కుక్కలు కేవలం వాసన చూసి నేరస్తులను ఎలా పట్టుకుంటాయబ్బా!!
ఏదయినా నేరం జరిగినపుడు పోలీసులు డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపడం మనం చూస్తుంటాం. ఈ కుక్కలు నేరం జరిగిన ప్రాంతంలోని వస్తువుల వాసనచూసి నేరస్తులను గుర్తిస్తాయి. కుక్కలు ఇలా వాసన చూసి మనుషులను ఎలా గుర్తిస్తాయో తెలుసా?

Dog Sense of Smell
Dog Sense of Smell : పెంపుడు జంతువుల్లో కుక్కలు చాలా తెలివైనవి. మిగతా ఏ జంతువులకు లేని ప్రత్యేక లక్షణాలు కుక్కలకు వుంటాయి... మనిషి భావాలను అర్థం చేసుకోవడమే కాదు అంతకు మించిన పనులు చేయగలవు. మనిషి కంటికి కనిపించని వాటినికూడా కుక్కలు కేవలం వాసనతో కనిపెట్టగలవు. అందువల్లే వీటికి మిగతా జంతువుల కంటే ప్రత్యేక స్థానం దక్కింది.
సహజంగానే కుక్కలు వాటి కళ్ల కంటే ముక్కునే ఎక్కువగా నమ్ముతాయి... ఇక వాటికి శిక్షణ ఇస్తే మరింత రాటుదేలతాయి. అందువల్లే ఏదైనా నేరం జరిగితే నిందితులను గుర్తించేందుకు పోలీసులు సైతం కుక్కలను ఉపయోగిస్తారు. ఇంత టెక్నాలజీ పెరిగినా ఇప్పటికీ వీటినే ఉపయోగిస్తున్నారంటే అవి ఎంత ఖచ్చితంగా పనిచేయగలవో అర్థం చేసుకోవచ్చు.
ఇక కొన్నిజాతుల కుక్కలు తమ యజమానుల పట్ల చాలా విదేయతను ప్రదర్శిస్తాయి... వారిపై ఎవరైన దాడిచేయడానికి ప్రయత్నించినా,కొత్తవారు ఇంటి పరిసరాల్లోకి వచ్చినా వెంటనే గుర్తిస్తాయి. ఇలా కొత్తవారిని కూడా వాసనను బట్టి కనిపెడతాయి. అందువల్ల చాలామంది కుక్కలకు రక్షణ కోసం పెంచుకుంటూ వుంటారు.
అయితే ఇలా కుక్కలు వాసనతో మనుషులను, వారి వస్తువులను ఎలా గుర్తుపడతాయి? ఈ విషయంలో ఇంత తెలివైన మనిషికంటే కుక్కలే మెరుగ్గా పనిచేయడానికి కారణమేంటి? కుక్కలు కళ్లతో చూసినదానికంటే ముక్కుతో చూసిన వాసననే ఎందుకు అంతలా నమ్ముతాయి? తదితర విషయాల గురించి తెలుసుకుందాం.
Dog Sense of Smell
కుక్కల శ్వాస వ్యవస్థ ఎలా పనిచేస్తుంది :
మనిషి ముక్కు కేవలం శ్వాస తీసుకోడానికి, వాసనను పసిగట్టడానికి ఉపయోగపడుతుంది. చాలా జంతువుల్లోనూ ముక్కు పనితీరు ఇదే. కానీ కుక్కల్లో ఈ శ్వాసవ్యవస్థ మనుషుల్లో కంటే చాలా మెరుగ్గా వుంటుంది...ఇది కేవలం శ్వాస తీసుకోడానికే కాదు వాసన బట్టి మనిషిని, వస్తువులను గుర్తించేంత స్ట్రాంగ్ గా వుంటుంది.
కుక్కల్లో ఘ్రాణ వ్యవస్థ (వాసన కోసం ఉపయోగించే ఇంద్రియ వ్యవస్థ) చాలా మెరుగ్గా పనిచేస్తుంది. చాలా జంతువుల్లో ఈ వ్యవస్థ మానవుడి కంటే మెరుగ్గా వుంటుంది... కుక్కల్లో ఇది ఇంకా ఎక్కువగా వుంటుంది. కుక్క ముక్కు మనిషి కంటే 1,00,000 నుండి 10,00,000 రెట్లు సున్నితంగా వుంటుంది. బ్లడ్ హౌండ్ వంటి జాతుల్లో ఇది 100 మిలియన్ల రెట్లు సున్నితంగా వుంటుంది.
కుక్క మెదడు కూడా ఈ వాసన ద్వారా పనిచేసేలా ఏర్పడి వుంటుంది. మనిషి మెదడులో కేవలం 5 శాతం వాసనను గుర్తించేందుకు కేటాయించబడివుంటే కుక్కల్లో ఇద 33 శాతం వుంటుంది. అందువల్లే కుక్కలు కళ్ల కంటే ముక్కు చాలా పవర్ ఫుల్... ఆహారాన్ని కనుక్కోడానికి, వేటాడే జంతువుల నుండి రక్షణ పొందడానికి ఇవి కళ్ల కంటే ముక్కునే ఉపయోగిస్తుంది.
