INSIGHT : ఇన్‌సైట్‌లో 'నాయకత్వం' గురించిన ఇస్రో చీఫ్ కామెంట్స్ వైరల్ !
ISRO Chief Somnath: ఇస్రో చీఫ్ డాక్టర్ ఎస్. సోమనాథ్ ఇన్‌సైట్‌లో 'సంస్థాగత నాయకత్వం' వ్యక్తిగత, సంస్థాగత అభివృద్ధికి ఎలా దోహదపడుతుందనే విషయాలు వివరించారు. ఇస్రో శాస్త్రవేత్తల ప్రేరణాదాయక పాత్ర, ఆవిష్కరణల సంస్కృతి గురించి ఆయన ప్రస్తావించారు.
ఈశా అకాడమీ నిర్వహించిన నాలుగు రోజుల శిక్షణా సదస్సు ( నవంబర్ 21నుంచి 24 వరకు ) కోయంబత్తూర్‌లోని ఈశా యోగా కేంద్రంలో జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇన్‌సైట్ లో సక్సెస్ డీఎన్‌ఏ 13వ ఎడిషన్ తొలిరోజు ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్. సోమనాథ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇస్రోలో 'సంస్థాగత నాయకత్వం' వ్యక్తిగత, సంస్థాగత అభివృద్ధికి ఎలా దోహదపడిందో ఆయన వివరించారు. ఇస్రో శాస్త్రవేత్తలు ఎల్లప్పుడూ ప్రేరణగా నిలిచారనీ, వారు ఆవిష్కరణలు, అన్వేషణ, నిర్భయ సంస్కృతిని నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారన్నారు. తక్కువ బడ్జెట్‌తో అద్భుతమైన అంతరిక్ష ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ఎంతో సహాయపడ్డారని డాక్టర్ సోమనాథ్ అన్నారు.
ఇస్రో ప్రముఖుల్లో ఒకరు, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంను స్మరించుకున్నారు. భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం రాకెట్లను నిర్మించిన వారితో కలిసి పనిచేసేవారని పేర్కొంటూ.. ప్రజల్లో చాలా శక్తి ఉందని, ఆ శక్తిని ఉపయోగించి మనం కోరుకున్నది సాధించవచ్చని డాక్టర్ సోమనాథ్ చెప్పారు.
వెల్స్పన్ లివింగ్ లిమిటెడ్ సీఈఓ, ఎండి దీపాలి గోయెంకా కార్యక్రమ నిర్వాహకుడు బి.ఎస్. నాగేష్‌తో చర్చలో సంప్రదాయ మార్వాడీ కుటుంబంలో యువతిగా, ప్రపంచంలోనే అతిపెద్ద హోమ్ టెక్స్‌టైల్ కంపెనీల్లో ఒకటైన వెల్స్పన్ లివింగ్‌ను స్థాపించే వరకు తన ప్రయాణం గురించి మాట్లాడారు. వెల్స్పన్‌లో చేరినప్పుడు కేవలం 7% మంది మహిళలు ఉండేవారనీ, నేడు 30% మంది మహిళలు పనిచేస్తున్నారని దీపాలి చెప్పారు.
వెల్స్పన్ లివింగ్ లిమిటెడ్‌లో దాదాపు 15,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారనీ, ఏదైనా ప్రారంభించినప్పుడు కేవలం విజయం కోసం చూడకూడదనీ, ఆ ప్రయాణాన్ని ఆస్వాదించాలని, ఆ ప్రయాణంలోనే మనం నేర్చుకుంటామన్నారు. అలాగే, ప్రతిదానిలోనూ విజయం సాధించలేము కానీ ఆ ప్రక్రియలో నేర్చుకుంటూ, అభివృద్ధి చెందుతామని దీపాలి అన్నారు.
భారతదేశం ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ దేశం అనీ, కానీ 250 ఏళ్ల ప్రయాణంలో వ్యాపారవేత్తలు ఉద్యోగాల కోసం వెతుక్కునే వారిగా మారారని సద్గురు జగ్గీ వాసుదేవ్ అన్నారు. అదృష్టవశాత్తూ ఈ తరం ఆ ఆలోచనా విధానాన్ని వీడుతోందనీ, మన దేశంలో 10 కోట్లకు పైగా వ్యాపారవేత్తలు ఉన్నారని, ఇది ప్రపంచంలోనే అత్యధికమని, ఇప్పుడు మన దేశంలో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలని సద్గురు అన్నారు.
తొలిరోజు మధ్యాహ్నం భోజన విరామం తర్వాత జరిగిన సెషన్‌లో ఈశా సంస్కృతి విద్యార్థులు భారతీయ శాస్త్రీయ నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఈశా సంస్కృతి అనేది భారతీయ సంగీతం, నృత్యం, మార్షల్ ఆర్ట్స్, యోగాలకు సంబంధించిన ఒక గురుకుల పాఠశాల.