారోత్సవ తేదీని చర్చించారు. మే 20 మధ్యాహ్నం 12.30 గంటలకు వేడుక జరగనుంది. సిద్ధరామయ్య ఈరోజు సాయంత్రం ప్రభుత్వం ఏర్పాటు కోసం స్టేక్ క్లెయిమ్ చేస్తారు" అని వర్గాలు తెలిపాయి.
“కాంగ్రెస్ ఎమ్మెల్యే జి పరమేశ్వర కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌ను కలిశారని, 2023 ఎన్నికల్లో 135 సీట్లలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సమాచారం ఇచ్చారని వారు తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత రెండ్రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలోనే ఉన్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఈ మధ్యాహ్నం బెంగళూరు బయలుదేరి వెళ్తారు. ఈరోజు సాయంత్రం 7 గంటలకు బెంగళూరులో కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పీ) సమావేశం జరగనుంది.
కాంగ్రెస్ విజయం తరువాత ముఖ్యమంత్రి ఎవరనే చర్చ రోజుల తరబడి సాగిన సంగతి తెలిసిందే. చివరికి కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి అని గురువారం ప్రకటించారు.
కెపిసిసి చీఫ్‌గా శివకుమార్
కెపిసిసి చీఫ్‌గా శివకుమార్ కొనసాగుతారని.. ఢీల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (సంస్థ) కెసి వేణుగోపాల్ ఈ విషయాన్ని ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల వరకు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌గా శివకుమార్ కొనసాగుతారని చెప్పారు. ఆయన ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉంటారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసే వరకు పీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ కొనసాగుతారని, మే 20న సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల బృందం ప్రమాణస్వీకారం చేస్తుందని వేణుగోపాల్ తెలిపారు.
224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి మే 10న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 135 సీట్లను కైవసం చేసుకుంది, అధికార బీజేపీని మట్టికరిపించింది. బీజేపీ 66 సీట్లు గెలుచుకోగా, జనతాదళ్ (సెక్యులర్) 19 సీట్లు సాధించింది.