Oldest Sweet:మన దేశంలో అత్యంత పాత స్వీట్ ఏదో తెలుసా? ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్..!
Oldest Sweet:మన దేశంలో చాలా రకాల స్వీట్స్ ఉన్నాయి. కానీ, వాటన్నింటిలో.. అత్యంత పురాతన స్వీట్ ఏదో తెలుసా? అంటే.. మొదటిసారి చేసిన స్వీట్ ఇదేనా? దీనిని మొదట ఎవరు తయారు చేశారు?దీని వెనక కథేంటి?

మొదటి స్వీట్... లడ్డూ అయితే కాదు..
మన దేశం ఎక్కువ మంది స్వీట్ లవర్స్ ఉంటారు. రెగ్యులర్ గా స్వీట్స్ తినేవారు కూడా ఉంటారు. అంతేకాదు, మన సంప్రదాయంలో స్వీట్ కి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఏ పండగ వచ్చినా, ఏ శుభకార్యం అయినా.. కచ్చితంగా స్వీట్ ఉండాల్సిందే. అంతెందుకు ఎవరితో అయినా శుభవార్త పంచుకోవాలన్నా నోరు తీపి చేసి చెబుతూ ఉంటాం. మన రోజువారీ జీవితంలో పూర్తిగా భాగమైన ఈ స్వీట్ కథ ఎలా మొదలైందో తెలుసా? అసలు.. మొట్టమొదటి స్వీట్ ఏంటి? దీని వెనక కథ ఏంటి?
మన దేశంలో అత్యంత పురాతన స్వీట్ ఇదే..
చాలా పరిశోధనల్లో తేలిన ప్రకారం.. మన దేశపు అత్యంత పురాతన స్వీట్ మాల్ పువా. దీని మూలాలు 3వేల సంవత్సరాలకు పైగా ప్రాచీనకాలం నుంచే ఉన్నాయి. బుగ్వేదంలో దీనిని అపూప అని పిలిచేవారు. దీనిని బార్లీ పిండి తో తయారు చేసి, నెయ్యిలో వేయించి, తేనెలో నానపెట్టేవారు. ఇది చాలా రుచిగా ఉండేది. ఆరోగ్యానికి కూడా మేలు చేసేది, ఎక్కువ పోషకాలతో కూడా ఉండేది. ఆ తర్వాతర్వాత ఈ వంటకంలో మార్పులు వచ్చాయి. దానిలో కోవా చేర్చడం మొదలుపెట్టారు. బార్లీ పిండికి బదులు మైదా, గోధుమ పిండి వాడటం మొదలుపెట్టారు. తేనెకి బదులుగా పంచదార పాకం వాడుతున్నారు.
ఈ స్వీట్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే.. ప్రాచీన కాలం నాటి అనేక వంటకాలు కాలక్రమేణా కనుమరుగైనప్పటికీ, మాల్ పువా మాత్రం నిరంతం మార్పులు చెందుతూ.. నేటికీ.. చాలా మంది ఫేవరేట్ స్వీట్ గా మారింది.
వేద గ్రంథాలలో ఈ స్వీట్ గురించి ఏముంది..?
ప్రాచీన భారతదేశంలో ఆహారానికి, ఆధ్యాత్మికతకు ముడిపడి ఉండేది. అప్పట్లో ఈ స్వీట్ ని దేవుడికి నైవేద్యంగా కూడా సమర్పించేవారు. ఆ రోజుల్లో బార్లీ మాత్రమే ప్రధాన ధాన్యంగా ఉండేది. అందుకే, దానితోనే తయారుచేసే వారు. శతాబ్దాలు గడిచేకొద్దీ ఇది పూజల పరిధి దాటి రోజువారీ ఆహార సంస్కృతిలో భాగమైంది. ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలో 'అమాలు' (Amalu) పేరుతో మాల్పువాను నేటికీ ప్రతిరోజూ స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు.
మాల్పువా ఇన్ని వేల సంవత్సరాలు మనుగడ సాగించడానికి ముఖ్య కారణం ఏ ప్రాంతానికి తగినట్లుగా ఆ ప్రాంతంలో మారడమే.
బెంగాల్: బెంగాల్లో 'పువా' అని పిలిచే ఈ వంటకంలో సొంపు లేదా కొబ్బరి తురుము కలిపి తయారు చేస్తారు.
బీహార్: బీహార్లో మాల్పువా పిండిలో అరటిపండ్లను కలిపి మెత్తగా తయారుచేస్తారు.
రాజస్థాన్ , ఉత్తర భారతదేశం: ఇక్కడ మాల్పువాను గడ్డ పెరుగు లేదా చిక్కటి రబ్రీ తో జతచేసి పండుగల వేళ ప్రత్యేకంగా ఆస్వాదిస్తారు.
ఒడిశా: ఆలయ శైలిలో తేలికపాటి, పతలాటి మాల్పువాలను రోజువారీ నైవేద్యాల కోసం తయారుచేస్తారు.
అత్యంత పాత స్వీట్ ఇదే.. మన దేశంలో ప్రాచుర్యం పొందిన అనేక ఇతర తీపి పదార్థాల కంటే మాల్పువా చాలా పురాతనమైనది. జిలేబీ, గులాబ్ జామూన్, బర్ఫీ వంటి ప్రముఖ మిఠాయిలు పంచదార తయారీ పెరిగిన తర్వాత చాలా కాలానికి వచ్చాయి. కానీ మాల్పువా మాత్రం పంచదార అందుబాటులో లేని, తేనె మాత్రమే ఉన్న కాలం నాటి నుంచే అందుబాటులో ఉంది.













