- Home
- Entertainment
- Movie Reviews
- Bhairava Dweepam Review: బాలకృష్ణ కురూపిగా చేసిన సాహసం, విజువల్ వండర్ గా ఎలా నిలిచింది, భైరవద్వీపం సక్సెస్ కు కారణాలు..
Bhairava Dweepam Review: బాలకృష్ణ కురూపిగా చేసిన సాహసం, విజువల్ వండర్ గా ఎలా నిలిచింది, భైరవద్వీపం సక్సెస్ కు కారణాలు..
Bhairava Dweepam Review: నందమూరి బాలకృష్ణ కెరీర్ లో సాహసం చేసి డీగ్లామర్ లుక్ లో నటించిన సినిమా భైరవద్వీపం. దివంగత దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ అద్భుత దృశ్య కావ్యం గురించి రివ్యూ రూపంలో తెలుసుకుందాం.

చరిత్రలో నిలిచిపోయిన సినిమా..
తెలుగు చలనచిత్ర చరిత్రలో జానపద చిత్రాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎన్టీఆర్ కాలంలో వెలుగువెలిగిన జానపద శైలిని, 90ల కాలంలో ఆధునిక సాంకేతికతను కలిపి మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన అద్భుత దృశ్యకావ్యం 'భైరవ ద్వీపం'. నందమూరి బాలకృష్ణ, రోజా జంటగా, ప్రయోగాలకు పెట్టింది పేరు.. సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో ఒకటిగా నిలిచిపోయింది. 'భైరవ ద్వీపం' చిత్రాన్ని ప్రఖ్యాత చందమామ విజయ కాంబైన్స్ పతాకంపై బి. వెంకటరామిరెడ్డి నిర్మించారు. 1994 ఏప్రిల్ 14న విడుదలైన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాకుండా తొమ్మిది నంది అవార్డులను కైవసం చేసుకుంది.
భైరవ ద్వీపం కథ విషయానికి వస్తే..
జయంతిపురం మహారాజు (విజయకుమార్), మహారాణి వసుంధర (కే.ఆర్. విజయ)ల కుమారుడు విజయ్ (నందమూరి బాలకృష్ణ). దురదృష్టవశాత్తు చిన్నతనంలోనే తల్లికి దూరమై, ఒక గిరిజన గూడెంలో పెరుగుతాడు. అక్కడ అతను సకల విద్యలు నేర్చుకుని ధైర్యసాహసాలు కలిగిన యువకుడిగా మారతాడు.
మరోవైపు, పద్మావతిదేవి (రోజా) కార్తవీరపురం రాజకుమారి. ఆమెను చూసి ప్రేమించిన విజయ్, తన తెలివితేటలతో ఆమె మనసు గెలుచుకుంటాడు. అయితే, భైరవ ద్వీపానికి అధిపతి అయిన మాంత్రికుడు భైరవుడు (విజయ రంగరాజు) అమరత్వం కోసం, పద్మావతిని బలి ఇవ్వాలని కుట్ర పన్నుతాడు. తన మాంత్రిక శక్తులతో ఎగిరే గుర్రం, మాయా వస్త్రాల సహాయంతో పద్మావతిని భైరవ ద్వీపానికి ఎత్తుకెళ్తాడు.
తన ప్రియురాలిని కాపాడుకోవడానికి విజయ్ భైరవ ద్వీపానికి ప్రయాణమవుతాడు. ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న రాక్షసులు, మాయామంత్రాలు, వింత ఆటంకాలు ఏమిటి? బాలయ్య కురూపిగా ఎందుకు మారతాడు. యక్షిణిగా రంభ పాత్ర ఎలా ఉంటుంది? చివరికి భైరవుడిని అంతం చేసి కాంతిమతిని ఎలా రక్షించాడు? తన కన్నతల్లిని ఎలా కలుసుకున్నాడు? అనేదే భైరవ ద్వీపం ముఖ్య కథ.
నటీనటులు ఎలా చేశారంటే..
నందమూరి బాలకృష్ణ ప్రదర్శన
బాలకృష్ణ ఈ సినిమాలో రెండు విభిన్నమైన కోణాల్లో కనిపించారు. ఒకటి రాజసంతో కూడిన వీరుడిగా కాగా, మరొకటి యక్షిని (రంభ) శాపం వల్ల "కురూపి"గా మారే పాత్ర. శాపం వల్ల రూపం మారినప్పుడు ఆయన చూపించిన హావాభావాలు, ఆంగికాభినయం ప్రేక్షకులచేత కంటతడి పెట్టిస్తాయి. కత్తిసాము, గుర్రపు స్వారీ, పౌరాణిక/జానపద డైలాగ్ డెలవరీలో బాలకృష్ణ నటన అద్భుతం అని చెప్పాలి.
ఇక హీరోయిన్ గా రోజా గ్లామర్ ఈసినిమాకు బాగా ఉపయోగపడింది. నిజంగా రాకుమారిలా కనిపించి అందరిని తన నటనతో ఆకట్టుకుంది. స్పెషల్ సాంగ్ చేసిన రంభ కూడా ఈ కథను మలుపు తిప్పే పాత్రలో నటించి మెప్పించింది. ఇక ఇతర సీనిర్ తారాగణం తమ పాత్రల పరిది మేరకు బాగా నటించి మెప్పించారు.
