46 ఏళ్ల కిందట వంట చెరుకు కోసం చెట్లు నరికారని.. ఇప్పుడు మహిళల అరెస్ట్…కోర్టు ఏమన్నదంటే..
46యేళ్ల క్రితంనాటి కేసులో ఏడుగురు మహిళలను రాజస్థాన్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. వారు చేసిన నేరమల్లా వంటచెరుకుకోసం అడవిలో చెట్లు నరకడమే.
రాజస్థాన్ : పోలీసులు కొన్నిసార్లు చేసే చేష్టలు చాలా విచిత్రంగా ఉంటాయి. చర్చనీయాంశంగా మారుతుంటాయి. అనేక విమర్శలకు దారి తీసేలా ఉంటాయి.
అలాంటి ఓ ఘటన తాజాగా రాజస్థాన్లో వెలుగు చూసింది. కొంతమంది మహిళలు 46 ఏళ్ల క్రితం అడవిలోని చెట్లని వంటచెరుకు కోసం నరికారు. రాజస్థాన్ పోలీసులు వారిని తాజాగా అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పరిచారు. ఇప్పుడు ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.
రాజస్థాన్లోని దిల్వారా, బూందీ జిల్లాలకు చెందిన 12 మంది మహిళలు 1977లో కట్టెల కోసం అడవిలోని చెట్లను నరికారు. ఇది ఓ అటవీశాఖ ఉద్యోగి కంటపడింది. వెంటనే అతను అటవీ హక్కుల చట్టం కింద పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆ సమయంలో ఆ మహిళలపై బూందీ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, తమమీద కేసు నమోదైన విషయం ఆ మహిళలకు తెలియదు.
పోలీసులు కూడా ఈ కేసును ఆ తర్వాత మర్చిపోయారు. ఇటీవల పెండింగ్లో ఉన్న పాత కేసులను పరిష్కరించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఈ కేసు బయటికి వచ్చింది. అలా 46 ఏళ్ల క్రితం నమోదైన కేసులో బిల్వారా, బూందీ జిల్లాలలో ఉంటున్న ఏడుగురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు మహిళలు ఇప్పటికే మరణించినట్లుగా గుర్తించారు. ఇంకో ఇద్దరు ఎక్కడ ఉన్నారో తెలియదు. తమ మీద కేసు నమోదు అయిందని.. అదికూడా 46 ఏళ్ల క్రితం అని తెలిసిన మహిళలు విస్తుపోయారు. కోర్టుకు హాజరయ్యారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. మహిళల వయసును పరిగణలోకి తీసుకుంది. జరిమానాతో సరిపెట్టి.. కేసు కొట్టేసింది.