Silver Wedding Card : వామ్మో.. పెళ్లి పత్రిక రేటు రూ. 25 లక్షలా? వైరల్ అవుతున్న ఫోటోలు!
Silver Wedding Card : జైపూర్‌కు చెందిన ఒక తండ్రి తన కూతురి పెళ్లి కోసం 3 కిలోల వెండితో రూ. 25 లక్షల విలువైన అద్భుతమైన శుభలేఖలను తయారు చేశారు. ఇందులో 65 మంది దేవతామూర్తులను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ వెడ్డింగ్ కార్డ్ వైరల్ గా మారింది.

వామ్మో.. పెళ్లి పత్రిక రేటు రూ. 25 లక్షలా? ఇందులో ఏముందో చూస్తే షాక్ అవుతారు!
Silver Wedding Card : సాధారణంగా పెళ్లిళ్లలో వెరైటీ ఆహ్వాన పత్రికలు ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం. కానీ రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఓ తండ్రి తన కూతురి వివాహం కోసం ఏకంగా వెండితో ఒక అద్భుతమైన కళాఖండాన్ని సృష్టించారు. జైపూర్‌కు చెందిన శివ్ జోహ్రి అనే వ్యక్తి తన కుమార్తె శ్రుతి జోహ్రి వివాహం కోసం కాగితంతో కాకుండా, ఏకంగా 3 కిలోల స్వచ్ఛమైన వెండితో వివాహ ఆహ్వాన పత్రికను తయారు చేయించారు. దీని విలువ దాదాపు రూ. 25 లక్షలు ఉంటుందని సమాచారం. ఈ వెండి పెళ్లి పత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఒక్క మేకు కూడా వాడకుండా అద్భుత నిర్మాణం
ఈ వెండి శుభలేఖను బాక్స్ ఆకారంలో తయారు చేశారు. దీని పొడవు 8 అంగుళాలు, వెడల్పు 6.5 అంగుళాలు కాగా, లోతు 3 అంగుళాలు ఉంటుంది. ఈ మొత్తం నిర్మాణాన్ని 128 వేర్వేరు వెండి ముక్కలతో రూపొందించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ మొత్తం కళాఖండంలో ఒక్క మేకు గానీ, స్క్రూ గానీ ఉపయోగించలేదు. కేవలం వెండి ముక్కలను ఒకదానితో ఒకటి అమర్చి దీనిని సిద్ధం చేశారు. ఈ అద్భుతమైన డిజైన్ పూర్తి చేయడానికి శివ్ జోహ్రికి దాదాపు ఒక సంవత్సరం సమయం పట్టింది.
వెండి వెడ్డింగ్ కార్డులో 65 మంది దేవతామూర్తుల ప్రతిమలు
ఈ వెండి పత్రికలో హిందూ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా 65 మంది దేవతామూర్తులను అత్యంత నైపుణ్యంతో చెక్కారు. శుభలేఖ పైభాగంలో గణపతి కొలువై ఉండగా, ఆయనకు కుడివైపున పార్వతీ దేవి, ఎడమవైపున శివుడు ఉన్నారు. వీరి కింద లక్ష్మీదేవి, విష్ణువు ప్రతిమలను పొందుపరిచారు. అంతేకాకుండా, శ్రీకృష్ణుడి లీలలు, విష్ణువు దశావతారాలు, దక్షిణ భారత శైలిలో కృష్ణుడు, ఎనిమిది ఆవులను కూడా ఇందులో చిత్రీకరించారు. బాక్స్ వెలుపలి భాగంలో అష్టలక్ష్ములు తమ పరివారంతో పాటు సూర్య భగవానుడితో దర్శనమిస్తున్నారు.
తిరుమల తిరుపతి వెంకన్న కూడా
ఈ కార్డులో తిరుపతి వెంకటేశ్వర స్వామి రెండు రూపాల్లో దర్శనమిస్తారు. కార్డు వెనుక భాగంలో తిరుపతి వెంకన్న భారీ చిత్రం ఉండగా, పైన సూర్య భగవానుడు ప్రకాశిస్తున్నట్లుగా రూపొందించారు. కార్డు అంచుల వెంబడి ఏనుగులు, గుర్రాలు, నెమళ్లు వంటి జంతువుల బొమ్మలతో పాటు, 40 ఏనుగు ముఖాలను అద్భుతంగా చెక్కారు. ద్వారపాలకులు, చామరలు వీస్తున్న సేవకులు, శంఖం, డప్పులు వాయిస్తున్న దేవతామూర్తుల చిత్రాలు ఈ పత్రికకు మరింత శోభను తెచ్చాయి. రాముని దర్బార్, శివ కల్యాణం, తిరుపతి ఆలయ ద్వారాలు, రాధాకృష్ణులు, శేషనాగుపై పవళించిన విష్ణుమూర్తి వంటి పౌరాణిక ఘట్టాలను కూడా ఇందులో చూడవచ్చు.
వధువరుల వివరాలు.. తండ్రి ఏం చెప్పరంటే?
ఈ దేవతామూర్తుల నడుమ వధువు శ్రుతి జోహ్రి, వరుడు హర్ష్ సోని పేర్లను చెక్కారు. వారి పేర్ల చుట్టూ ఏనుగులు పూల వర్షం కురిపిస్తున్నట్లుగా డిజైన్ చేశారు. కార్డు లోపల వధూవరుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల పేర్లను చెక్కారు.
శివ్ జోహ్రి మాట్లాడుతూ, "నా కూతురి పెళ్లికి బంధువులను మాత్రమే కాదు, సకల దేవతలను కూడా ఆహ్వానించాలన్నదే నా కోరిక. ఆరు నెలల పాటు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. నా బిడ్డకు తరతరాలు గుర్తుండిపోయేలా, భవిష్యత్ తరాలు చూసి గర్వపడేలా ఏదైనా ఇవ్వాలనుకున్నాను. అందుకే స్వయంగా ఏడాది పాటు కష్టపడి దీనిని తయారు చేశాను" అని భావోద్వేగంతో తెలిపారు. ఈ వెండి శుభలేఖను వరుడి కుటుంబానికి లాంఛనంగా అందజేయనున్నారు.

