జూన్ 1 నుండి దగ్గు మందు ఎగుమతి చేయాలంటే ఈ నిబంధనలు పాటించాల్సిందే..
ఇకపై కాఫ్ సిరఫ్ లను ఎగుమతి చేయాలంటే తప్పనిసరిగా కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఇది జూన్ 1నుంచి అమలులోకి రానున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

న్యూఢిల్లీ : దగ్గు సిరప్ ఎగుమతిదారులకు కేంద్రం ప్రభుత్వం కొత్త నిబంధనలు విధించింది. ఈ నిబంధనలు జూన్ 1నుంచి అమలులోకి రానున్నాయి. తమ ఉత్పత్తులను అవుట్‌బౌండ్ షిప్‌మెంట్‌లకు అనుమతులు కావాలంటే నిర్దిష్ట ప్రభుత్వ ప్రయోగశాలలలో పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. భారతీయ సంస్థలు ఎగుమతి చేసే కాఫ్ సిరప్‌ల మీద ప్రపంచవ్యాప్తంగా నాణ్యతా పరమైన ఆరోపణలు, ఆందోళనలు తలెత్తిన నేపథ్యంలో ఈ మేరకు నిబంధనలు తీసుకువచ్చారు.
"దగ్గు సిరప్ ఎగుమతికి అనుమతులు కావాలంటే.. ప్రభుత్వ అనుమతి ఉన్న ఏవైనా ప్రయోగశాలలు జారీ చేసిన విశ్లేషణ ధృవీకరణ పత్రం ఉన్న నమూనాలకు మాత్రమే అర్హత ఉంటుంది. ఈ నిబంధనలు జూన్ 1, 2023 నుండి అమలులోకి వస్తుంది" అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజిఎఫ్ టి) సోమవారం ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది.
కేంద్ర ప్రభుత్వంతో గుర్తించబడిన ల్యాబ్ లలో ఈ పరీక్షలు చేస్తారు. వీటిలో ముఖ్యంగా ఇండియన్ ఫార్మకోపోయియా కమిషన్, రీజనల్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్ (ఆర్ డిటిఎల్ - చండీగఢ్), సెంట్రల్ డ్రగ్స్ ల్యాబ్ (సిడిఎల్ - కోల్‌కతా), సెంట్రల్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్ (సిడిటిఎల్ - చెన్నై హైదరాబాద్, ముంబై), ఆర్ డిటిఎల్ (గౌహతి)య ఎన్ఏబిఎల్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్)లు ఉన్నాయి. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందిన డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్‌లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
దీని గురించి మరింత వివరిస్తూ, భారత్ నుండి ఎగుమతి చేసే వివిధ ఔషధ ఉత్పత్తుల నాణ్యతకు భరోసా ఇవ్వడంలో దేశ నిబద్ధతను నొక్కిచెప్పడానికి ఇది పనికి వస్తుందని తెలిపారు. దీనికోసమే ఎగుమతి చేస్తున్న దగ్గు సిరప్ ల నాణ్యతను ముందస్తుగా తప్పనిసరి పరిశీలించే ప్రక్రియను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఒక అధికారి తెలిపారు.
"పూర్తయిన వస్తువులు (ఈ సందర్భంలో దగ్గు సిరప్) ఎగుమతి కోసం అనుమతించబడటానికి ముందు ప్రయోగశాలలలో పరీక్షించాలి" ఈ పరీక్ష అవసరాన్ని.. వీటిని సరిగా అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని.. దీంట్లో MoHFW భాగస్వామిగా ఉంటుందని అధికారి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు, ఎగుమతిదారులు ఈ నోటిఫికేషన్‌ను సజావుగా అమలు చేసేలా చూసుకోవాలి.
ఫిబ్రవరిలో, తమిళనాడుకు చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్‌కేర్ తయారు చేసిన ఐడ్రాప్స్ ను మొత్తం రీకాల్ చేసింది. అంతకు ముందు, గత సంవత్సరం గాంబియా, ఉజ్బెకిస్తాన్‌లలో వరుసగా 66 మంది, 18 మంది చిన్నారుల మరణాలకు భారతదేశంలో తయారు చేసిన దగ్గు సిరప్‌లు కారణమని ఆరోపణలు వచ్చాయి.
భారతదేశం 2021-22లో 17 బిలియన్ల నుండి 2022-23లో 17.6 బిలియన్ల విలువైన దగ్గు సిరప్‌లను ఎగుమతి చేసింది. భారతీయ ఔషధ పరిశ్రమ మొత్తం ప్రపంచానికి వైద్య ఉత్పత్తుల ప్రముఖ తయారీదారు, ఎగుమతిదారుగా ఉంది. అత్యంత అభివృద్ధి చెందిన దేశాల నుండి తక్కువ, మధ్య-ఆదాయ దేశాలకు (ఎల్ఎమ్ఐసి) వరకు ఎగుమతి అవుతున్నాయి.
భారతదేశం ప్రపంచవ్యాప్తంగా జెనరిక్ ఔషధాల అతిపెద్ద ప్రొవైడర్, వివిధ టీకాల కోసం ప్రపంచ డిమాండ్‌లో 50 శాతానికి పైగా సరఫరా చేస్తోంది. అమెరికాలో 40 శాతం జెనరిక్ డిమాండ్.. యూకేలో మొత్తం ఔషధాలలో 25 శాతం ఇక్కడినుంచే వెళతాయి.
ప్రపంచవ్యాప్తంగా, భారతదేశం ఫార్మాస్యూటికల్ ఉత్పత్తిలో మూడవ స్థానంలో, విలువ ప్రకారం 14వ స్థానంలో ఉంది. పరిశ్రమలో 3,000 ఔషధ కంపెనీల నెట్‌వర్క్, దాదాపు 10,500 తయారీ యూనిట్లు ఉన్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా అధిక-నాణ్యత, సరసమైన, అందుబాటులో ఉండే ఔషధాల లభ్యత.. సరఫరాను సులభతరం చేస్తుంది. గ్లోబల్ ఫార్మాస్యూటికల్స్ రంగంలో భారతదేశానికి ముఖ్యమైన స్థానం ఉంది.
ప్రస్తుతం ఎయిడ్స్‌ను ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే యాంటీరెట్రోవైరల్ ఔషధాలలో 80 శాతానికి పైగా భారతీయ ఔషధ సంస్థల ద్వారా సరఫరా చేయబడుతున్నాయి.