- Home
- Entertainment
- Movie Reviews
- GOAT Movie Review: గోట్ మూవీ రివ్యూ, సుడిగాలి సుధీర్‌కి ఎట్టకేలకు హిట్ పడ్డిందా?
GOAT Movie Review: గోట్ మూవీ రివ్యూ, సుడిగాలి సుధీర్‌కి ఎట్టకేలకు హిట్ పడ్డిందా?
సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన `గోట్` మూవీ ఎట్టకేలకు ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది? సుధీర్ హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం.

సుడిగాలి సుధీర్ గోట్ మూవీ రివ్యూ
బుల్లితెరపై కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సుడిగాలి సుధీర్ ఇప్పుడు వెండితెరపై మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. హీరోగా ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన ఆయన, ఈసారి `గోట్`(G.O.A.T.) అనే ఆసక్తికరమైన టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. యాక్షన్, కామెడీ, రొమాన్స్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
దీనికి వేదవ్యాస్ ఆకుల దర్శకత్వం వహించారు. సుధీర్‌కు జోడీగా దివ్యభారతి నటించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మోగుళ్ల చంద్రశేఖర్, రవీందర్ రెడ్డి ఎన్ నిర్మించారు. ఇది నేడు గురువారం (నవంబర్ 12, 2026)న ఈ సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. మరి మూవీ ఎలా ఉంది? సుడిగాలి సుధీర్‌కి హీరోగా హిట్ పడిందా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
గోట్ మూవీ కథ
పశ్చిమ గోదావరి జిల్లా రుద్రవరం గ్రామంలో క్రికెట్ బెట్టింగ్ కొన్ని కుటుంబాల్లో విషాదాన్ని నింపుతుంది. ఈ వ్యవహారానికి కారణమైన వ్యక్తిని గ్రామపెద్ద కృష్ణంరాజు (సర్వదమన్ బెనర్జీ) కఠినంగా శిక్షిస్తాడు. ఈ పరిణామంతో తల్లిదండ్రులను కోల్పోయిన బాబ్జీ (నితిన్ ప్రసన్న) గ్రామపెద్దపై కక్ష పెంచుకుంటాడు. అతడిపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో రుద్రవరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్‌ను విస్తరిస్తాడు.
ఇక వైజాగ్‌లో చిన్నచిన్న దొంగతనాలు చేస్తూ జీవితాన్ని గడిపే హిట్ గణ అలియాస్ సార్ (సుడిగాలి సుధీర్) అనూహ్యంగా సుభాషిణి అనే అమ్మాయిని పెళ్లి మండపం నుంచి కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత అతడి ప్రయాణం రుద్రవరం వైపు సాగుతుంది. అక్కడ బాబ్జీతో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో తలపడాల్సి వస్తుంది. అసలు బాబ్జీకి కృష్ణంరాజుపై అంతటి కోపం ఎందుకు? హిట్ గణకు రుద్రవరంతో ఉన్న సంబంధం ఏమిటి? సుభాషిణిని ఎందుకు కిడ్నాప్ చేశాడు? కృష్ణంరాజు కోసం క్రికెట్‌కు దూరంగా ఉన్న గణ మళ్లీ బ్యాట్ ఎందుకు పట్టాల్సి వచ్చింది? ఈ పరిణామాల వెనుక ఉన్న అసలు కథే గోట్(G.O.A.T.).
గోట్ మూవీ విశ్లేషణ
దర్శకుడు వేదవ్యాస్ ఎంచుకున్న క్రికెట్ బెట్టింగ్ నేపథ్యం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. బెట్టింగ్ కారణంగా వ్యక్తుల జీవితాలు, కుటుంబాలు ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటాయనే సీరియస్ అంశాన్ని తీసుకొని, దానికి కామెడీ, ప్రేమ, కుటుంబ అనుబంధాలను జోడించిన విధానం ఆసక్తికరంగా ఉంది. అయితే ఈ మంచి పాయింట్‌ను తెరపై మరింత ఎఫెక్టీవ్‌గా ఆవిష్కరించాల్సింది.
ముఖ్యంగా ఫస్టాఫ్‌లో సుడిగాలి సుధీర్ కామెడీ టైమింగ్, ఇతర పాత్రలతో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి. కథలోని మెయిన్ కాన్ల్ఫిక్ట్ కి సంబంధించిన అంశాలను పరిచయం చేస్తూనే వినోదాన్ని అందించడంలో దర్శకుడు మంచి ప్రయత్నం చేశాడు. కామెడీతో పాటు అక్కడక్కడా వచ్చే ఎమోషనల్ సీన్లు కొంత వరకు బాగానే వర్కవుట్ అయ్యాయి.
కానీ సెకండాఫ్‌లో కథనం కొంత తడబడుతుంది. ఒకవైపు క్రికెట్ బెట్టింగ్, మరోవైపు ప్రతీకారం, ఇంకోవైపు ప్రేమ, కిడ్నాప్ నేపథ్యంలో సాగే సన్నివేశాలను బ్యాలెన్స్ చేయడంలో కొంత గందరగోళం కనిపిస్తుంది. కొన్ని పరిణామాలు ముందుగానే ఊహించే అవకాశం ఉండటంతో ఉత్కంఠ తగ్గుతుంది. ముఖ్యంగా సుభాషిణి పాత్ర చుట్టూ సాగే సన్నివేశాలు మరింత ఆసక్తికరంగా ఉండాల్సింది.
