Ghee: వనస్పతిని దేనితో తయారు చేస్తారు..? నెయ్యికీ, వనస్పతికీ ఉన్న తేడా ఏంటి..?
Ghee: ఒకప్పుడు చాలా రకాల వంటకాల్లో వనస్పతి వాడేవారు. కానీ, ఈ వనస్పతి ఎందుకు తినకూడదు..? అసలు, దీనిని దేనితో తయారు చేస్తారు? ఇప్పుడు దీనిని వంటల్లో ఎందుకు వాడట్లేదు..?

వనస్పతి తింటున్నారా?
ఒకప్పుడు పెళ్లిళ్లు, పేరంటాల్లోనూ, బేకరీ వంటకాల్లోనూ, పరోటా చేస్తున్నప్పుడు గుమగుమలాడే వాసన వచ్చేది. వీటన్నింటి తయారీలోనూ వనస్పతి వాడేవారు. నెయ్యి కొనే స్థోమత లేని పేద, మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరలోనే నెయ్యి రుచిని, సువాసనను అందించే ప్రత్యామ్నాయంగా... మార్కెట్లో వనస్పతి లభించేది. దీనితో చేసిన వంట చాలా సువాసనతోనూ, కమ్మగానూ ఉండేది. చాలా మంది దీనిని రెగ్యులర్ గా వాడేవారు. కానీ, వనస్పతి వాడకం ఆరోగ్యానికి మంచిది కాదని తర్వాతర్వాత తెలిసొచ్చింది. దీంతో, దీని వాడకం కూడా తగ్గిపోయింది. అసలు, వనస్పతి తినొద్దని డాక్టర్లు ఎందుకు చెబుతున్నారు? అసలు.. దీనిని ఎలా తయారు చేస్తారు? దీనిని తినడం వల్ల కలిగే నష్టాలు ఏంటి?
వనస్పతి ని దేనితో తయారు చేస్తారు..?
వనస్పతి చూడటానికి నెయ్యిలా కనిపించినప్పటికీ, ఇది పాల నుంచి తయారయ్యే నెయ్యి కాదు. ఇది ప్రధానంగా కూరగాయల నూనెలతో తయారయ్యే ఒక రకమైన వనస్పతి కొవ్వు. దీనిని తయారు చేయడానికి పామాయిల్, సోయాబీన్, పొద్దుతిరుగుడు వంటి తినదగిన నూనెలను ఉపయోగించవచ్చు. ఈ నూనెలకు హైడ్రోజనేషన్ అనే ప్రక్రియ ద్వారా హైడ్రోజన్‌ను జోడిస్తారు. ఈ ప్రక్రియలో నికెల్ వంటి ఉత్ప్రేరకాన్ని ఉపయోగించడం వల్ల నూనెల భౌతిక లక్షణాలు మారి, అవి చిక్కటి లేదా సెమీ-సాలిడ్ రూపంలోకి మారవచ్చు. ఈ మార్పుల వల్ల వనస్పతి ఆకృతి నెయ్యిని పోలి ఉంటుంది. అయితే, దాని రంగు, వాసన తయారీ విధానం, ఉపయోగించే పదార్థాలపై ఆధారపడి ఉంటాయి.
వనస్పతి తినడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు..
వనస్పతిలో పాక్షిక హైడ్రోజనేషన్ ద్వారా తయారైన ఉత్పత్తుల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ (LDL) పెరిగి, మంచి కొలెస్ట్రాల్ (HDL) తగ్గడంతో పాటు గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. ICMR–National Institute of Nutrition కూడా వనస్పతిలోని ట్రాన్స్ ఫ్యాట్స్ గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయని పేర్కొంది. అలాగే, వంట నూనెలను పదేపదే వేడి చేయడం వల్ల హానికర సమ్మేళనాలు ఏర్పడవచ్చని హెచ్చరించింది. అందువల్ల వనస్పతి వినియోగాన్ని పరిమితం చేసి, పదేపదే వేడి చేసిన నూనెలను తిరిగి ఉపయోగించకుండా ఉండటం మంచిది









