- Home
- Entertainment
- Movie Reviews
- Kondapalli Raja Review: చిరంజీవి చేయాల్సిన సినిమాపై మనసు పడ్డ వెంకటేష్, కోర్టుకెక్కిన కృష్ణంరాజు, కొండపల్లి రాజా రివ్యూ..
Kondapalli Raja Review: చిరంజీవి చేయాల్సిన సినిమాపై మనసు పడ్డ వెంకటేష్, కోర్టుకెక్కిన కృష్ణంరాజు, కొండపల్లి రాజా రివ్యూ..
Kondapalli Raja Review: విక్టరీ వెంకటేష్, నగ్మా, సుమన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన క్లాసిక్ ఎమోషనల్ అండ్ మాస్ డ్రామా 'కొండపల్లి రాజా. ఇద్దరు స్నేహితుల చుట్టు తిరిగే ఎమోషనల్ కథతో తీసిన ఈమూవీ బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

కొండపల్లి రాజా కథ విషయానికి వస్తే..
రాజా (వెంకటేష్) పాలు అమ్ముకునే ఒక సాధారణ పేద యువకుడు. అశోక్ (సుమన్) ఒక పెద్ద కోటీశ్వరుడైన గంగాధరం (కోట శ్రీనివాసరావు) కొడుకు. హోదాలో తేడాలు ఉన్నప్పటికీ, చిన్నతనం నుంచే వీరిద్దరూ ప్రాణ స్నేహితులు. అశోక్ ప్రేమించిన పేద అమ్మాయిని రాజా దగ్గరుండి పెళ్లి జరిపిస్తాడు. మరోవైపు రాజా, సుబ్బలక్ష్మి (నగ్మా) అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు.
అయితే, పేదవాడైన రాజాతో తన కొడుకు స్నేహం చేయడం గంగాధరానికి అస్సలు నచ్చదు. కుట్ర పన్ని, రాజా తన తల్లి ప్రాణంగా భావించే ఇల్లు , స్థలాన్ని మోసపూరితంగా అశోక్ పేరు మీదకి మారేలా చేస్తాడు. తన ఇల్లు కూల్చివేయడానికి అశోక్ కూడా అంగీకరించాడని రాజాకు తప్పుడు సమాచారం చేరేలా చేస్తాడు గంగాధర్. ఈవిషయం తెలిశాక రాజా తీవ్ర గుండెకోతకు గురవుతాడు. స్నేహితుడి చేతిలోనే మోసపోయానని భావించిన రాజా, అశోక్ ఇంటికి వెళ్లి సవాలు విసురుతాడు.
"కేవలం పాలు అమ్ముకునే స్థాయి నుంచి నీకంటే పెద్ద కోటీశ్వరుడిగా ఎదుగుతాను" అని ఛాలెంజ్ చేసి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రాజా తన కష్టార్జితంతో, తెలివితేటలతో ఎలా పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగాడు? అశోక్‌ను వ్యాపారంలో ఎలా ఓడించాడు? గంగాధరం పన్నిన కుట్రలు ఎలా బయటపడ్డాయి? చివరికి స్నేహితులు ఇద్దరూ ఎలా ఒక్కటయ్యారు? అనేదే మిగతా కథ.
నటీనటుల ప్రతిభ
ఈ సినిమాలో ఇద్దరు హీరోలు అద్భుతంగా నటించారు. ముఖ్యంగా వెంకటేష్ ఈ సినిమాలో రెండు భిన్నమైన గెటప్స్ ..షేడ్స్‌లో అద్భుతంగా నటించారు. మొదటి సగంలో అమాయకమైన, సరదాగా ఉండే పాల వ్యాపారి రాజాగా మాస్ ఆడియన్స్‌ను మెప్పించారు. రెండో సగంలో గంభీరమైన, రాజసం ఉట్టిపడే బిజినెస్ మెన్ గా సీరియస్ లుక్‌లో సూపర్బ్‌గా ఒదిగిపోయారు. సవాలు విసిరే సన్నివేశంలో ఎంత పవర్ ఫుల్ గా కనిపించాడో.. తల్లితో ఎమోషన్స్ సీన్స్ లో కంటతడిపెట్టించాడు. అంతే కాదు నగ్మతో రొమాన్స్ లో కూడా రెచ్చిపోయాడు వెంకీ.
ఇక సుమన్ విషయానికి వస్తే.. అశోక్ పాత్రలో సుమన్ చాలా డిగ్నిఫైడ్‌గా నటించారు. స్నేహానికి, తండ్రి మాటకి మధ్య నలిగిపోయే పాత్రలో ఆయన పండించిన ఎమోషన్స్ సూపర్. వెంకటేష్ - సుమన్ మధ్య వచ్చే కాంబినేషన్ సీన్స్ , డ్రామా సినిమాకి ప్రధాన బలం. ఇక సుబ్బలక్ష్మిగా నగ్మా గ్లామర్‌తో పాటు నటనతోనూ ఆకట్టుకుంది.
వెంకటేష్ - నగ్మా జోడీ మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. కోట శ్రీనివాసరావు విలనిజం సినిమాని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లగా, తల్లి పాత్రలో సుజాత జీవించారు. శ్రీకాంత్, సుధాకర్, కాస్ట్యూమ్స్ కృష్ణ తమ పాత్రలకు న్యాయం చేశారు.
డైరెక్షన్,మ్యూజిక్ అద్భుతం..