కుక్క ముక్కులోని రెండు నాసికా రంధ్రాలు సెప్టం ద్వారా విభజించబడ్డాయి. మానవులు ఒకే వాయుమార్గాల ద్వారా వాసన చూస్తారు, ఊపిరి పీల్చుకుంటారు. కానీ కుక్కలు గాలి పీల్చినప్పుడు వాటి నాసికా రంధ్రం లోపల రెండు విభిన్న ప్రాంతాలకు అది చేరుతుంది. ఒకటి గాలిని ఊపిరితిత్తులకు చేర్చడంతో పాటు వాసన చూడటానికి మళ్ళిస్తుంది. రెండవది వాసనను గుర్తించే గ్రాహకాలతో నిండిన ఘ్రాణ ప్రాంతంలోకి ప్రవహిస్తుంది.
మానవులలో ఈ గ్రాహకాలు దాదాపు 6 మిలియన్లు ఉండగా కుక్కలలో 300 మిలియన్ల వరకు ఉంటాయి. ఉదాహరణకు మీరు ఒక మూసివున్న గదిలో పెర్ఫ్యూమ్‌ను వాసన చూడగలిగితే ఒక కుక్క అది ఎంతవరకు వ్యాపించింతో గుర్తించగలదు. కుక్కల ప్రతి నాసికా రంధ్రం మరొకదానితో సంబంధం లేకుండా పనిచేస్తుంది. వాసన ఎక్కడి నుండి వస్తుందో కుక్క గుర్తించడంలో సహాయపడుతుంది.
మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు గాలి అది వచ్చిన విధంగానే బయటకు వెళుతుంది. అయితే కుక్కలు ఊపిరి పీల్చుకున్నప్పుడు గాలి వాటి ముక్కు వైపులా ఉన్న చీలికల ద్వారా బయటకు వెళుతుంది. కాబట్టి కొత్త వాసనలు ఏకకాలంలో ముక్కులోకి ప్రవేశించవచ్చు... వాటిని మెదడు చాలా వేగంగా విశ్లేషించగలుగుతుంది. తద్వారా ఆ వాసనకు సంబంధించి వస్తువులను గానీ, మనుషులనుగానీ కుక్కలు వెంటనే పనిగడతాయి.
కొన్ని పరిశోధనల ప్రకారం కుక్కలు మనుషుల కోపం, ఒత్తిడి, నొప్పి వంటి భావాలను అర్థం చేసుకోగలవు. అంతేకాదు మధుమేహం, చర్మ క్యాన్సర్ వంటి కొన్ని వ్యాధులను కూడా గుర్తించగలవని తేలింది.
రక్షణ వ్యవస్థలో కుక్కల పాత్ర :
కుక్కలు చాలాకాలంగా డ్రగ్స్,పేలుడు పదార్థాలను పసిగట్టడానికి ఉపయోగించబడుతున్నాయి. అంతేకాదు శవాలు, రక్తం, ఇతర వస్తువుల వాసనను బట్టి నేరస్తులను గుర్తించడం, దర్యాప్తులో సహాయం చేస్తున్నాయి. ఇలా సివిల్ పోలీసులకే కాదు ఎక్సైజ్ పోలీసులకు కుక్కలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
కస్టమ్స్ అధికారుల కూడా కుక్కల వల్ల చాలా ప్రయోజనం కలుగుతోంది. నిషిద్ద ఎలక్ట్రానిక్స్, పెద్దమొత్తంలో డబ్బులు, డ్రగ్స్ వంటివి గుర్తించేందుకు కుక్కల సహాయం తీసుకుంటున్నారు. ఇలా శిక్షణ పొందిన కుక్కలు పోలీస్ శాఖలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి.
భూకంపం లేదా భవనం కూలిపోవడం వంటి విపత్తు తర్వాత పరిశోదన, రెస్క్యూ బృందాలలో కూడా కీలకమైన భాగంగా ఉన్నాయి. ఈ కుక్కల కోసం డాగ్ స్క్వాడ్ అనే విభాగమే వుంది. వీటి కోసం ప్రత్యేకంగా శిక్షణపొందిన పోలీసులను కూడా నియమిస్తున్నారు.
ఇలా పోలీస్ వ్యవస్థలోనే కాదు సామాన్యులు సైతం కుక్కలను రక్షణ కోసం పెంచుకుంటారు. కొందరు వేట కోసం ప్రత్యేకంగా కొన్నిజాతులను పెంచుతారు. ఇవి చాలా ప్రమాదకరంగా వుంటాయి. ఇలాంటి కుక్కలు తమ యజమానులకు ఏ హాని తలపెట్టవు... కానీ ఇతరులను చీల్చిచెండాడుతాయి. ఇలాంటి కుక్కలతో నేరాలను కూడా చేయిస్తుంటారు... అంటే ఈ కుక్కలను మంచికోసమే కాదు చెడుకోసం కూడా ఉపయోగిస్తున్నారు.
కుక్కలు వాసన సామర్థ్యం అనేక విషయాలపై ఆధారపడి వుంటుంది. కుక్కల వయసు పెరుగుతున్నకొద్ది ఈ వాసన ద్వారా మనుషులు, వస్తువులను పసిగట్టే సామర్థ్యం తగ్గుతుంది. అలాగే గాలి ప్రభావం కూడా వీటిపై వుంటుంది. గాలి ఎక్కువగా వుండే ప్రాంతాల్లో తక్కువ ప్రభావవంతంగా, తక్కువ గాలి ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తాయి.