దేశానికి క్షమాపణలు చెప్పండి : 'ఆదిపురుష్' మేకర్స్‌పై మండిపడ్డ ఉద్ధవ్ టీమ్..
హిందూ ఇతిహాసం రామాయణంలోని పాత్రలను అగౌరవపరిచేలా డైలాగ్‌లు ఉన్నాయని.. చిత్ర నిర్మాతలు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని శివసేన నేత ప్రియాంక చతుర్వేది డిమాండ్ చేసింది.

న్యూఢిల్లీ : శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది శనివారం 'ఆదిపురుష్' నిర్మాతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రామాయణ ఇతిహాసాన్ని అగౌరపరిచేలా డైలాగులు ఉన్నాయని.. దీనికి డైలగ్ రైటర్ మనోజ్ ముంతషిర్, డైరెక్టర్లు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యంగా హనుమంతుడి విషయంలో దేశానికి క్షమాపణలు చెప్పాలి.. అంటూ అని చతుర్వేది ట్వీట్ చేశారు. "వినోదం పేరుతో మన పూజ్యమైన దేవుళ్లకు వారి స్థాయికి సరిపోలని భాషని ఆపాదించడం ప్రతి భారతీయుడినీ ఆవేదనకు గురి చేస్తోంది.
మీరు మర్యాద పురుషోత్తం రామ్‌పై సినిమా తీస్తారు. బాక్సాఫీస్ వద్ద త్వరగా విజయం సాధించడం కోసం ఆ మర్యాదకు చెందిన అన్ని హద్దులు దాటడం ఆమోదయోగ్యం కాదు" అని ఆమె అన్నారు.
ఈ పౌరాణిక చిత్రం శుక్రవారం విడుదలై మిశ్రమ స్పందన పొందింది. ప్రతీ థియేటర్ లో హనుమంతుని కోసం ఓ సీటు వదిలేయడంతో అభిమానులు ఆ సీటు పక్క సీటు కోసం పోటీలు కూడా పడ్డారు.
హనుమంతుని గౌరవార్థం సీట్లు కూడా రిజర్వ్ చేసుకున్నారు. సినిమా బాగాలేదన్నందుకు హైదరాబాద్‌లో ఓ వ్యక్తిని కొట్టారు. మరో చోట థియేటర్లోకి కోతి రావడంతో ఆంజనేయుడే వచ్చాడంటూ ఓ వీడియో వైరల్ అయ్యింది.
రూ. 500 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడిన ఈ చిత్రం కోసం.. నిర్మాతలు విడుదలకు ముందునుంచే భారీ ప్రచారాన్ని ప్రారంభించారు. ట్రైలర్ లాంచ్‌లో, దర్శకుడు ఓం రౌత్ ప్రతి స్క్రీనింగ్‌లో హనుమంతుని కోసం ఒక సీటును రిజర్వ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, సినిమా విడుదలైన కొన్ని గంటల తర్వాత, అభిమానులు.. విజువల్ ఎఫెక్ట్స్, జువెనైల్ డైలాగ్‌లను తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.
సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చిత్రంలో రాఘవగా ప్రభాస్, జానకిగా కృతి సనన్, లంకేష్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఈ సినిమాపై హిందూ సేన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో శుక్రవారం సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ చిత్రాన్ని పబ్లిక్ ఎగ్జిబిషన్‌కు సర్టిఫికేట్ చేయకుండా నిరోధించాలని పిటిషన్ కోరింది. సినిమాలో మతపరమైన వ్యక్తులను చిత్రీకరించడం సరికాదని, తగదని, ఇది హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీస్తుందని పిటిషన్‌లో పేర్కొన్నారు.