Tulsi Vivah 2025: తులసి వివాహం ఎప్పుడు? ఎలాంటి నియమాలు పాటించాలి?
Tulsi Vivah 2025: తులసి వివాహం ఈ ఏడాది నవంబర్ 2న నిర్వహించుకోబోతున్నాం. ఆ రోజున తులసమ్మకు, శాలిగ్రామ రూపంలో ఉన్న విష్ణువుకి వివాహం చేస్తారు. తులసి వివాహం రోజు ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకోండి.

తులసి వివాహం ఎప్పుడు?
హిందూ ధర్మంలో తులసి వివాహానికి ఎంతో విశిష్టత ఉంది. ప్రతి ఏడాది కార్తీక మాసం శుక్ల పక్ష ద్వాదశి తిథి నాడు తులసి వివాహాన్ని నిర్వహించుకుంటారు. ఈ రోజున తులసి మాతకు శాలిగ్రామ రూపంలో ఉన్న విష్ణువుతో వివాహం జరిపిస్తారు. తులసి వివాహంతో చాతుర్మాసం ముగుస్తుంది. దీని తర్వాత శుభాకార్యాలు ప్రారంభమవుతాయి.
తులసి మాతకు అలంకరణ
తులసి వివాహం రోజున తులసి మాతను ప్రత్యేకంగా అలంకరించాలి. ఇలా అలంకరించడం వల్ల ఆమె ఎంతో సంతోషిస్తుంది. తన ఆశీర్వాదాలు అందిస్తుంది. మీ ఇంట్లో సుఖ సంపదలను అందిస్తుందని ఎంతో మంది నమ్మకం. తులసి మాత ఆశీర్వాదం పొందాలంటే తులసి వివాహం రోజూ ఆమెను అలంకరించడం మర్చిపోవద్దు.
తులసి వివాహం శుభ ముహూర్తం ఎప్పుడు?
మన వేద పంచాంగం ప్రకారం కార్తీక మాసం శుక్ల పక్ష ద్వాదశి తిథి నవంబర్ 2న ఉదయం 7:31 గంటలకు ఆరంభమవుతుంది. ఈ తిథి నవంబర్ 3న ఉదయం 5:07 గంటలకు ముగుస్తుంది. అందుకే ఈ సంవత్సరం తులసి వివాహం నవంబర్ 2న నిర్వహించుకోవాలి.
తులసి మాతను ఎలా అలంకరించాలి
తులసి మొక్కను అందంగా అలంకరించాలి. ఇందుకోసం మొక్క ముందు ముగ్గులు వేయాలి. తులసి మొక్కపై చిన్న మండపంలా కట్టాలి. అరటి కాండాలు, మామిడి ఆకులతో మండపాన్ని అలంకరించాలి. తులసి మొక్క పక్కన శాలిగ్రామాన్ని ప్రతిష్టించాలి. గంగాజలంతో తులసి మొక్కను, శాలిగ్రామాన్ని శుభ్రం చేయాలి. తులసి మొక్కకు పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టి అలంకరించాలి. హిందూ వివాహంలాగే ఈ పెళ్లిని పూర్తిచేయాలి. చెరకు ముక్కలు, బియ్యం, పప్పులు, పాయసం వంటివి ప్రసాదంగా నివేదించాలి.ఈ పూజను ఇంట్లోని మహిళలు స్వయంగా చేసుకోవచ్చు.
తులసి వివాహం విశిష్టత
ఇంట్లో తులసి వివాహం చేయడం వల్ల సుఖం, శ్రేయస్సు, అదృష్టం దక్కుతుందని అంటారు. ఇంట్లో తులసి వివాహం జరిపించే వారికి విష్ణువు, లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. ఈ రోజున ఉపవాసం ఉండే యువతులకు మంచి భర్త లభిస్తాడని నమ్మకం. వివాహిత జంటలు ఈ రోజున ఉపవాసం ఉంటే వారి జీవితంలో సంతోషం, అన్యోన్యత వెల్లివిరుస్తుంది.