- Home
- Entertainment
- Movie Reviews
- OTT Review: `ఉప్పు కప్పురంబు` మూవీ ఓటీటీ రివ్యూ.. కీర్తిసురేష్, సుహాస్ నవ్వించారా?
OTT Review: `ఉప్పు కప్పురంబు` మూవీ ఓటీటీ రివ్యూ.. కీర్తిసురేష్, సుహాస్ నవ్వించారా?
కీర్తిసురేష్, సుహాస్ కలిసి నటించిన `ఉప్పు కప్పురంబు` మూవీ ఓటీటీలో విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

`ఉప్పు కప్పురంబు` మూవీ ఓటీటీ రివ్యూ
`మహానటి` తర్వాత కీర్తిసురేష్‌కి సరైన సినిమాలు పడటం లేదు. అమె కమర్షియల్ సినిమాలు చేసినా, లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేసినా, ఆ స్థాయి హిట్ రాలేదు. దీంతో రకరకాల ప్రయోగాలు చేస్తోంది. యాక్షన్ చేసేందుకు రెడీ అయ్యింది.
తాజాగా తెలుగులో `ఉప్పు కప్పురంబు` మూవీతో వచ్చింది. ఈ చిత్రంలో సుహాస్ ఆమెకి జోడీగా చేశారు. ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రాధిక లావు నిర్మించిన ఈ చిత్రానికి ఐవీ శశి దర్శకత్వం వహించారు.
ఈ మూవీ నేడు శుక్రవారం(జులై 4) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మరీ ఇది ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.
`ఉప్పు కప్పురంబు` కథ
1990 చిట్టి జయపురంలో జరిగే కథ ఇది. ఆ ఊరికి పూర్వీకులు వలస వస్తారు. జీవనం సాగిస్తారు. వందల ఏళ్ల తర్వాత ఇప్పుడు అంతా ప్రశాంతంగా ఉంటారు. ఊరి ఆచారం ప్రకారం ఊర్లో ఎవరు చనిపోయినా సమాధి చేయాలి, కానీ కాల్చకూడదు.
ఊరి పెద్ద(శుభలేఖ సుధాకర్) ఉన్నట్టుండి చనిపోతాడు. ఊర్లోవారంతా ఆయన్ని అంత్యక్రియలు గ్రాండ్‌గా నిర్వహిస్తారు. ఆ ఊర్లో ఎవరు చనిపోయినా అంతిమ కార్యక్రమాలు చేసేది చిన్న(సుహాస్)నే.
అతను లేడంటే ఏపనైనా సరిగా అవదు. ఇక ఊరి పెద్ద చనిపోవడంతో ఆ బాధ్యతలు ఆయన కూతురు అపూర్వ(కీర్తిసురేష్) తీసుకుంటుంది. తనకు ఈ బాధ్యతలు, పెద్దరికాలు నచ్చవు. కానీ ఊరి కట్టుబాట్ల నేపథ్యంలో ఊరి పెద్దగా బాధ్యతలు తీసుకుంటుంది.
కానీ తమకి పెద్దరికం దక్కాలనీ భీమయ్య(బాబూమోహన్), మరో పెద్ద మధుబాబు(శత్రు) ప్లాన్ చేస్తుంటారు. ఇక అపూర్వ తొలి రచ్చ బండ కార్యక్రమం నిర్వహిస్తుంది. జనాలు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుంది.
కానీ ఊరి శ్మశానంలో స్థలం అయిపోతుంది, మరో నలుగురికే చోటు ఉంది, ఆ తర్వాత స్థలం ఎలా అనే ప్రశ్న చిన్న నుంచి వస్తుంది. దీంతో ఆలోచనలో పడుతుంది ఊరి పెద్ద అపూర్వ. అందుకు కొంత సమయం అడుగుతుంది.
ఈ క్రమంలో ఆ నాలుగు స్థలాల కోసం అంతా పోటీ పడతారు. దీంతో లక్కీ డ్రా తీస్తారు? అదే సమయంలో తాను చనిపోతే ఓ చెట్టుకింద సమాధి చేయమని చిన్న అమ్మ(తళ్లూరి రామేశ్వరి) కోరుతుంది.
మరి ఆ నాలుగు స్థలాలు ఎవరికి దక్కాయి? కొత్తగా చేసిన ప్రయత్నాలు ఏమయ్యాయి? సమాధి కోసం ఆ ఊర్లో జరిగిన గొడవలేంటి? చివరికి శ్మశానం సమస్య తీరిందా? ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన కథ.