అయితే సుడిగాలి సుధీర్, దివ్య భారతి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు, సర్వదమన్ బెనర్జీ, నితిన్ ప్రసన్న మధ్య సాగే భావోద్వేగ సంఘర్షణ సినిమాకు కొంత బలాన్ని అందిస్తాయి. ఈ రెండు ట్రాక్‌లను మరింత బలంగా తీర్చిదిద్ది ఉంటే సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలిచేది. మరోవైపు సెకండాఫ్ రియాలిటీ తగ్గింది. ఏఐ ద్వారా చేశారా అనే ఫీలింగ్ తెప్పిస్తుంది.
మరోవైపు సినిమాలో స్ఫూప్‌లు ఆశ్చర్యపరుస్తాయి. ఇతర హిట్ సినిమాల సీన్లు కొంత బాగానే ఉన్నా, చాలా వరకు మెప్పించడంలో విఫలమయ్యాయి. కామెడీపై మరింత ఫోకస్ పెట్టాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్ విషయంలో ఇంకా బాగా చేయాల్సింది. అందులో సీరియస్‌నెస్ తగ్గింది. కొన్ని లాజిక్ లెస్‌గా ఉంటాయి. కొన్ని సీన్లు రియాలిటీకి దూరంగా ఉంటాయి. ఇలా మైనస్ లను బాగా చేసి ఉంటే మంచి ఎంటర్టైనర్ అయ్యేది.
గోట్లో నటీనటులు ఎలా చేశారంటే
జబర్దస్త్, ఇతర కామెడీ షోల ద్వారా విశేషమైన గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్, ఈ సినిమాలో హిట్ గణ పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. కామెడీ సన్నివేశాల్లో తన టైమింగ్‌ను మరోసారి ప్రదర్శించాడు. కేవలం నవ్వించడమే కాకుండా ఎమోషనల్ సీన్లలోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు. కాకపోతే ఆయనలో సీరియస్ నెస్ లేదని పాత్రని చూస్తుంటే అర్థమవుతుంది.
దివ్య భారతి తన పాత్రకు తగినట్టుగా సహజమైన నటనతో ఆకట్టుకుంది. గ్లామర్‌తో పాటు అభినయంతోనూ మెప్పించింది. నితిన్ ప్రసన్న విలన్‌గా మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. ప్రతీకారంతో రగిలిపోయే బాబ్జీ పాత్రలో మంచి నటన కనబరిచాడు. గ్రామపెద్ద కృష్ణంరాజుగా సర్వదమన్ బెనర్జీ హుందాతనంతో కూడిన నటనను ప్రదర్శించారు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన అనుభవం కనిపిస్తుంది. మిగిలిన నటీనటులు, కామెడీ ఆర్టిస్టులు తమ పాత్రల పరిధిలో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
టెక్నీకల్‌గా గోట్ ఎలా ఉందంటే
క్రికెట్ బెట్టింగ్ వంటి సమకాలీన అంశాన్ని గ్రామీణ నేపథ్యానికి అనుసంధానించి కథను రూపొందించిన దర్శకుడు వేదవ్యాస్ ఆలోచన అభినందనీయం. అయితే స్క్రీన్‌ప్లే విషయంలో మరింత కసరత్తు చేయాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కథను వేగంగా, ఇంట్రెస్టింగ్గా నడిపించడంపై దృష్టి పెట్టి ఉంటే మంచి ఫలితం వచ్చేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. నిర్మాతలు మోగుళ్ల చంద్రశేఖర్, రవీందర్ రెడ్డి ఎన్ కథకు అవసరమైన నిర్మాణ ప్రమాణాలను పాటించారు. విజువల్స్ ఫర్వాలేదు. మ్యూజిక్ అంతంత మాత్రంగానే ఉంది. ఎడిటింగ్ పరంగా ఇంకా కేర్ తీసుకోవాల్సింది.
ఫైనల్‌గా
G.O.A.T సినిమా క్రికెట్, కామెడీ, ప్రేమ, కుటుంబ అనుబంధాలు, గ్రామీణ రాజకీయాల కలయికతో రూపొందిన వినోదాత్మక ప్రయత్నం. సుడిగాలి సుధీర్ తన కామెడీతో సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఫస్టాఫ్‌లో కొంత ఎంటర్టైన్మెంట్, సెకండాఫ్‌లో ఎమోషన్స్ కొంతవరకు మెప్పిస్తాయి. అయితే కథలోని బలమైన అంశాలకు తగ్గట్టుగా కథనం మరింత ఆసక్తికరంగా సాగి ఉంటే సినిమా స్థాయి పెరిగేది. సుధీర్ అభిమానులకు నచ్చే మూవీ అవుతుంది.
రేటింగ్: 2.5