ఈ సినిమా ముందు తెలుగులో కృషంరాజు చేశారు.. ఆతర్వాత తమిళంలో రజినీకాంత్ అణ్ణామలై పేరుతో రీమేక్ చేయగా.. అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ కథను మళ్లీ రవిరాజా పినిశెట్టి.. తెలుగు నెటివిటీకి తగ్గట్టుగా ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్‌ని కలగలిపి తెరకెక్కించారు. స్క్రీన్‌ప్లే చాలా ఆసక్తికరంగా సాగుతుంది. అన్ని రకాల సన్నివేశాలు ఆడియన్స్ ను కట్టిపడేశాయి. ఇక ఈసినిమాకు మరో బలం కీరవాణి మ్యుూజిక్. ఈమూవీలో పాటలన్నీ బ్లాక్ బస్టర్ హిట్సే. ముఖ్యంగా సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు.. "కొండపల్లి రాజా గుండె చూడరా" లాంటి పాటలన్నీ చార్ట్‌బస్టర్స్ గా నిలిచాయి.
సినిమా ప్లస్ & మైనస్ పాయింట్లు
ప్లస్ పాయింట్స్ :
వెంకటేష్ - సుమన్ ల నటన, వారి మధ్య స్నేహం-వైరం డ్రామా.
పవర్ ఫుల్ డైలాగ్స్ - యాక్షన్ సీన్స్
ఎం.ఎం. కీరవాణి సంగీతం తో పాటు రీ-రికార్డింగ్.
ఫస్ట్ హాఫ్ కామెడీ, సెకండ్ హాఫ్ ఎమోషనల్ రైజ్.
మైనస్ పాయింట్స్ :
కొన్ని సీన్స్ రొటీన్ రిలీజ్ డ్రామాలా అనిపిస్తాయి.
సెకండ్ హాఫ్‌లో రాజా త్వరగా కోటీశ్వరుడైపోయే సీన్స్ కాస్త సినిమాటిక్‌గా ఉంటాయి.
చిరంజీవి చేయల్సిన సినిమా వెంకటేష్ చేతికి
నిజానికి ఈ సినిమా చిరంజీవి చేయాల్సి ఉంది. తమిళంలో రజినీకాంత్ నటించిన 'అణ్ణామలై' హక్కులను నిర్మాత K.V.V. సత్యనారాయణ కొనుగోలు చేశారు. మొదట ఈ మాస్ కథకు మెగాస్టార్ చిరంజీవి సరిపోతారని భావించి, ఆయనను విమానంలో కలిసినప్పుడు కథ చెప్పారు. చిరంజీవి కూడా చేయడానికి ఓకే అన్నారు. అయితే అదే సమయంలో వెంకటేష్‌తో 'సుందరకాండ' సినిమా చేస్తున్నారు.
ఈ కథ గురించి తెలిసి.. వెంకీ తానే స్వయంగా సత్యనారాయణ వద్దకు వచ్చి, ఈ రీమేక్ మనమే చేద్దామని ప్రతిపాదించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ వెంకటేష్ చేతుల్లోకి వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నగ్మాను ఎంపిక చేశారు. కానీ ఆ సమయంలో ఆమె 'తొలిముద్దు' సినిమా షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల డేట్ల సమస్య వచ్చింది. కానీ దర్శకుడు, నిర్మాతలు పట్టుబట్టి నగ్మానే హీరోయిన్గా ఫైనల్ చేశారు.
కోర్టుకెక్కిన కృష్ణంరాజు..
ఈ సినిమా జెఫ్రీ ఆర్చర్ రాసిన 'కేన్ అండ్ ఎబెల్' నవల ఆధారంగా హిందీలో 'ఖుద్గర్జ్' (1987) వచ్చింది. ఇదే కథ ఆధారంగా తెలుగులో 1988లోనే రెబెల్ స్టార్ కృష్ణంరాజు, శరత్ బాబులతో 'ప్రాణ స్నేహితులు' సినిమా తీశారు. అయినప్పటికీ, 1992లో తమిళంలో రజినీకాంత్‌తో 'అణ్ణామలై'గా తీసి బ్లాక్‌బస్టర్ కొట్టారు. దాంతో తెలుగులో చిన్న చిన్న మార్పులతో 'కొండపల్లి రాజా'గా వెంకటేష్‌తో మళ్లీ రీమేక్ చేసి సక్సెస్ సాధించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో కథ హక్కులకు సంబంధించి నటుడు కృష్ణంరాజు కోర్టును ఆశ్రయించారు. తర్వాత ఇరువర్గాలు కాంప్రమైజ్ కావడంతో వివాదం సమసిపోయింది.
బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ గా..
9 జూలై 1993న విడుదలైన 'కొండపల్లి రాజా' వెంకటేష్ కెరీర్లో బిగ్గెస్ట్ మాస్ కమర్షియల్ హిట్ గా నిలిచింది. కేవలం ఒక కమర్షియల్ సినిమా మాత్రమే కాదు.. స్నేహం విలువ తెలిపి.. ఎమోషనల్ గా ఆడియన్స్ మనసుల్లో నిలిచిపోయింది. ఏమాత్రం బోర్ కొట్టించని స్క్రీన్ ప్లేతో.. ఈ తరం ప్రేక్షకులను కూడా అలరించేలా ఉండే ఈ సినిమాను చూడాలంటే.. యూట్యూబ్ లో అందుబాటులోనే ఉంది.