`ఉప్పు కప్పురంబు` మూవీ విశ్లేషణ
ఇప్పుడు ఆడియెన్స్ థియేటర్లో కంటే ఓటీటీలోనే ఎక్కువగా సినిమాలు చూస్తున్నారు. ఓటీటీలోనే సినిమాలు చూసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. అయితే ఓటీటీలో మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు, వెబ్ సిరీస్‌లు వస్తున్నాయి.
అదే సమయంలో మంచి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు కూడా వస్తున్నాయి. ఎక్కువగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ సందడి చేస్తున్నాయి. ఓటీటీ ఆడియెన్స్ ని తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా మంచి కాన్సెప్ట్ తో, ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్ తో `ఉప్పుకప్పురంబు` మూవీ వచ్చింది.
సమాధి అనే పాయింట్ చుట్టూ ఈ మూవీని నడిపించిన తీరు బాగుంది. ఓ పల్లెటూరిలో శ్మశాన వాటిక కోసం జరిగే గొడవని ఇందులో ఆద్యంతం ఫన్నీగా రూపొందించారు దర్శకుడు ఐవీ శశి. సమాధి కోసం పోటీ పడటం అనే విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని కామెడీ డ్రామాగా తెరకెక్కించారు. అది ఆకట్టుకుంది.
కామెడీ చాలా వరకు సహజంగా డిజైన్ చేసుకున్నారు. దీనికి డ్రామా కూడా బలంగా జోడించారు. దీంతో ఆడియెన్స్ ని ఎంగేజ్ చేసేలా ఫస్టాఫ్ అంతా సరదాగా సాగుతుంది. ఊరి పెద్ద చనిపోవడం, దీంతో ఆ ఊరిపెద్దగా ఆయన కూతురు కీర్తిసురేష్ బాధ్యతలు తీసుకోవడం, ఆమె భయంగా, బిడియంగా వ్యవహరించారు, ఈ క్రమంలో చోటు చేసుకునే సన్నివేశాలు ఆద్యంతం నవ్వులు పూయించేలా ఉంటాయి.
సందర్భానుసారంగా పుట్టే కామెడీని నమ్ముకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ తర్వాత శ్మశానం గొడవ స్టార్ట్ అవుతుంది. ఇంటర్వెల్ నుంచి, క్లైమాక్స్ వరకు ఆ శ్మశానం స్థలం కోసమే గొడవలా, ఆ సమస్యని పరిష్కారం దిశగా వెళ్లడం, ఎక్కడ చూసినా చేదు అనుభవాలే ఎదురు కావడం, ఉన్నసమస్యకు తోడు కొత్త సమస్యలు పుట్టడం ఆద్యంతం ఫన్నీగా ఉంటాయి.
`ఉప్పు కప్పురంబు` లో హైలైట్స్, మైనస్‌లు
సెకండాఫ్ మొత్తం శ్మశానంలో చోటు కోసం కీర్తిసురేష్, మరోవైపు తన అమ్మ సమాధి కోసం సుహాస్ పడే స్ట్రగుల్ పన్నీగా డిజైన్ చేసుకున్నారు. ఈ క్రమంలో చోటు చేసుకునే డ్రామా ఎంగేజ్ చేసేలా ఉంటాయి.
ఇక క్లైమాక్స్ మాత్రం ఎమోషనల్‌గా మార్చారు. అది మరింత ఆకట్టుకుంటుంది. చివరి వరకు ఫన్నీగా తీసుకెళ్లి, ఎండ్‌లో ఎమోషనల్ టచ్ ఇచ్చి వదిలేశారు. సినిమా జస్ట్ కామెడీ, డ్రామా మాత్రమే కాదు, ఇందులో చాలా సెటైర్ ఉంది.
సమాజంమీద, ఊరికట్టుబాట్ల మీద చిన్నపాటి వ్యంగ్యాస్త్రంగా ఈ మూవీని రూపొందించడం విశేషం. అదే సమయంలో ఆలోచింపచేసే మూవీ కూడా. అయితే ఒక చిన్న పాయింట్ చుట్టూ సినిమాని నడిపించడం పెద్ద టాస్క్.
సందర్భాను సారంగా పుట్టే కామెడీ నమ్ముకోవడం కూడా సవాల్‌తో కూడుకున్నది. ఇందులోనూ ఆ సవాళ్లు ఎదురయ్యాయి. ఆ కామెడీ అంతగా వర్క్ కాలేదు. సమాధి పెట్టే స్థలం కోసం గొడవ అనేది చాలా సిల్లీగా ఉన్నట్టుగానే సినిమాని నడిపించిన తీరు కూడా అలానే అనిపిస్తుంది.
