- Home
- Entertainment
- Movie Reviews
- Dhoolpet Police Station Review: `ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్` కేస్ 1 వెబ్ సిరీస్ రివ్యూ.. చూపు తిప్పుకోలేరు
Dhoolpet Police Station Review: `ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్` కేస్ 1 వెబ్ సిరీస్ రివ్యూ.. చూపు తిప్పుకోలేరు
Dhoolpet Police Station Review: ఒకే రాత్రి మూడు హత్యలు జరుగుతాయి. అయితే ఊహించినట్టుగానే ఈ హత్యలు జరుగుతాయి. మరి దీని వెనకాల ఉన్నదెవరు. ఇద్దరు పోలీస్ అధికారులు దీన్ని ఎలా ఇన్వెస్ట్ గేట్ చేశారనేది రివ్యూలో తెలుసుకుందాం.

ధూల్ పేట్ పోలీస్ స్టేషన్ కేస్ 1 రివ్యూ
ఇటీవల కాలంలో వెబ్ సిరీస్‌లు అంటే క్రైమ్ థ్రిల్లర్సే ఎక్కువగా వస్తున్నాయి. కానీ వేటికవే ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. అలరిస్తున్నాయి. ఆడియెన్స్ ని ఎంగేజ్ చేస్తున్నాయి. తాజాగా ఓటీటీలో విశేషంగా ఆకట్టుకుంటోంది `ధూల్ పేట్ పోలీస్ స్టేషన్ కేస్ 1` వెబ్ సిరీస్. తమిళంలో రూపొందిన ఈ సిరీస్ ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇది గత నెలలో `ఆహా`లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో అశ్విన్, గురు లక్ష్మణన్, పదినే కుమార్, శ్రీతు కృష్ణన్, ప్రీతి శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. జస్విని దర్శకత్వం వహించిన ఈ సిరీస్ కి చెందిన 20 ఎపిసోడ్లు `ఆహా`లో అందు బాటులో ఉన్నాయి. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? అందులో ఏం చూపించారనేది రివ్యూలో తెలుసుకుందాం.
ధూల్ పేట్ పోలీస్ స్టేషన్ కేస్ 1 కథ
‘ధూల్ పేట్ పోలీస్ స్టేషన్’ పరిధిలో దసరా నవరాత్రుల వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. అదే సమయంలో ఆ ప్రాంతానికి కొత్త పోలీస్ ఆఫీసర్‌గా వెట్రి మారన్ (అశ్విన్) నియమితుడవుతాడు. ఆయన చాలా స్టిక్ట్స్ ఆఫీసర్, కరప్షన్‌కి దూరంగా ఉంటారు. ఆయనంటే అందరికి హడల్. అయితే స్థానికంగా రాజకీయాల వెనక దాగి ఉన్న అమానుషత్వాన్ని క్రమంగా తెలుసుకుంటాడు వెట్రి మారన్. అదే స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మాసాని (పదినే కుమార్) అమ్మవారి భక్తురాలు. ఆమెకు రాబోయే కొన్ని సంఘటనలు ముందుగానే తెలిసే శక్తి ఉంటుంది. మూడు హత్యలు జరగబోతున్నాయన్న విషయం ఆమెకు ముందే తెలుస్తుంది. ఈ విషయాన్ని తోటి పోలీసులకు చెప్పడంతో, ఆమె మాట నిజమవుతుందన్న నమ్మకంతో వారంతా ఆందోళనకు గురవుతారు. ఎందుకంటే ‘ధూల్ పేట్ శంకర్’ వర్గానికి చెందిన వారు శత్రువులపై