Wake up late: లేటుగా పడుకుని.. లేటుగా లేస్తే ఎన్ని రోగాలొస్తాయో తెలుసా..?
Wake up late: తెల్లవార్లూ ఫోన్ లో కాలక్షేపం చేయడం.. ఎప్పుడో మూడు నాలుగు గంటలు పడుకోవడం.. ఉదయం పది లేదా 12 గంటలకు లేచేవారు చాలా మందే ఉన్నారు. కానీ ఈ అలవాటు ఎన్నో ప్రమాదరకమైన రోగాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తొందరగా పడుకుని తొందరగా లేస్తే ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. కానీ నేడు మనలో చాలా మంది పొద్దున్న లేవడమే మర్చిపోయారు. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి. కొంతమంది పనిలో బాగా అలసిపోయి అలాగే పడుకుంటే మరికొంతమంది తెల్లవార్లూ సోషల్ మీడియాలో కాలక్షేపం చేయడం వల్ల లేట్ గా నిద్రలేస్తుంటారు.
కానీ లేట్ గా మేల్కొవడం శరీర పనితీరు సరిగ్గా ఉండదు. ఈ అలవాటు వల్ల శరీరకంగానే కాదు.. మానసికంగా కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల జీవగడియారం పూర్తిగా తారుమారవుతుంది. దీనివల్ల మెదడు పనితీరు మందగిస్తుంది. ఈ అలవాటు వల్ల ఒక్కటేమిటీ ఎన్నో ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేయాల్సి వస్తుంది.
లేట్ గా నిద్రలేవడం వల్ల శరీరం హుషారుగా ఉండదు. మానసికంగా గందరగోళంగా ఉంటుంది. ఆకలిలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి. మొత్తంలో శరీర పనితీరు సక్రమంగా జరగదు. ఇలా నిద్రలేస్తే జీర్ణక్రియ పనితీరు కూడా సక్రమంగా ఉండదు. దీనివల్ల ఎలాంటి రోగాలొస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
డయాబెటీస్: జీవగడియారం గతితప్పితే డయాబెటీస్ బారిన పడే అవకాశం ఉందని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాటు వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరుగుతాయి.
ఒత్తిడి: జీవగడియారంలో విపరీతమైన మార్పులు రావడం వల్ల ఒత్తిడి కూడా దారుణంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అర్థరాత్రి వరకు మేలుకువగా ఉండటం.. పొద్దెక్కిందాక పడుకోవడం వల్ల ఏ పనిచేయాలన్న ఆసక్తి ఉండదు. చేస్తున్న పనిపట్ల ఏకాగ్రత కూడా ఉండదు. మెదడు పనితీరు కూడా మందగిస్తుంది.
జ్ఞాపకశక్తి తగ్గుతుంది: నిద్రవేళలు సరిగ్గా ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా లేట్ గా లేవడం వల్ల మెమోరీ పవర్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. మనం ఆలోచించే విధానం కూడా మారుతుంది. లేట్ గా లేవడం వల్ల పాణం హుషారుగా ఉండదు.
గుండెనొప్పి: కొంతమంది వారం రోజులు నైట్ షిఫ్ట్, మరో వారం రోజులు లేదా నెల రోజులు మార్నింగ్ షిఫ్ట్ లో పనిచేస్తుంటారు. అయితే ఇలా షిఫ్ట్ లను మారేక్రమంలో వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వారు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.