Delhi Election Results 2025 : మోదీని దిల్లీ ప్రజలు ఎందుకు అంత ఈజీగా నమ్మలేదు?
డిల్లీలో కాషాయం జెండా ఎగరబోతోంది... ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటమికి తప్పేలా లేదు. ఇవాళ వెలువడుతున్న డిల్లీ ఎన్నికల పలితాల్లో బిజెపి ఆధిక్యం కొనసాగుతోంది.

Delhi Election Results 2025
Delhi Assembly Elections 2025 : ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనేది సామెత. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం రచ్చ గెలిచి ఇప్పుడు ఇంట గెలుస్తోంది. గత దశాబ్ద కాలంగా డిల్లీ నుండి దేశాన్ని పాలిస్తోంది బిజెపి ... కానీ అక్కడ కాషాయ జెండా ఎగరేసేందుకు మాత్రం రెండున్నర దశాబ్దాలకు పైనే పట్టింది. ఇలా తాజాగా జరిగిన అసెబ్లీ ఎన్నికల్లో బిజెపి 27ఏళ్ల కల నెరవేరబోతోంది.
ఉత్కంఠభరితంగా సాగిన డిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ(శనివారం) వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ సర్వేలే నిజమవుతున్నాయి... ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపు, వెలువడుతున్న ఫలితాల ప్రకారం బిజెపి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిదిశగా పయనిస్తోంది. ఇక ఈసారి కూడా కాంగ్రెస్ ప్రభావం డిల్లీ ఫలితాల్లో కనిపించడంలేదు.
డిల్లీలో అధికారాన్ని చేపట్టేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ (36) బిజెపి దాటేసింది. ప్రస్తుతం 45కు పైగా సీట్లలో బిజెపి ఆధిక్యంలో కొనసాగుతోంది... ఆప్ కేవలం 25 స్థానాలకే పరిమితం అయ్యింది. ఇదే ట్రెండ్ కొనసాగితే బిజెపికి 27 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణ తర్వాత డిల్లీ పీఠం దక్కనుంది.
Delhi Election Results 2025
ఆప్ అగ్రనాయకులకూ ఓటమి తప్పదా?
డిల్లీలో వరుస విజయాలను అందుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఈసారి పరాభవం తప్పేలా లేదు. ఆ పార్టీకి చెందిన హేమాహేమీలు సైతం ప్రస్తుతం వెనుకంజలో కొనసాగుతున్నారు. చివరకు ఆప్ అధ్యక్షుడు, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ప్రస్తుతం సీఎం ఆతిషి కూడా వెనుకంజలో వున్నారు.
న్యూడిల్లీ నియోజకవర్గంలో పోటీచేస్తున్న కేజ్రీవాల్ పై బిజెపి అభ్యర్థి పర్వేష్ సాహెబ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 9 రౌండ్లు ముగిసేసరికి 1,170 ఓట్ల వెనుకంజలో వున్నాడు కేజ్రీవాల్.కల్కజీలో 6 రౌండ్లు ముగిసే సరికి 3,231 ఓట్ల వెనుకంజలో ఉన్నారు సీఎం అతిషి.
ఆసక్తికర విషయం ఏమిటంటే లిక్కర్ స్కామ్ లో జైలుకువెళ్లి డిప్యూటీ సీఎం పదవిని కోల్పోయిన మనీష్ సిసోడియా మాత్రం మంచి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అతడు జంగ్ పురాలో 3,869 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరికొన్ని చోట్ల కూడా ఆప్ ఆధిక్యం కనబరుస్తోంది. అయితే బిజెపి, ఆప్ ల మధ్య అధిక్యాలు అతి తక్కువగా వున్నాయి. కాబట్టి తుది ఫలితాలు ఎలా వుంటాయో చూడాలి.
Delhi Election Results 2025
27 ఏళ్ల తర్వాత డిల్లీ బిజెపి వశం :
దేశ రాజధాని డిల్లీలో ఇప్పటివరకు కేవలం ఒకేఒక్కసారి బిజెపి అధికారాన్ని చేపట్టింది. 1993లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 70 సీట్లకుగాను 49 సీట్లు సాధించింది. అయితే ఈ ఐదేళ్ళ పాలనలో ముగ్గురు సీఎంలను మార్చింది బిజెపి. మొదట మదన్ లాల్ ఖురానా రెండేళ్లు, ఆ తర్వాత సాహిబ్ సింగ్ వర్మ మరో రెండేళ్లు, చివరగా సుష్మా స్వరాజ్ కొన్నినెలలు డిల్లీ సీఎంగా పనిచేసారు.
అయితే ఆ తర్వాత మళ్లీ డిల్లీలో బిజెపి గెలిచింది లేదు. వరుసగా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు విజయం సాధిస్తూ వచ్చాయి. ఇలా దశాబ్దాలుగా డిల్లీలో అధికారానికి దూరమైన బిజెపి ఎట్టకేలకు 2025 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటి మరోసారి అధికారాన్ని చేపట్టేందుకు సిద్దమవుతోంది.