చలికి వణుకు ఎందుకు వస్తుందో తెలుసా?
మరీ ఎక్కువ చలి పెట్టినప్పుడు చిన్న పిల్లలే కాదు పెద్దలు కూడా వణికి పోతుంటారు. అసలు వణుకు ఎందుకొస్తుంది? దీనివల్ల మన శరీరంలో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
Shivering
చలి ఎక్కువ పెట్టినప్పుడు మన శరీరం తట్టుకోలేక వణికిపోతుంది. ఇది అందరికీ తెలిసిన ముచ్చటే. కానీ ఇలా చలి పెట్టినప్పుడు శరీరం ఎందుకు వణుకుతుంది? అని ఎప్పుడైనా ఆలోచించారా? చలికాలంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సర్వసాధారణ విషయం ఇది. అయితే దీని వెనకున్న శాస్త్రీయ కారణం వింటే మీరు ఆశ్చర్యపోతారు.
నిజానికి మన ఆరోగ్యం బాగాలేనప్పుడు లేదా చల్లని వాతావరణంలో ఉన్నప్పుడు మన శరీరం అంతర్గత ఉష్ణోగ్రతను నిర్వహించడానికి బాగా కష్టపడుతుంది. అయితే మన శరీరం ఒక నిర్ధిష్ట ఉష్ణోగ్రత వద్ద సక్రమంగా పనిచేస్తుంది. అదే ఉష్ణోగ్రత తగ్గడం మొదలైతే మాత్రం మన శరీరం దానిని పెంచడానికి ఎంతో కష్టపడుతుంది. ఎన్నో మార్గాలను వెతుక్కుంటుంది. దీనిలో ఒకటే వణుకు.
వణుకు ఎందుకు వస్తుంది?
వణుకు అనేది ఆటోమెటిక్ ప్రతిస్పందన. అంటే మన శరీరం చల్లగా అనిపించినప్పుడు, కండరాలు సంకోచించడానికి, ఫాస్ట్ గా సాగదీయడానికి మన మెదడుకు ఒక సందేశం వెళుతుంది. ఈ వేగవంతమైన సంకోచమే వణుకుగా మనం అనుభూతి చెందుతాం.
మీకు తెలుసా? మన శరీరం ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్దే సరిగ్గా పనిచేస్తుంది. అంటే మన శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ లేదా 98.6 డిగ్రీల ఫారెన్ హీట్ ఉంటుంది. అయితే బయట వేడిగా ఉన్నా, చల్లగా ఉన్నా ఈ ఉష్ణోగ్రతను మెయింటైన్ చేయడానికి మన శరీరం ఎన్నో విధాలా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అయితే మన శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉంటే మాత్రం మనకు జ్వరం వస్తుంది. అంటే మన శరీరంలో ఒక వ్యాధితో పోరాడుతున్నట్టే.
వణుకు వేడిని ఎలా ఉత్పత్తి చేస్తుంది?
కండరాల కార్యకలాపాలు: చలికి మన కండరాలు సంకోచిస్తాయి. అలాగే వేగంగా విస్తరిస్తాయి. ఇదొక శారీరక శ్రమ వంటిదే. కాబట్టి ఈ ప్రాసెస్ వల్ల మన శరీర శక్తి వినియోగించబడుతుంది. ఇది మన శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఈ వేడి వల్ల మన శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది.
రక్తప్రసరణ పెరుగుతుంది: మనం వణుకుతున్నప్పుడు మన శరీరంలో రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది. మన శరీరంలో రక్తం ఫాస్ట్ గా వివిధ భాగాలకు చేరుతుంది. దీంతో మనకు వెచ్చగా అనిపిస్తుంది.
శక్తి వినియోగం: మీకు తెలుసా? మనం వణుకుతున్నప్పుడు మన శరీరం శక్తిని ఎక్కువగా ఉపయోగిస్తుంది. అంటే దీనివల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడం మొదలవుతుంది. ఈ కొవ్వు కరగడం వల్ల మనకు శక్తి లభిస్తుంది.
శరీర రక్షణ విధానం
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. వణుకును మనం ఒక రక్షణ యంత్రాంగంగా కూడా భావించొచ్చు. ఎందుకంటే చలి నుంచి మన శరీరాన్ని రక్షించడానికి ఇదొక సహజ మార్గంలా ఉపయోగపడుతుంది. మనం చల్లని వెదర్ లో ఉన్నప్పుడు మనకు ఏమీ కాకుండా శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి వణుకు మనకు సహాయపడుతుంది. అలాగే అల్పోష్ణస్థితి బారిన పడకుండా కాపాడుతుంది. అల్పోష్ణస్థితి అనేది శరీర ఉష్ణోగ్రతలు బాగా పడిపోవడం. ఇది ప్రాణాంతకం.
వణుకుకు ఎప్పుడు భయపడాలి?
వణుకు అనేది ఒక సాధారణ ప్రక్రియే. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం మనం దీన్ని లైట్ తీసుకోకూడదు. ఎందుకంటే ఇది ప్రమాదకరమైన అనారోగ్యానికి సంకేతం కూడా కావొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణఉలు. మీరు ఎప్పుడూ వణుకుతుంటే, జ్వరం, చలి లేదా ఇతర లక్షణాలు కూడా అనిపిస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి.