ఢిల్లీ ముఖ్యమంత్రిగా మరోసారి మహిళకు పట్టం : ఎవరీ ఆతిషి మెర్లిన్ సింగ్?
దేశ రాజకీయాలన్ని డిల్లీ చుట్టూ తిరిగితే... ప్రస్తుత డిల్లీ రాజకీయాలు మాత్రం ఓ మహిళ చుట్టూ తిరుగుతున్నాయి. డిల్లీ ముఖ్యమంత్రిగా ఆతిషి మెర్లిన్ సింగ్ నియమితులయ్యారు... దీంతో ఇంతకూ ఎవరీమె? అనే చర్చ మొదలయ్యింది.
Delhi New CM
Delhi New CM : దేశ రాజధాని న్యూడిల్లీలో రాజకీయాలు హీటెక్కాయి. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యారు. అయితే జైల్లో వున్నంతకాలం సైలెన్స్ గా వున్న ఆయన బయటకు రాగానే బాంబ్ పేల్చారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. మళ్లీ ప్రజలు తనను సీఎంగా కోరుకుంటేనే ఆ పదవికి తీసుకుంటానని... ఇందులో భాగంగానే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్దమని కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ క్రమంలోనే తన స్థానంలో బాధ్యతలు చేపట్టనున్న కొత్త ముఖ్యమంత్ర ఎవరనే దానిపైనా క్లారిటీ ఇచ్చేసారు.
Atishi
ఇప్పటికే రాజీనామాను ప్రకటించిన డిల్లీ సీఎం లెప్టినెంట్ గవర్నర్ అపాయింట్ మెంట్ కూడా తీసుకున్నారు. సాయంత్రం గవర్నర్ ను కలిసి తన రాజీనామా లేఖను అందించనున్నారు. రాజీనామాకు అంతా సిద్దం చేసుకున్న కేజ్రీవాల్ కొత్త సీఎం ఎంపికను కూడా పూర్తిచేసారు.
ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభాపక్ష సమావేశం కొద్దిసేపటి క్రితమే జరిగింది. ఇందులో కేజ్రీవాల్ తో పాటు మంత్రులు, ఆప్ ఎమ్మెల్యేలందరూ పాల్గొన్నారు. ఆప్ శాసనసభాపక్ష నేతను ఎన్నుకునేందుకే ఈ సమావేశం జరిగింది. తన కేబినెట్ లోని మహిళా మంత్రి ఆతిషి మెర్లినా సింగ్ ను ఆప్ శాసనసభాపక్ష నేత అరవింద్ కేజ్రీవాత్ ప్రతిపాదించగా కైలాష్ గెహ్లాట్, సౌరబ్ భరద్వాజ్, గోపాల్ రాయ్ లు బలపర్చారు. మిగతా ఎమ్మెల్యేలంతా అంగీకరించడంతో ఆతిషి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అనుకున్నదే జరిగింది :
డిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి లబ్ది చేకూర్చేలా ఎక్సైజ్ పాలసీని రూపొందించారనే ఆరోపణల నేపథ్యంలో సిబిఐ, ఈడి విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే మొదట ఆనాటి డిప్యూటీ సీఎం,ఎక్సైజ్ మంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసారు. ఆ తర్వాత సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కూడా ఈ వ్యవహారంతో సంబంధాలున్నాయని నిర్దారించి అరెస్ట్ చేసారు.
ఇలా చాలా రోజులపాటు జైల్లో వున్న కేజ్రీవాల్ గత లోక్ సభ ఎన్నికల సమయంలో బెయిల్ పై బయటకు వచ్చారు. ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్ళీ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అయితే ఇలా సీఎం కేజ్రీవాల్ జైల్లో వున్న సమయంలో పాలనా బాధ్యతలు మంత్రి ఆతిషి చూసుకున్నారు.
జైలుకు వెళ్ళిన కేజ్రీవాల్ రాజీనామా చేస్తారని అందరూ భావించారు. ఈ సమయంలోనూ సీఎం రేసులో ఆతిషి పేరు వినిపించింది. కానీ కేజ్రీవాల్ రాజీనామా చేయకపోవడంతో ఆ టర్మ్ ఆయనే కొనసాగుతారని భావించారు. కానీ జైల్లోంచి బయటకు రాగానే రాజీనామ ప్రకటన చేయడంతో మరోసారి ఆతిషి పేరు తెరపైకి వచ్చింది.
అయితే కేజ్రీవాల్ జైల్లో వుండగానే ఆతిషి కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పకనే చెప్పారు. కానీ ఆయన రాజీనామాను ఎవరూ ఊహించలేదు కాబట్టి ఈ విషయం గమనించలేకపోయారు. ఈ ఆగస్ట్ 15న అంటే స్వాతంత్య్ర దినోత్సవం రోజు కేజ్రీవాల్ జైల్లో వున్నారు... కాబట్టి జాతీయ జెండా ఎగరేసే అవకాశం ఆతిషికి దక్కింది. ఆమె పేరును స్వయంగా కేజ్రీవాల్ ప్రతిపాదించారు... దీన్నిబట్టే ఆనాడే ఆతిషిని సీఎం చేయాలని కేజ్రీవాల్ స్పష్టంగా వున్నారని అర్థమవుతుంది.
ఇంతకూ ఎవరి ఆతిషి :
డిల్లీలోని మంచి విద్యావంతుల కుటుంబంలో 1981 జూన్ 8న ఆతిషి మార్లెనా సింగ్ జన్మించారు. ఆమె తండ్రి డిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయ్ సింగ్. పుట్టిపెరిగిన డిల్లీలోనే ఆతిషి విద్యాభ్యాసమంతా సాగింది.
ఆమె పాఠశాల విద్య డిల్లీలోని స్ప్రింగ్ డేల్స్ స్కూల్లో సాగింది. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుండి 2001 లో డిగ్రీ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత ఇంగ్లాండ్ లోని ప్రముఖ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నుండి మాస్టర్స్ డిగ్రీ చేసారు. ఆ తర్వాత రోడ్స్ స్కాలర్ పై అదే ఆక్స్ ఫర్డ్ నుండి రెండవ మాస్టర్ డిగ్రీ పొందారు.
ఇలా ఉన్నత చదువులు చదివి ఇండియాకు తిరిగివచ్చిన ఆతిషి సమాజసేవలో మునిగిపోయారు. సేంద్రియ వ్యవసాయంపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే విద్యా వ్యవస్థపై పరిశోధన చేసారు. అనేక ఎన్జివో లలో పనిచేసారు. చివరకు మధ్య ప్రదేశ్ లోని ఓ చిన్న గ్రామంలో 7 సంవత్సరాల పాటు గడిపి గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితిపై అవగాహన పెంచుకున్నారు.
రాజకీయ జీవితం :
రాజకీయాల్లో సమూల మార్పులు తీసుకువస్తామని... సామాన్య ప్రజలకు పాలనను చేరువ చేస్తామంటూ 2012 నవంబర్ 26న ఓ సామాజిక కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్ 'ఆమ్ ఆద్మీ' పార్టీని స్థాపించారు. ఈ రాజకీయ పార్టీ విధివిధానాలు నచ్చడంతో ఆవిర్భావ సమయంలోనే అందులో చేరిపోయారు ఆతిషి. ముందునుండి పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు చాలా నమ్మకంగా వుండేవారామే. 2013 లో డిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆప్ మేనిఫెస్టో ముసాయిదా కమిటీ సభ్యురాలిగా వున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నాయకురాలిగా ఎదిగిన ఆతిషి 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసారు. తూర్పు డిల్లీ లోక్ సభకు పోటీచేసిన ఆమె బిజెపి అభ్యర్థి గౌతమ్ గంభీర్ చేతిలో ఓడిపోయారు. ఈ ఓటమి ఆమెను ఏమాత్రం నిరాశపర్చలేదు కదా మరింత కసిని పెంచింది. దీంతో ప్రజలకు మరింత చేరువయ్యేలా, వారి నమ్మకాన్ని పొందేలా పనిచేసారు.
ఇలా 2020 డిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఆతిషి ప్రజలకు చాలా దగ్గరయ్యారు. దీంతో ఆమె కల్కాజీ అసెంబ్లీ నుండి పోటీచేసి బిజెపి అభ్యర్థి ధరం సింగ్ ను ఓడించారు. ఇలా ఎంపీ ఎన్నికల్లో 4.77 లక్షల ఓట్ల తేడాతో ఓడిన ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 11,422 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
సిసోడియా రాజీనామాతో మంత్రిగా అవకాశం :
డిల్లీ ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన మనీష్ సిసోడియాకు సలహాదారుగా పనిచేసారు ఆతిషి. అయితే డిల్లీ లిక్కర్ స్కాంలో సిసోడియా జైలుకు వెళ్లడంతో తన మంత్రి పదవికి రాజీనామా చేసారు. దీంతో 2023లో ఆతిషికి మంత్రిపదవి దక్కింది. ఆమెకు ఆర్థిక, విద్య, విద్యుత్ వంటి కీలకమైన 14 శాఖల బాధ్యతలు అప్పగించారు కేజ్రీవాల్.
పాలనా వ్యవహారాల్లో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు సహాయకురాలిగా వ్యవహరించారు ఆతిషి.ఈ సమయంలోనే ఆమె పనితీరు కేజ్రీవాల్ కు బాగా నచ్చింది. ఇలా ఆమెపై నమ్మకం పెరగడంతో కీలక బాధ్యతలన్నీ అప్పగించారు. దీంతో ఆతిషి పేరు డిల్లీ రాజకీయాల్లో ఎక్కువగా వినిపించడం ప్రారంభమయ్యింది.
డిల్లీ ముఖ్యమంత్రిగా అవకాశం :
ఆతిషిపై నమ్మకంతో అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన వచ్చే ఏడాది (2015) ఆరంభంలో జరగనున్న డిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే పాలనా పగ్గాలను ఆతిషికి అప్పగిస్తూ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టబోతున్నారు.
ఇప్పటివరకు డిల్లీ ముఖ్యమంత్రులు ఇద్దరు మహిళలు పనిచేసారు. బిజెపి నుండి సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ నుండి షీలా దీక్షిత్ లు డిల్లీ సీఎంలుగా పనిచేసారు. మూడో మహిళా ముఖ్యమంత్రిగా ఆతిషి మర్లేనా సింగ్ కు అవకాశం దక్కింది.