Chicken Pickle: ఆంధ్ర స్టైల్ చికెన్ పికెల్ ఇలా చేశారంటే మూడు నెలల తాజాగా ఉంటుంది
Chicken Pickle: చికెన్ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఆంధ్ర స్టైల్లో కారంగా ఉండే మసాలాలు, నువ్వుల నూనెతో రుచికరమైన చికెన్ పచ్చడి ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి. ఇది మూడు నెలలు తాజాగా ఉంటుంది.

చికెన్ పచ్చడి రెసిపీ
చికెన్ తో కూడా అద్భుతమైన పచ్చడి తయారు చేయవచ్చు. అదీ ఆంధ్ర స్టైల్లో కారంగా ఉండే మసాలాలు, సువాసన వచ్చే నువ్వుల నూనె, వేయించి పొడి చేసిన మసాలా అన్నీ కలిపి చేసే ఈ చికెన్ పచ్చడి రుచి అదుర్స్. అన్నం, పెరుగన్నం, చపాతీ, దోశ దేనితో తిన్నా దీని రుచి అమోఘం. ఎప్పుడూ చికెన్ పులుసు, చికెన్ వేపుడు తిని బోర్ కొట్టిందా? అయితే ఒకసారి ఈ ఆంధ్ర స్పెషల్ చికెన్ పచ్చడిని ఇంట్లోనే ట్రై చేయండి. కారం ఇష్టపడేవారికి ఇది కచ్చితంగా నచ్చుతుంది.
ఆంధ్ర స్పెషల్ చికెన్ పచ్చడి కావాల్సిన పదార్థాలు
చికెన్ మ్యారినేషన్ కి:
చికెన్- 500 గ్రాములు
పసుపు - 1/2 టీస్పూన్
కారం - 2 టీస్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - తగినంత
మసాలా పొడి తయారీకి
ధనియాలు -1 టేబుల్ స్పూన్
మెంతులు -1/2 టీస్పూన్
ఆవాలు - 1/2 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
దాల్చిన చెక్క- 3 చిన్న ముక్కలు
లవంగాలు - 4
యాలకులు - 2
శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
తాలింపు, వేయించడానికి
నువ్వుల నూనె - తగినంత
చికెన్ పచ్చడి తయారీ విధానం
- ముందుగా బోన్ లెస్ చికెన్ ని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. అందులో పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని సుమారు 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
2. పొయ్యి మీద ఒక పాన్ పెట్టి ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, శనగపప్పు వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత వీటిని బాగా చల్లారనిచ్చి మిక్సీలో వేసి బరకగా పొడి చేసుకోవాలి.
3. ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం ఎక్కువ నువ్వుల నూనె పోసి వేడి చేయాలి. అందులో ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. చికెన్ ముక్కలు బాగా ఉడికి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం మంట మీద వేయించాలి.
4. చికెన్ బాగా ఉడికిన తర్వాత తయారుచేసి పెట్టుకున్న మసాలా పొడి వేసి కలపాలి. మసాలా చికెన్ ముక్కలన్నింటికీ పట్టేలా బాగా మిక్స్ చేయాలి.
5. మసాలా చికెన్ తో బాగా కలిసి నూనె పైకి తేలే వరకు మీడియం మంట మీద ఉడికించాలి. చికెన్ పూర్తిగా ఉడికి, మసాలా బాగా పట్టి పచ్చడి కన్సిస్టెన్సీకి రాగానే స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే.. ఎంతో రుచికరమైన ఆంధ్ర స్పెషల్ చికెన్ పచ్చడి రెడీ.