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వ పటిమ
విచిత్ర సహోదరులు, మైఖేల్ మదన కామరాజు, ఆదిత్య 369 వంటి ప్రయోగాత్మక చిత్రాలను అందించిన సింగీతం శ్రీనివాసరావు, భైరవ ద్వీపంతో జానపద రంగాన్ని ఒక కొత్త శిఖరానికి తీసుకెళ్లారు. గ్రాఫిక్స్ పరిమితంగా ఉన్న ఆ రోజుల్లోనే ప్రాక్టికల్ ఎఫెక్ట్స్, సెట్స్, కెమెరా ట్రిక్స్ ఉపయోగించి కథను విజువల్ వండర్‌గా మలిచారు.
సంగీతం- సాహిత్యం
మాధవపెద్ది సురేష్ అందించిన స్వరాలు ఈ సినిమాకి ప్రధాన బలం. "శ్రీతుంబుర నారదనాదమయం" పాట తెలుగు సినీ చరిత్రలోనే ఒక క్లాసిక్‌గా నిలిచింది. "నరుడా ఓ నరుడా ఏమి నీ కోరిక" పాటలో రంభ నృత్యం, విజువల్ మేకింగ్ అద్భుతంగా ఉంటాయి. ''విరిసినది వంసంత గానం వలపుల పల్లకిగా'' పాటలో రోజా నటన, అందం అద్భుతమని చెప్పాలి.
భైరవ ద్వీపం బ్యాక్‌గ్రౌండ్ సంగతులు
తెలుగులో 'పాతాళ భైరవి', 'జగదేకవీరుని కథ' వంటి రత్నాల్లాంటి జానపద చిత్రాలను అందించిన విజయ వాహిని సంస్థ వారసత్వంలో, 'చందమామ విజయ కాంబైన్స్' బ్యానర్‌పై వచ్చిన చిత్రం ఇది. పాతకాలపు విజయా పిక్చర్స్ నిర్మాణ విలువలను పునఃసృష్టి చేయాలనే లక్ష్యంతో దీనిని నిర్మించారు.
1990ల ప్రారంభంలో కంప్యూటర్ గ్రాఫిక్స్ (CGI) భారతదేశంలో ఇంకా మొదటిశలోనే ఉన్నాయి. ఈ సినిమాలో కనిపించే ఎగిరే గుర్రం (Pegasus), కొండచిలువ సన్నివేశాలు, మాయా ద్వీపం సెట్లను అనలాగ్ స్పెషల్ ఎఫెక్ట్స్, మినియేచర్ మోడల్స్ , క్రోమా కీ సాంకేతికతతో సృష్టించారు.
ఇక బాలకృష్ణ కురూపిగా మారే సన్నివేశాల కోసం ప్రతిరోజూ గంటల కొద్దీ ప్రొస్థెటిక్ మేకప్ వేసేవారు. వేడి వాతావరణంలో అంతటి భారమైన మేకప్‌తో నటించడం బాలకృష్ణ అంకితభావానికి నిదర్శనం.
అవార్డుల పంట పండించిన సినిమా..
రిలీజ్ అవ్వడంతోనే భారీ రెస్పాన్స్ సాధించిన భైరవ ద్వీపం 1994 సంవత్సరానికి గాను 9 రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు (సింగీతం శ్రీనివాసరావు), ఉత్తమ సంగీత దర్శకుడు (మాధవపెద్ది సురేష్), ఉత్తమ ఛాయాగ్రహణం (బి.సి. కణ్ణన్) వంటి ప్రధాన విభాగాల్లో పురస్కారాలు దక్కాయి. వీరితో పాటు ఆర్ట్ డైరెక్షన్, కాస్ట్యూమ్ డిజైనింగ్, మేకప్, ఆడియోగ్రఫీ , ఎడిటింగ్ విభాగాల్లో మిగిలిన 5 నంది పురస్కారాలు లభించాయి.
ఫైనల్ గా ఈ సినిమా ఎలా ఉందంటే?
'భైరవ ద్వీపం' కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, తెలుగు చిత్రసీమ గర్వించదగ్గ ఒక అద్భుత జానపద కళాఖండం. నేటితరం పాన్-ఇండియా విజువల్ వండర్స్‌కు ఆరోజే పునాది వేసిన చిత్రాల్లో ఇది ఒకటి. బాలకృష్ణ నటనా విశ్వరూపం, సింగీతం దర్శకత్వ ప్రతిభ, సురేష్ సంగీతం కలగలసి ఈ చిత్రాన్ని కాలాతీతమైన అమరకావ్యంగా మార్చాయి. ఈ జనరేషన్ ఆడియన్స్ కూడా చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది మూవీ. చూడాలనుకుంటే యూట్యూబ్ లో అందుబాటులో ఉంటుంది.
