బూతులే వినిపించని బుద్దిమంతుల ఊరు ... ఎక్కడో కాదు మన పక్కనే..!
మనుషుల మధ్య విద్వేషాలను పెంచేవి మాటలే. అలాంటి మాటలు అదుపులో వుంటేనే గ్రామానికి మంచిదని నమ్మిన కొందరు పెద్దలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే...
Village
నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందనే సామెతను ఆ గ్రామస్తులు బలంగా నమ్ముతున్నారు. అందుకే గ్రామస్తులందరి నోర్లను అదుపులో పెట్టేందుకు కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే ఇకపై గ్రామంలో బూతులు వినిపించకూడదని. ఈ నిర్ణయాన్ని కాదని ఎవరైనా బూతులు మాట్లాడితే వారు జరిమానా కట్టాల్సిందే. ఇలా చిన్నాపెద్ద, ఆడమగ అందరూ కలసి తమ గ్రామంలో బూతులను నిషేధించి హాయిగా జీవిస్తున్నారు. ఈ ఆదర్శ గ్రామం మన పక్కరాష్ట్రం మహారాష్ట్రలో వుంది.
Village
బూతులు ఎందుకు నిషేధించారంటే..:
మాటలే మనుషులను శతృవులను చేసేది. ఇద్దరి మధ్య మాటలు బావుంటే స్నేహం పెరుగుతుంది...అదే మాటలు బాగాలేకుంటే శతృత్వం పెరుగుతుంది. అంటే మనుషుల మధ్య తేడాలు రావడానికి నోటి మాటలే కారణమని మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లా సౌందాల గ్రామస్తులు గుర్తించారు.
ఇక మన మంచి నడవడికే భవిష్యత్ తరాలకు అబ్బుతుంది... వాళ్లు బాగుండాలంటే మనం కూడా సంస్కారంతో వుండాలని ఈ గ్రామస్తులు భావించారు. బూతుల వల్ల మహిళల ఆత్మగౌరవం దెబ్బతినడమే కాదు చిన్నపిల్లలు కూడా ఆ మాటలు నేర్చుకుని పాడయిపోతారు. ఇలా అనేక అనార్థాలకు బూతులు మాట్లాడటం కారణం అవుతుంది. కాబట్టి ఈ బూతులే వినపించకుండా గ్రామస్తులు నిషేధం విధించారు.
సరదాకే కాదు గొడవలు పడినా అసభ్య పదజాలం వాడటం ఈ గ్రామంలో నిషేదం. కేవలం పెద్దమనుషులు ఈ నిర్ణయం తీసుకోవడం కాదు గ్రామసభ పెట్టిమరీ బూతుల నిషేధానికి ఓ తీర్మానం చేసారు. గ్రామంలోని ప్రతిఒక్కరు తోటివారితో సఖ్యతగా వుండాలనేదే ఈ బూతులపై నిషేదం విధించినట్లు చెబుతున్నారు.
Village
బూతులు మాట్లాడితే శిక్షేంటి?
సాధారణంగా గొడవలు జరిగినపుడు బూతులు ఉపయోగిస్తారు. అలాగే వివిధ సందర్భాల్లో కొందరి నోటినుండి అనుకోకుండానే బూతులు వస్తుంటాయి. ఇలా ఉద్దేశపూర్వంగా అయినా లేదా అనుకోకుండా నోటివెంట వచ్చినా సౌందాల గ్రామస్తులు జరిమానా కట్టాల్సిందే. ఇలా నిబంధనలు ఉళ్లంఘిస్తూ రూ.500 జరిమానా కట్టాలి.
ఇలా బూతులను నిషేధిస్తూ సౌందాల గ్రామస్తుల తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిర్ణయం వల్ల గ్రామంలోని చిన్నపిల్లలు చెడు బాష అలవాటుకాకుండా వుంటుందని...మహిళల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా వుంటుందని అంటున్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరు సోదరభావంతో మెలిగేందుకు ఈ బూతుల నిషేధ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు.