ప్రయాగరాజ్ కుంభమేళాకు తెలుగోళ్ల పయనం : తెలంగాణ, ఏపీ నుండి ఎలా వెళితే ఎంత ఖర్చవుతుంది?
ప్రయాగరాజ్ కుంభమేళాలు తెలుగు రాష్ట్రాల నుండి చాలామంది వెళుతున్నారు. ఇలా మీరు కూడా వెళ్లాలని ప్లాన్ చేసారా? అయితే ఎక్కడినుండి ఎలా వెళితే ఎంత ఖర్చవుతుందో తెలుసుకొండి.

Kumbh mela 2025
Kumbh mela 2025 : గంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర సంగమం ప్రయాగరాజ్ లో కుంభమేళా అట్టహాసంగా సాగుతోంది. ఉత్తర ప్రదేశ్ లోని కుంభమేళా ప్రాంతం కోట్లాదిమంది పర్యాటకులతో నిండిపోయింది. దేశవిదేశాల నుండి ప్రయాగరాజ్ కు పర్యాటకుల తాకిడి పెరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక కార్యక్రమంలో సాధుసంతులు, సన్యాసులు, పండితులే లక్షల్లో హాజరయ్యారంటూ సామాన్య ప్రజల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.
ప్రయాగరాజ్ కుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుండి ప్రజలు భారీగా తరలివెళుతున్నారు. హైదరాబాద్ తో పాటు విశాఖపట్నం, విజయవాడ నుండి కూడా ప్రయాగరాజ్ కు విమాన సర్వీసులు వున్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల నుండి రైళ్లు, బస్సులు కూడా ప్రయాగరాజ్ కు వెళుతున్నారు. ఇలా ప్రయాణ సౌకర్యం బాగా వుండటంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు సులువుగా ప్రయాగరాజ్ చేరుకుని కుంభమేళాలో పాల్గొంటున్నారు.
Kumbh mela 2025
హైదరాబాద్ నుండి ప్రయాగరాజ్ ప్రయాణం :
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుండి ప్రయాగరాజ్ కు విమాన సర్వీసులు వున్నాయి. అయితే అత్యవసరంగా కుంభమేళాకు వెళ్లాలనుకునే హైదరాబాదీలకు టికెట్ ధర కాస్త ఎక్కువ పడుతుంది... ఈ జనవరి చివరివరకు ప్రయాగరాజ్ కు రూ.30,000 నుండి రూ.40,000 వేల వరకు టికెట్ ధర వుంది. ఇదే ఫిబ్రవరిలో వెళ్లాలనుకుని ఇప్పుడే టికెట్ బుక్ చేస్తే రూ.20,000 నుండి రూ.30,000 టికెట్ ధర వుంది. శంషాబాద్ విమానాశ్రయం నుండి చాలా విమానాలు అందుబాటులో వుంటాయి.
ఇక ట్రావెల్ ఏజన్సీలు కూడా కుంభమేళా నేపథ్యంలో హైదరాబాద్ - ప్రయాగరాజ్ మధ్య ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నాయి. ఈ బస్సు ఛార్జీలు రూ.2000 నుండి రూ.6000 వరకు వున్నాయి. అయితే హైదరాబాద్ నుండి ప్రయాగరాజ్ వరకు వెళ్లడానికి దాదాపు ఒకరోజు సమయం పడుతుంది... అంటే 24 గంటలు బస్సులోనే ప్రయాణంచేయాలన్నమాట.
రైల్వే కూడా కుంభమేళా నేపథ్యంలో హైదరాబాద్ - ప్రయాగరాజ్ కు రైళ్లు నడుపుతోంది. ప్రతిరోజూ ఈ మార్గంలో రైలు సదుపాయం వుంది. విమాన, బస్సు సర్వీసులతో పోలిస్తే రైలు ప్రయాణం చాలా చవకైనది. కేవలం రూ.1000 ఖర్చుతో రైలులో ప్రయాగరాజ్ వెళ్లవచ్చు... అంటే పోనురాను కేవలం రూ.2000 మాత్రమే ఖర్చయితాయి. స్లీపర్, ఏసీ కోచుల్లో అయితే టికెట్ ధర ఎక్కువగా వుంటుది.
ఇలా హైదరాబాద్ నుండి ప్రయాగరాజ్ కు విమానాలు, బస్సులు, రైళ్లు నడుస్తున్నాయి. ప్రయాణ సదుపాయం బాగుంది కాబట్టి ఇక్కడినుండి భారీగా ప్రయాగరాజ్ కుంభమేళాకు తరలుతున్నారు. తెలంగాణ ప్రజలే కాదు ఏపీ ప్రజలు కూడా హైదరాబాద్ నుండి ప్రయాగరాజ్ కు పయనం అవుతున్నారు.
