పాక్ టు చైనా వయా హిమాలయాస్ : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హైవే ఇదే
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన హైవే భారత్ దాయాది దేశాలైన పాకిస్థాన్, చైనాల మధ్య వుంది. దీని ఎత్తు ఎంతో తెలుసా?

Karakoram Highway
Karakoram Highway: మన దాయాది దేశాలైన పాకిస్థాన్, చైనాల మధ్య ఓ అద్భుతమైన రోడ్డు మార్గం వుంది... అందమైన హిమాలయాల మధ్య వంకర్లు తిరుగుతూ నదులు, సరస్సులు దాటుకుంటూ సాగుతుంది ఈ హైవే. కనువిందు చేసే అందాలనే కాదు ఎన్నో అద్భుతాలను కలిగివుంది ఈ రోడ్డుమార్గం. ఇదే కారకోరం హైవే.
రెండు దేశాలను కలిపే రోడ్డు కాబట్టి దీన్ని 'ప్రెండ్ షిప్ హైవే' అనికూడా అంటారు. చైనా పాకిస్థాన్ మధ్య సరుకు రవాణాకే కాకుండా ఇరుదేశాల వ్యూహాత్మక అవసరాల కోసం దీన్ని నిర్మించారు. 1962 లో ఈ రోడ్డు నిర్మాణం ప్రారంభమే 1979 లో పూర్తయ్యింది... 1986 నుండి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ హసన్ అబ్దాల్ నుండి చైనాలోని జిన్ జియాంగ్ ఉయ్గుర్ వరకు ఈ హైవే సాగుతుంది.
ఈ హైవే హిమాలయా పర్వతాల్లోని కారకోరం పర్వతశ్రేణి గుండా సాగుతుంది. ఇది గరిష్టంగా 4,714 మీటర్లు అంటే 15,466 అడుగుల ఎత్తులో వుంటుంది. అందువల్లే ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రహదారిగా గుర్తింపు పొందింది. అత్యంత ఎత్తైన కొండలపైనుండి సాగుతూ చాలా సంక్లిష్ట వాతావరణ పరిస్థుతుల్లో నిర్మించబడింది... అందువల్ల దీన్ని ప్రపంచంలో ఎనిమిదవ వింతగా పేర్కొంటారు.
Karakoram Highway
కారకోరం హైవే ప్రత్యేకతలు :
ఈ కారకోరం హైవే దాదాపు 1,300 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇది ప్రపంచంలోని అత్యంత విలక్షణమైన రహదారిగా గుర్తింపుపొందింది. ఎందుకంటే ఇది పర్వతాలు, మంచు ప్రాంతాల్లో, లోయల గుండా ప్రయాణిస్తుంది. కారకోరం హైవే కేవలం ఒక రహదారి మాత్రమే కాదు ఇది ఒక గొప్ప చరిత్రను నిదర్శనం. పురాతన సిల్క్ రోడ్ మార్గాల్లో ఇది ఒకటి. సిల్క్ రోడ్ అనేది యూరోపు మరియు ఆసియా మధ్య పురాతన వాణిజ్య మార్గం.
ఈ హైవే ప్రధానంగా హిందుకుశ్, కారకోరం, హిమాలయ పర్వత శ్రేణుల గుండా ప్రయాణిస్తుంది. ఈ ప్రాంతం భూగోళంలో అత్యంత ఉన్నతమైన, సాహసోపేతమైన ప్రాంతాలలో ఒకటి. ఇక్కడ ప్రయాణం అనేది ఒక అనుభవం మాత్రమే కాదు ప్రకృతితో ఒక అద్భుతమైన సంబంధాన్ని కూడా ఏర్పడుతుంది.
ఈ ప్రాజెక్టులో పాకిస్తాన్, చైనా ఇంజినీర్లు, కార్మికులు కలిసి పనిచేసారు.ఈ నిర్మాణం చాలా కష్టమైన పరిస్థితుల్లో జరిగింది... పర్వతాలు, మంచు, భూకంపాలు, మరియు కఠినమైన వాతావరణం వంటి అనేక సవాళ్లను ఎదుర్కొనవలసి వచ్చింది. ఈ హైవే నిర్మాణం ఒక సాంకేతిక ప్రతిభను ప్రతిబింబిస్తుంది.
Karakoram Highway
కారకోరం హైవే ప్రయాణంలో ఆకర్షణలు:
1. పర్వతాల నడుమ అద్భుతమైన దృశ్యాలు:
కారకోరం హైవేపై ప్రయాణం అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ఎత్తైన పర్వతాల మధ్య మలుపులు తిరుగుతూ రోడ్డు సాగుతుంది. చుట్టూ ఆకాశాన్ని తాకేలా అందమైన మంచుకొండలు, హిమాని నదులు, సరస్సులు... అబ్బో ఈ అందాలను మాటల్లో వర్ణించలేమని ఆ మార్గంలో ప్రయాణించిన పర్యాటకులు తమ అనుభూతులు పంచుకుంటారు.
2. ఖుంజెరాబ్ పాస్ (ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎత్తైన అంతర్జాతీయ సరిహద్దు):
ఖుంజెరాబ్ పాస్, ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సరిహద్దు క్రాస్‌పాయింట్. కారకోరం హైవే ప్రయాణంలో ముఖ్యమైన భాగంగా నిలుస్తుంది. ఈ పాస్ అత్యధిక ఎత్తులో ఉన్నందున ఇది ప్రకృతి అందాలతో పాటు చరిత్రకు ఒక ముఖ్యమైన గమ్యస్థలంగా మారింది.
3. నదులు, సరస్సులు, పర్యాటక ప్రదేశాలు :
కారకోరం హైవే పర్యాటక ప్రదేశాలకు ప్రసిద్ధి చెందింది. హున్జా లోయ, అట్టాబాద్ సరస్సు వంటి ప్రదేశాలు ప్రత్యేక ఆకర్షణలు. ఈ ప్రాంతాలలో పర్యాటకులకు నదులు, సరస్సులు, పర్వత శ్రేణులను చూసే అవకాశం ఉంటుంది.
Karakoram Highway
సాహసోపేతమైన ప్రయాణం:
కారకోరం హైవే రహదారిపై ప్రయాణం కేవలం రవాణా మార్గం మాత్రమే కాదు అది ఒక సాహస అనుభవం. ఇది ప్రకృతి అందాలు మాత్రమే కాదు చరిత్ర, సంస్కృతికి నిదర్శనం. ఈ ప్రయాణం ద్వారా ప్రపంచంలో ఎన్నో అద్భుతాలను చూడవచ్చు. అలాగే సంస్కృతిక వారసత్వాన్ని తెలుసుకోవచ్చు.
కారకోరం హైవే పర్యాటకులకు, సాహసికులకు, చరిత్రను ఆస్వాదించే వారికి ఒక ఉత్తమ గమ్యం. ఇది ఎంతో ప్రాముఖ్యతను కలిగి వుంది.ఈ రహదారిపై ప్రయాణం జీవితంలో అద్భుతమైన అనుభవాన్ని మిగిలిస్తాయి.