- Home
- Life
- Dev uthani ekadashi 2025: దేవుత్తని ఏకాదశి ఎంత విశిష్టమైనదో తెలుసా? ఈ ఏకాదశి నవంబర్ 1న లేక 2న?
Dev uthani ekadashi 2025: దేవుత్తని ఏకాదశి ఎంత విశిష్టమైనదో తెలుసా? ఈ ఏకాదశి నవంబర్ 1న లేక 2న?
Dev uthani ekadashi 2025: ఏకాదశి తిధి ఎంతో ఉత్తమమైనది. భారతదేశంలో ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే దేవుత్తని ఏకాదశికి ఇంకెంతో విశిష్టత ఉంది. ఈ ఏకాదశి నవంబర్ 1న లేక 2న? ఎప్పుడు నిర్వహించుకోవాలి?

దేవుత్తని ఏకాదశి అంటే?
దేవుత్తని ఏకాదశి వచ్చేస్తోంది. నాలుగు నెలల యోగ నిద్ర తర్వాత ఆ శ్రీమహావిష్ణువు మేలుకొంటాడు. ఆ రోజునే మనం దేవుత్తని ఏకాదశి చేసుకుంటాము. దేవుత్తని ఏకాదశి అంటే శ్రీహరి మేల్కొనే రోజు. ఈ ఏడాది జూలై 6న దేవశయని ఏకాదశి నాడు విష్ణువు యోగనిద్రలోకి జారుకున్నాడు. ఈ దేవుత్తని ఏకాదశి రోజు ఆయన మేల్కొంటాడు. ప్రతి ఏడాది కార్తీక శుక్లపక్ష ఏకాదశి నాడు ఈ పండుగను నిర్వహించుకుంటాము.
విష్ణువును మేల్కొలిపి
దేవుత్తని ఏకాదశి కోసం భక్తులంతా ఎంతో ఎదురు చూస్తారు. ఆ రోజు శ్రీమహావిష్ణువును మేల్కొలిపి అతడిని మనస్ఫూర్తిగా పూజిస్తారు.. ఇంటి ముందు ముగ్గులు వేసి ఆ కాలానికి తగ్గ పండ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. తమ పాటలతో ఆయనను మేల్కొలుపుతారు. ఈసారి ప్రదోషకాలం ఏకాదశితో కలిసి రావడంతో తులసి వివాహం కూడా ఆ రోజే నిర్వహిస్తారు.
దేవుత్తని ఏకాదశి ఎప్పుడు?
జ్యోతిష్యులు చెబుతున్న ప్రకారం కార్తీక శుక్లపక్షం ఏకాదశి తిధి అక్టోబర్ 31వ తేదీ శుక్రవారం సాయంత్రం 4:02 నిమిషాలకు ప్రారంభమవుతుంది. నవంబర్ ఒకటవ తేదీ శనివారం తెల్లవారుజామున 2:57 గంటల వరకు ఉంటుంది. కాబట్టి ఉదయ కాలంలోనే ఏకాదశి తేదీ నవంబర్ ఒకటవ తేదీన వస్తుంది.. కాబట్టి ఆ రోజునే దేవుత్తని ఏకాదశిని నిర్వహించుకోవాలి.
మళ్లీ శుభకార్యాలు మొదలు
విష్ణు యోగ నిద్రలోకి వెళ్లినప్పుడు శుభకార్యాలు చేయడం ఆగిపోతుంది. దేవుత్తని ఏకాదశి రోజు విష్ణువు మేలుకొంటాడు. మళ్లీ శుభకార్యాలు మొదలవుతాయి. వివాహానికి ముహూర్తాలు కూడా ప్రారంభమవుతాయి. ఈ ఏడాది నవంబర్లో వివాహ ముహూర్తాలు 15 రోజులు వరకు ఉన్నాయి. అలాగే డిసెంబర్ 16 వరకు మంచి ముహూర్తాలు ఉంటాయి. అప్పటినుంచి ధనుర్మాసం ప్రారంభమైపోతుంది. కాబట్టి శుభకార్యాలకు మధ్యలో బ్రేక్ పడుతుంది.
తులసి వివాహం ఎప్పుడు?
దేవుత్తని ఏకాదశి రోజు ఆ శ్రీమహావిష్ణువుని పూజించడం వల్ల చేసిన పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ఇక దేవుత్తని ఏకాదశి మరుసటిరోజే క్షీరాబ్ది ద్వాదశి వస్తుంది. కొంతమంది ఏకాదశి రోజే తులసి వివాహాన్ని నిర్వహిస్తారు. మరికొందరు ఈ ద్వాదశి రోజు తులసి వివాహాన్ని చేస్తారు. తులసి వివాహం చేయడం వల్ల భార్యాభర్తల జీవితంలో సంతోషం, సౌభాగ్యం ఉంటుందని నమ్ముతారు. దేవుత్తని ఏకాదశి రోజు ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును పూజిస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి. నవంబర్ 1 న ఉపవాసం మొదలైతే తిరిగి ఉపవాస విరమణ నవంబర్ రెండవ తేదీన చేయాలి.