Kumbh mela 2025
ఏపీ నుండి ప్రయాగరాజ్ కు ఎలా వెళ్ళాలి :
ఆంధ్ర ప్రదేశ్ నుండి కూడా ప్రయాగరాజ్ కు విమానం లేదా ట్రైన్,బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. విమానంలో అయితే తొందరగా గమ్యాన్ని చేరవచ్చు... కానీ ఖర్చు ఎక్కువ అవుతుంది. ఈ ట్రైన్, బస్సులో ఖర్చు తక్కువ... ప్రమాణ సమయంమాత్రం ఎక్కువ. ఎవరి వీలును బట్టి వారు కుంభమేళా ప్రయాణాన్ని ఎంచుకుంటున్నారు.
విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాల నుండి ప్రయాగరాజ్ కు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఇక్కడినుండి కూడా జనవరిలో అయితే రూ.40,000 నుండి రూ.50,000 వరకుటికెట్ ధరలు వున్నాయి... ఫిబ్రవరిలో కాస్త తక్కువగా వున్నాయి.
ఇక ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల నుండి ప్రయాగరాజ్ కు రైల్వే, బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. విమానాలతో పోలిస్తే వీటిలో కాస్త తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చు. ముఖ్యంగా ప్రయాగరాజ్ కు ఏపీనుండి ప్రత్యేక బస్సులు ఎక్కువగా వెళుతున్నాయి.
ఏపిఎస్ ఆర్టిసి రాజమండ్రి, కొవ్వూరు నుండి ప్రత్యేక బస్సులను ప్రయాగరాజ్ ఏర్పాటుచేసింది. కొవ్వూరు నుండి ప్రత్యేక టూర్ ప్యాకేజి కింద కుంభమేళాకు బస్సు ఏర్పాటుచేసారు... ఇది ఫిబ్రవరి 1 నుండి ఏడురోజుల పాటు ప్రయాణం. టూర్ ప్యాకేజ్ ధర రూ.10,000.
ఇక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతి రద్దీ పూర్తికాగానే ఇప్పుడు కుంభమేళాకు బస్సులు నడుపుతున్నాయి పలు ప్రైవేట్ ట్రావెల్ ఏజన్సీలు. ప్రజలు కూడా కుంభమేళాపై ఆసక్తిగా వుండటంతో మంచి గిరాకీ దొరుకుతోందని ట్రావెల్స్ సంస్థలు చెబుతున్నాయి.
Kumbh mela 2025
ప్రయాగరాజ్ లో తెలుగు ప్రజల సందడి :
ఇలా విమానాలు, బస్సులు, రైళ్లలో ప్రయాగరాజ్ కుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుండి భారీగా ప్రజలు తరలివెళుతున్నారు. ముఖ్యంగా నడివయస్కులు, వృద్దులు కుంభమేళాకు వెళ్ళేందుకు ఆసక్తి చూపుతున్నారు. పవిత్ర సంగమంలో స్నానం చేసి పుణ్యఫలాన్ని పొందాలని అనుకుంటున్నారు. దీంతో ప్రయాగరాజ్ లో తెలుగువారి సందడి కనిపిస్తోంది.
తెలుగు ప్రజల నుండి ప్రయాగరాజ్ కుంభమేళా సర్వీసుల గురించి విచారణకు ఎక్కువగా కాల్స్ వస్తున్నాయని ప్రముఖ ట్రావెల్ సంస్థలు చెబుతున్నాయి. ప్రయాగరాజ్ కుంభమేళా ప్రయాణాల విషయంలో డిల్లీ, ముంబై వంటి నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతోంది.అంతేకాదు ప్రయాగరాజ్ కుంభమేళాలో వసతి వివరాల కోసం కూడా తెలుగువాళ్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారని పలు ట్రావెల్స్ సంస్థలు చెబుతున్నాయి.
మొత్తంగా 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న ప్రయాగరాజ్ కుంభమేళాకు తెలుగువారు పోటెత్తారు. కేవలం సామాన్యులే కాదు తెలుగు పండితులు, సన్యాసులు, సాధువులు కూడా ప్రయాగరాజ్ లో కనిపిస్తున్నారు. కొన్నిచోట్ల అయితే తెలుగువారే ఎక్కువగా కనిపిస్తున్నారు... దీంతో మనం గంగానది ఒడ్డున వున్నామా లేక గోదావరి తీరంలో వున్నామా అన్న అనుమానం కలగక మానదని అక్కడికి వెళ్లివచ్చిన పర్యాటకులు చెబుతున్నారు.