అయ్యో పాపం... గూగుల్ మ్యాప్ ను నమ్ముకుంటే నట్టేట ముంచింది
ఈజీగా గమ్యస్థానానికి చేరుస్తుందని నమ్ముకున్న జిపిఎస్ నావిగేషన్ ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. ఈ విషాద ఘటన ఎలా జరిగిందంటే..
GPS Navigation accidents
GPS Navigation : ప్రస్తుతం మనిషి జీవితం టెక్నాలజీమయం అయిపోయింది. ఈ టెక్ జమానాలో ఏది కావాలన్నా సులువుగా మన దగ్గరకే వస్తోంది... దీంతో మనిషి నిత్యజీవితం చాలా సులభం అయ్యింది. అయితే ఈ టెక్నాలజీతో కేవలం లాభాలే కాదు నష్టాలు కూడా వున్నాయి... అప్పుడప్పుడు దీనివెనక భారీ ప్రమాదాలు కూడా పొంచివుంటున్నాయి. ఇలా సాంకేతికతను నమ్ముకున్న ముగ్గురి ప్రాణాలు గాల్లో కలిసిన దారుణం ఉత్తర ప్రదేశ్ లో వెలుగుచూసింది.
GPS Navigation accidents
ప్రాణాలుతీసిన GPS Navigation :
ఉత్తర ప్రదేశ్ కు చెందిన ముగ్గురు వ్యక్తులు కారులో బరైలీ నుండి దాతాగంజ్ కు బయలుదేరారు. వారికి ఆ మార్గం కొత్త కావడంతో జిపిఎస్ నావిగేషన్ ను ఉపయోగించారు... అది ఎలా చూపిస్తే అలా ప్రయాణించారు. ఇలా గుడ్డిగా టెక్నాలజీని నమ్మడమే వారి ప్రాణాలు తీసింది.
వీరు ప్రయాణిస్తున్న రామ్ గంగా నదిపై ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ నదిపై వున్న బ్రిడ్జి కూలిపోయింది... కానీ జిపిఎస్ లో మాత్రం ముందుకు వెళ్లవచ్చని సూచించింది. దీంతో కారు బ్రిడ్జిపై మంచి వేగంతో ముందుకు వెళ్లింది... ఈ క్రమంలో ఒక్కసారిగా కూలిన బ్రిడ్జి కనిపించగా కారు వేగం నియంత్రణ కాలేదు. దీంతో కారు అదే వేగంతో దూసుకెళ్లి అమాంతం నదిలో పడిపోయింది.
కారు నీటిలో కొట్టుకుపోవడంతో అందులోని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో మృతదేహాలను గుర్తించి బయటకు తీసారు. పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు.
GPS Navigation accidents
తప్పెవరిది?
ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకున్న ఈ ఘటన టెక్నాలజీ తప్పిదాలనే కాదు అధికారుల నిర్లక్ష్యాన్ని కూడా బయటపెట్టింది. బ్రిడ్జి కూలిపోయి చాలా రోజులైన జిపిఎస్ నావిగేషన్ లో అప్ డేట్ కాకపోవడం... అదే దారిని చూపించడం ప్రమాదానికి ప్రధాన కారణం. కానీ ఇదొక్కటే కారణం కాదు.
బ్రిడ్జి కూలిన విషయం అధికారులకు తెలుసు... కాబట్టి దానిపైకి ఎవ్వరూ వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత అధికారులది. హెచ్చరిక బోర్డులో, బారీకేడ్లో పెడితే జిపిఎస్ నావిగేషన్ ను అనుసరించేవారు కూడా జాగ్రత్త పడేవారు. కానీ అలాంటి జాగ్రత్త చర్యలేవీ చేపట్టలేరు... కాబట్టే ఈ ప్రమాదం జరిగి మూడు నిండు ప్రాణాలు బలయ్యాయి.
అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జ్ కూలి చాలా రోజులయ్యిందని... రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న పట్టించుకోలేదని అంటున్నారు. వారి నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
GPS Navigation accidents
హైదరాబాదీలను బోల్తా కొట్టించిన జిపిఎస్ నావిగేషన్
మొత్తంగా టెక్నాలజీని నమ్ముకుని సాగించిన ప్రయాణం ముగ్గురి ప్రాణాలు తీసింది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. గుడ్డిగా జిపిఎస్ నావిగేషన్ ను నమ్ముకుని హైదరాబాద్ కు చెందిన పర్యాటక బృందం ప్రాణాలమీదకు తెచ్చుకున్నారు. కేరళ పర్యటనకు వెళ్లిన నలుగురు సభ్యులు అలప్పుజ వైపు వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు. గూగుల్ మ్యాప్ ను అనుసరించి వెళుతుండగా కురుప్పంతార సమీపంలో ప్రమాదం జరిగింది.
గూగుల్ మ్యాప్ ను ఫాలో అవుతూ వెళుతుండగా అదికాస్తా ఓ జలాశయంలోకి తీసుకెళ్ళింది. అయితే వెంటనే స్థానికులు,పోలీసులు అప్రమత్తం కావడంతో వారి ప్రాణాలు దక్కాయి... లేదంటే ఇప్పటిలాగే ప్రాణాలు గాల్లో కలిసేవి. ఇలా జిపిఎస్ నావిగేషన్ ను నమ్ముకుని చాలామంది ఇబ్బందిపడ్డారు...కొందరు ప్రాణాలే కోల్పోయారు.