ప్రతీకార చర్యలకు సిద్ధంగా ఉన్నారని వారికి తెలుసు. అనుకున్నట్లే ఆ గ్రామంలో మూడు హత్యలు జరుగుతాయి. వాటిలో ఉమాపతి కూతురు సంధ్య కూడా ఉండటంతో గ్రామమంతా కలవరపడుతుంది. సంధ్య బంగారు ఆభరణాలను అక్రమంగా అమ్మేందుకు వెళ్లిన సుకుమార్ పోలీసుల చేతికి చిక్కుతాడు. అతడు ఉమాపతి ఐస్‌మిల్‌లో పనిచేస్తుంటాడు. తాను, సంధ్య ప్రేమించుకున్నామని, ఆ నగలు ఆమెనే ఇచ్చిందని చెబుతాడు. ఆమె హత్యలో తనకు ఎలాంటి పాత్ర లేదని, అసలు ఎవరు చంపారో తనకు తెలియదని స్పష్టం చేస్తాడు. ఈ కేసును విచారించేందుకు వెట్రి మారన్ రంగంలోకి దిగుతాడు. అయనతోపాటు మరో పోలీస్ అధికారి ఏసీపీ అర్జున్(గురు లక్ష్మణన్) ఇదే కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి వస్తారు. వెట్రి మారన్, అర్జున్ కలిసి ఈ కేసుని విచారిస్తారు. మరి ఈ ఇద్దరు ఈ కేసుని ఎలా డీల్ చేశారు? ఇద్దరి మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? సంధ్యను హత్య చేసింది ఎవరు? మిగతా రెండు హత్యల వెనుక ఎవరు ఉన్నారు? ధూల్ పేట్‌లో అసలు ఏమి జరుగుతోంది? అన్నదే కథ.
ధూల్ పేట్ పోలీస్ స్టేషన్ కేస్ 1 విశ్లేషణ
స్వార్థ రాజకీయాలు, రౌడీ రాజకీయాల నేపథ్యంలో నడిచే కథ ఇది. పగ, ప్రతీకారం చుట్టూ తిరిగే కథను గ్రామం కోణంలో కాకుండా పోలీస్ స్టేషన్ దృష్టికోణంలో చూపించడం ఆసక్తికరంగా ఉంటుంది. ధూల్ పేట్ గ్రామానికి చెందిన సెంటిమెంట్స్, కుటుంబ భావోద్వేగాలను కూడా కథలో మేళవించిన తీరు బాగుంది. వాటిని బాగా బ్యాలెన్స్ చేశారు. ఒక వైపు గ్రామ జీవితం, మరో వైపు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే సంఘటనలతో కథను సమాంతరంగా నడిపించారు. ఆరంభంలోనే మూడు హత్యలతో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన దర్శకుడు, ఆ హత్యల వెనుక ఉన్న కారణాలు, వ్యక్తుల్ని క్రమంగా బయటపెట్టే ప్రయత్నం చేయడం ఆకట్టుకుంటుంది. ఒక హత్య ప్రేమకథతో ముడిపడి ఉండటం కథకు మరింత ఉత్కంఠను జోడిస్తుంది. రాజకీయాల నేపథ్యంలో నడిచే రౌడీయిజం, పాత శత్రుత్వాలతో రూపొందిన సన్నివేశాలు టెన్షన్‌ను పెంచుతాయి. ఎప్పుడూ పగలు, ప్రతీకారాలతో మండిపడే గ్రామంలో పోలీస్‌గా విధులు నిర్వర్తించడం ఎంత కష్టమో దర్శకుడు చూపించిన తీరు మెప్పిస్తుంది. తొలి ఐదు ఎపిసోడ్స్‌లోనే ప్రధాన కథను చాలావరకు చెప్పేశారు. ఆరో ఎపిసోడ్ నుంచి కథ ఊపందుకుంటుంది. ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో ఆద్యంతం కట్టిపడేస్తుంది. థ్రిల్‌కి గురి చేస్తుంది. సీరియస్ కథలోనూ కొంత ఫన్ యాడ్ చేయడం క్రేజీగా ఉంది. పోలీసుల మధ్య చోటు చేసుకునే సన్నివేశాలు, విచారణ చేసే క్రమంలో వచ్చే కొన్ని సీన్లు క్రేజీగా ఉంటాయి. క్రైమ్ థ్రిల్లింగ్ అంశాలు ఈ సిరీస్‌కి పెద్ద అసెట్‌గా నిలిచాయి. విచారించే సన్నివేశాలు కూడా ఆద్యంతం రేసీగా, ఎంగేజ్ చేసేలా ఉంటాయి. కొత్త పాత్రలు, కొత్త ట్విస్ట్ లు నెక్ట్స్ ఏం జరుగుతుందనే ఉత్కకంఠని క్రియేట్ చేస్తుంటాయి. ఈ కేసు విచారణ నడిపించిన తీరు కూడా కొత్తగా ఉంటుంది. ఇటీవల కాలంలో వస్తోన్న అనేక సిరీస్‌లకు ఇది భిన్నంగా ఉంటుంది. యాక్షన్‌తో పాటు సస్పెన్స్, భావోద్వేగాలు, ప్రేమ కథలను మేళవిస్తూ కథను నడపడం దీని ప్రత్యేకత. ఇది ఏకంగా 20 ఎపిసోడ్లు ఉన్నాయి. దీంతో ఇది అతిపెద్ద వెబ్ సిరీస్ గా నిలిచింది. ఇదే కాదు ఇందులో ఏకంగా యాభై ఎపిసోడ్లు ఉంటాయట. మరి ఇరవై ఎపిసోడ్లే ఇలా ఉంటే, యాభై ఎపిసోడ్లు ఇంకెంత ఎంగేజింగ్‌గా ఉంటాయో చూడాలి. అయితే ఈ 20 ఎపిసోడ్లతో కేస్ 1 ముగిసింది. మరి ఇప్పుడు కేసు 2 కోసం రెడీ అవుతున్నారు. అది ఎలా ఉంటుందో చూడాలి.
ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్ల పనితీరు
పోలీస్ ఆఫీసర్లుగా అశ్విన్, గురు లక్ష్మణన్ అదరగొట్టారు. అశ్విన్ స్టయిల్‌గా కనిపిస్తూనే, సీరియస్‌గా, సిన్సియర్‌గా కనిపిస్తూ ఆకట్టుకున్నారు. ఆయన నటన ఆద్యంతం కట్టిపడేస్తుంది. ఇక గురు లక్ష్మణన్ ఫన్నీ యాంగిల్‌తో అదరగొట్టారు. దీనికితోడు అశ్విన్‌కి పోటీగా ఆయన కూడా మెప్పించారు. వీరి కాంబినేషన్‌లో సీన్లు ఎంగేజ్ చేస్తాయి. వీరితోపాటు పదినే కుమార్, శ్రీతు కృష్ణన్, ప్రీతి శర్మ ల నటన సైతం ఆకట్టుకుంటుంది. పదినే కుమార్ మాత్రం అదరగొట్టింది. మిగిలిన పాత్రలు ఓకే అనిపిస్తాయి.
రమణగిరి వాసన్ రూపొందించిన కథ అదిరిపోయింది. చూస్తున్నంత సేపు వాహ్ ఫీలింగ్‌ని తీసుకొస్తుంది. దాన్ని అంతే బాగా రూపొందించాడు దర్శకుడు జస్విని. ఆయన టేకింగ్, కథని నడిపించిన తీరు అదిరిపోయింది. అన్ని అంశాలను బ్యాలెన్స్ చేసిన తీరు కూడా బాగుంది. అనేక మలుపులు తీసుకునే అవకాశం ఉన్న కథ ఇది. సతీశ్ కుమార్ సినిమాటోగ్రఫీ, అశ్వత్ నేపథ్య సంగీతం, సామ్ ఆర్డీఎక్స్ ఎడిటింగ్ పనితనం అన్ని చక్కగా కుదిరాయి.
ఫైనల్‌గా
‘ధూల్ పేట్ పోలీస్ స్టేషన్’ పరిధిలో జరిగే సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సిరీస్, విలేజ్ పాలిటిక్స్ ని, రౌడీయిజాన్ని ఎదుర్కొంటూ పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూపిస్తుంది. ఆసక్తికరమైన డ్రామాతో నడిచే ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. సరికొత్త థ్రిల్ కోసం చూడదగ్గ సిరీస్.
రేటింగ్: 2.75

