ఎయిర్ కమోడోర్ చంద్రశేఖర్ జీవితం నేటి తరానికి ఆదర్శం.. ఆయన జీవితంలోని కీలక ఘట్టాలు
భారతీయ వైమానిక దళ మాజీ అధికారి ఎయిర్ కమోడోర్ మంగటిల్ కరకడ్ చంద్రశేఖర్, బీజేపీ నేత మాజీ కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తండ్రి, 92 ఏళ్ల వయసులో బెంగళూరులో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఆయన జీవితంలోని పలు కీలక ఘట్టాల గురించి తెలుసుకుందాం.

ప్రారంభ జీవితం, కుటుంబం
చంద్రశేఖర్ కేరళలోని త్రిస్సూర్ జిల్లా, దేశమంగళం ప్రాంతానికి చెందిన మంగటిల్ కుటుంబానికి చెందినవారు. ఆయన సతీమణి ఆనందవల్లి (కొండాయూర్, త్రిస్సూర్)తో పాటు, కుమారుడు రాజీవ్ చంద్రశేఖర్, కుమార్తె డా. దయా మీనన్ (అమెరికాలో), కోడలు అంజు చంద్రశేఖర్, అల్లుడు అనిల్ మీనన్ (అమెరికా) ఉన్నారు.
భారత వైమానిక దళంలో సేవ
* 1954లో 63వ కోర్సులో భాగంగా ఆయన భారత వైమానిక దళంలో చేరారు.
* 1986 డిసెంబర్ 25న ఎయిర్ కమోడోర్ హోదాతో పదవీ విరమణ చేశారు.
* ఆయన A1 ఇన్స్ట్రక్టర్ రేటింగ్ పొందిన అత్యున్నత స్థాయి శిక్షణాధికారి.
ఏ హోదాల్లో పని చేశారంటే.?
* 1955 – ఫ్లయింగ్ ఆఫీసర్
* 1959 – ఫ్లైట్ లెఫ్టినెంట్
* 1965 – స్క్వాడ్రన్ లీడర్
* 1974 – వింగ్ కమాండర్
* 1978 – గ్రూప్ క్యాప్టెన్
* 1982 – ఎయిర్ కమోడోర్
ముఖ్యమైన యుద్ధాల్లో కీలక పాత్ర
* 1947-48 కాశ్మీర్ ఆపరేషన్ – డకోటా విమానాలతో సైనికులను, సరఫరాలను తరలించడం.
* 1962 భారత్-చైనా యుద్ధం – ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా తగిన శిక్షణ లేకుండా ఉన్న సైనికులను హిమాలయ ప్రాంతాల ఎయిర్‌స్ట్రిప్‌లకు తరలించారు.
* 1965 భారత్-పాకిస్తాన్ యుద్ధం – ఆపరేషన్లలో కీలకంగా పాల్గొన్నారు.
* 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధం – డకోటా విమానాలతో రవాణా మిషన్లలో ప్రాముఖ్యత వహించారు.
బహుమతులు, గౌరవాలు
* విశిష్ట సేవా పతకం (VSM) – 1964, 1962 యుద్ధంలో అద్భుత సేవలకు గుర్తింపుగా.
* వాయు సేన పతకం (VM) – 1970, 800 గంటలకుపైగా ఆపరేషనల్ ఫ్లయింగ్, శిక్షణా సేవలకు.
ముఖ్యమైన పదవులు
* ఎన్‌డిఏ (ఖడక్వాస్లా) లో ట్రైనింగ్ టీమ్ అధికారి (1966-1968)
* జోరహట్‌లో 43 స్క్వాడ్రన్ ఫ్లైట్ కమాండర్ (1970)
* లేహ్ స్టేషన్ కమాండర్ (1972-1973)
* యెలహంక ట్రాన్స్‌పోర్ట్ ట్రైనింగ్ వింగ్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ (1973-1975)
* హిందన్‌లో ఎయిర్‌క్రూ ఎగ్జామినేషన్ బోర్డ్ కమాండింగ్ ఆఫీసర్ (1977-1981)
* AFS టాంబరం (చెన్నై) ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ (1984-1985)
* జోరహట్ 10 వింగ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ (1985-1987)
యుద్ధ స్మారకాల ఏర్పాటుకు కృషి
చంద్రశేఖర్ బెంగళూరు నేషనల్ మిలిటరీ మెమోరియల్లోని 75 అడుగుల ఎత్తైన, 700 టన్నుల ‘వీరగల్లును’ రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ఇది కార్గిల్ విజయ్ దివస్ రోజున ఆవిష్కరించారు. ఇందులో అమరుల పేర్లు, జాతీయ పతాకం, మ్యూజియం ఉన్నాయి. ఈ స్మారకం అమరుల కుటుంబాలకు ఆత్మగౌరవాన్ని, యువతకు ప్రేరణను అందించాలనేది ఆయన కోరిక.
కుమారుడు రాజీవ్ చంద్రశేఖర్ నివాళి
రాజీవ్ చంద్రశేఖర్ తన తండ్రి మరణాన్ని ప్రకటిస్తూ ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. “నా జీవితంలో ప్రతి అడుగూ ఆయన ప్రేమ, ప్రేరణతో నిండింది. ఆయన ఒక ఎయిర్ వారియర్, దేశభక్తుడు, జెంటిల్‌మన్, కానీ అంతకన్నా గొప్ప తండ్రి, మార్గదర్శి, మనవలకు అద్భుతమైన తాత.” అని రాసుకొచ్చారు.
Blueskies and Tailwinds
AirCmde MK Chandrasekhar, VM, VSM 🫡
My father passed away today after getting back home. He lived a full life and a life that inspired many including me. Every step of my life has been inspired by him and his love.
He was an airwarrior, patriot,… pic.twitter.com/kvuL47JfZe— Rajeev Chandrasekhar 🇮🇳 (@RajeevRC_X) August 29, 2025
విమానాన్ని తండ్రికి అంకితం చేసిన రాజీవ్
తన తండ్రి కోరిక మేరకు, రాజీవ్ చంద్రశేఖర్ 2018లో ఐర్లాండ్ నుంచి ఒక డకోటా DC-3 విమానాన్ని కొనుగోలు చేసి భారత వైమానిక దళానికి బహుమతిగా అందించారు. ఆ విమానాన్ని పునరుద్ధరించి, “పరశురామ” అనే పేరుతో దళంలోకి తీసుకున్నారు. రాజీవ్ చంద్రశేఖర్ తన తండ్రికి నివాళిగా “Blue Skies and Tailwinds” అని రాశారు. ఇది చంద్రశేఖర్ వారసత్వాన్ని ప్రతిబింబించే మాట.