వార్నీ... పరీక్షలో ఫెయిల్ అవ్వడంతో.. సొంత కిడ్నాప్ డ్రామాకు తెరలేపిన టీనేజ్ అమ్మాయి..
డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి తనను ఎవరో కిడ్నాప్ చేశారంటూ డ్రామా ఆడింది. చివరకు అది ఫేక్ అని తేలింది. అయితే ఇలా ఎందుకు చేసిందో తెలిసి అందరూ షాక్ అయ్యారు.

మధ్యప్రదేశ్ : పరీక్షల్లో ఫెయిల్ అయితే.. ఎవరైనా ఏం చేస్తారు? మనస్తాపంతో కొంతమంది ఆత్మహత్యకు పాల్పడతారు. మరికొంతమంది ఏడ్చి..బాధపడి ఆ తరువాత మళ్లీ పరీక్షకు ప్రిపేర్ అవుతారు. కానీ ఓ అమ్మాయి మాత్రం ఏకంగా తాను కిడ్నాప్ అయినట్టు డ్రామా మొదలుపెట్టింది. కంగారు పడ్డ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగు చూసింది.
ఈ షాకింగ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో వెలుగు చూసింది. వార్షిక అండర్ గ్రాడ్యుయేట్ పరీక్షలో ఫెయిల్ అవ్వడంతో.. ఒక టీనేజ్ అమ్మాయి తన సొంత కిడ్నాప్ డ్రామాకు తెరలేపింది. దీనికోసం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుండి పొరుగున ఉన్న ఉజ్జయినికి పారిపోయింది. ఆ తరువాత తల్లిదండ్రులకు తాననెవరో కిడ్నాప్ చేశారని ఫోన్ చేసింది.
kidnapped
దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. అప్రమత్తమైన పోలీసులు గాలింపు చేపట్టారు. ఓ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (బీఏ) మొదటి సంవత్సరం చదువుతున్న సదరు బాలిక (17)ని ఇండోర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి శనివారం కుటుంబసభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
ఇండోర్‌లోని బంగంగా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రాజేంద్ర సోనీ మాట్లాడుతూ, "కళాశాల నుండి ఇంటికి వెళ్తుండగా ఇండోర్‌లోని ఒక గుడి దగ్గరి నుండి తన కుమార్తె కిడ్నాప్ కు గురైందని బాలిక తండ్రి శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేశారు" తెలిపారు. ఇండోర్‌లో కిడ్నాప్‌కు గురైనట్లు తన కుమార్తె తనకు తెలియని నంబర్ నుంచి కాల్ చేసిందని బాలిక తండ్రి తెలిపారని అన్నారు.
ఇంటికి రావడానికి ఈ-రిక్షా ఎక్కడానికి అక్కడివరకు వచ్చానని.. తనను ఆలయ సమీపంలోని చౌరస్తాలో ఫ్యాకల్టీ ఒకరు దింపారని బాలిక తెలిపింది. ఆ తరువాత ఆ రిక్షా డ్రైవర్ తనను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి నోట్లో గుడ్డలు కుక్కి.. అపస్మారక స్థితిలోకి వెళ్లేలా చేశాడని ఆమె తన తండ్రికి చెప్పింది. బాలిక పేర్కొన్న ప్రాంతంలోని సీసీటీవీల ఫుటేజీని పరిశీలించగా, ఆమె చెప్పింది తప్పు అని తేలింది.
"అదే సమయంలో, ఉజ్జయినిలోని ఒక రెస్టారెంట్‌లో ఒంటరిగా కూర్చున్న అమ్మాయి గురించి పోలీసులకు సమాచారం వచ్చింది. ఆమె ఫోటో, కిడ్నాప్ అయిందంటూ తండ్రి ఇచ్చిన ఫోటోతో సరిపోలింది" అని అధికారి తెలిపారు.
అనంతరం బాలికను ఇండోర్‌కు తీసుకువచ్చి, ఆమె బ్యాగును తనిఖీ చేశారు. ఇండోర్-ఉజ్జయిని బస్సు టికెట్‌తో పాటు ఉజ్జయినిలోని రెస్టారెంట్ బిల్లు కూడా అందులో లభించిందని ఆయన తెలిపారు.అనంతరం ఓ పోలీసు ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.