కామెడీ అంతగా వర్కౌట్ కాలేదు. డ్రామా కూడా పండలేదు. ఎమోషన్స్ కూడా పెద్దగా ఎక్కలేదు. అన్నీ లైటర్ వేలోనే ఉన్నాయి. దీనికితోడు కథనం, ఆర్టిస్ట్ నటన పరంగా కొంత ఓవర్ యాక్టింగ్‌గా అనిపిస్తుంది.
ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని పర్‌ఫెక్ట్ గా ఎమోషన్స్ మేళవించిన కామెడీ డ్రామాగా దీన్ని ఆశించిన స్థాయిలో తీర్చిదిద్దలేకపోయారని చెప్పొచ్చు. కాకపోతే ఓ కొత్త పాయింట్‌తో సినిమాని తీయడం బాగుంది, టెక్నీకల్‌గా బాగుంది. ఓటీటీలో సరదాగా చూసుకునేలా ఈ మూవీ ఉంటుందని చెప్పొచ్చు.
`ఉప్పు కప్పురంబు` ఆర్టిస్టుల పర్‌ఫెర్మెన్స్
కీర్తిసురేష్ చాలా రోజుల తర్వాత తెలుగు ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చింది. ఇందులో ఆమె కొత్తగా కనిపించింది. నటిగా ఆకట్టుకుంది. ఫన్నీగా అదరగొట్టింది. తనలోని భిన్నమైన నటిని బయటపెట్టింది.
అయితే ఆమె స్లిమ్‌గా మారడం వల్ల కొత్తగా అనిపిస్తుంది. కథ, కథనాలు పక్కన పెడితే ఆమె నటనతో మ్యాజిక్ చేసిందని చెప్పొచ్చు. చిన్నగా సుహాస్ పాత్రలో ఒదిగిపోయాడు. అదరగొట్టాడు.
ఇదంతా నిజంగానే జరుగుతుందనేంతగా పాత్రలను, సన్నివేశాలను రక్తికట్టించారు. భీమయ్యగా బాబూమోహన్ మరోసారి నవ్వించారు. చాలా రోజుల తర్వాత ఆయన పాత్ర బాగా ఆకట్టుకుందని చెప్పొచ్చు.
మధుబాబుగా శత్రు సైతం తనదైన కామెడీ యాక్టింగ్‌తో నవ్వించే ప్రయత్నం చేశారు. చిన్న తల్లిగా తళ్లూరి రామేశ్వరి అమ్మగా ఒదిగిపోయింది. అంతే సహజంగా చేసింది. మిగిలిన పాత్రధారులు తమ పాత్రల పరిధి మేరకు బాగా చేశారు. నవ్వించే ప్రయత్నం చేశారు.
`ఉప్పు కప్పురంబు` మూవీ టెక్నీషియన్ల పనితీరు
ఈ మూవీకి స్వీకార్ అగస్తి అందించిన పాటలు బాగున్నాయి. ముఖ్యంగా బీజీఎం ఆకట్టుకుంది. సినిమాని ఎలివేట్‌చేయడంలో కీలక పాత్ర పోషించింది. దివాకర్ మనీ కెమెరామెన్ వర్క్ బాగుంది. విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.
విలేజ్ అట్మాస్పియర్ న తీసుకొచ్చింది. శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ ఫర్వాలేదు. ఇంకా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలకు కొడవలేదు. చాలా బాగా తెరకెక్కించారు. దర్శకుడు ఐవి శశి ఎంచుకున్నపాయింట్ చాలా కొత్తగాఉంది.
ఇలాంటి పాయింట్ ఇప్పటి వరకు టచ్ చేయలేదనే చెప్పాలి. అదే సమయంలో సినిమాని అంతే ఫన్నీగా, కామెడీగా తీసుకెళ్లడంలో ఆశించిన స్థాయిలో రీచ్ కాలేదు.
కామెడీ, ఎమోషన్స్, బాధని లైటర్‌గా చూపించడంతో ఆ ఫన్, భావోద్వేగాలు పండలేదు. దీనికితోడు కథని మరింత కాస్త బాగా రాసుకుని, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో రూపొందిస్తే ఫలితం అదిరిపోయేది. ఓవరాల్‌గా ఇంటిళ్లిపాది కలిసి చూసే మంచి ఎంటర్‌టైనర్ అని చెప్పొచ్చు.
ఫైనల్‌గాః `ఉప్పు కప్పురంబు` ఆలోచింపచేసే కామెడీ డ్రామా.
రేటింగ్‌ః 2.5