రాత్రిపూట ఏ టైంకి తింటే మంచిదో తెలుసా?
మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. అయితే కేవలం హెల్తీ ఫుడ్ ను తింటేనే సరిపోదు. సమయానికి తింటేనే ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రిపూట.
మన తాతలు, ముత్తాతలు 90 నుంచి 100 ఏండ్ల వరకు కూడా ఎలాంటి రోగాలు, నొప్పులు లేకుండా ఆరోగ్యంగా జీవించారన్న మాటను వినే ఉంటారు. కానీ ఇప్పుడు 20,30 ఏండ్లకే కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, డయాబెటీస్, గుండె జబ్బులు అంటూ లేనిపోని రోగాల బారిన పడుతున్నాం. మరి అప్పుడు ఎంత వయసొచ్చినా ఆరోగ్యంగా ఉండటానికి కారణమేంటని ఎప్పుడైనా ఆలోచించారా? దీనిలో పెద్ద సీక్రేట్ ఏమీ లేదు. అప్పట్లో శారీరక శ్రమ బాగా చేస్తూ.. కెమికల్స్ లేని ఫుడ్ ను తినే వారు. అలాగే సమయానికి తినేవారు. ఇదే వారి ఆరోగ్య రహస్యమంటారు ఆరోగ్య నిపుణులు.
90 ఏండ్ల వయసులో కూడా ఆరోగ్యంగా ఉండటానికి వారు అనుసరించిన ఆహారపు అలవాట్లే ప్రధాన కారణం. మీకు తెలుసా? తినాల్సిన సమయానికి తినకపోతే కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా రాత్రిల్లు హోటళ్లలో తినే అలవాటు బాగా పెరిగింది. దీంతో రాత్రిపూట ఎప్పుడంటే అప్పుడు తింటుంటున్నారు. ఒక సమయమంటూ పాటించడం లేదు. కానీ రాత్రిపూట సమయానికి తినకపోవడం వల్లే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. అందుకే రాత్రిపూట ఏ సమయానికి తింటే హెల్తీగా ఉంటామో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
రాత్రిపూట ఎప్పుడు తినాలి?
మీరు బతికి ఉన్నన్ని రోజులు ఎలాంటి జబ్బులు లేకుండా ఆరోగ్యంగా జీవించాలంటే మాత్రం ప్రతిరోజూ రాత్రిపూట మీరు నిద్రపోవడానికి 2 నుంచి 3 గంటల ముందే తినాలి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య భోజనం చేస్తే మీ ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు.
ఇకపోతే చాలా మందికి రాత్రిపూట పాలు తాగే అలవాటు కూడా ఉంటుంది. అయితే మీరు నిద్రపోయే ముందే కాకుండా నిద్రపోవడానికి గంట ముందే పాలను తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అయితే అందరికీ రాత్రిపూట ఒకే సమయానికి పనులు పూర్తి అవవు. రాత్రి పదైనా ఆఫీసులో పనిచేసే వారు చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారికి పని మధ్యలో ఆకలి ఖచ్చితంగా అవుతుంది. కానీ ఈ సమయంలో మీరు హెవీగా అస్సలు తినకూడదు. లేదంటే మీరు బరువు పెరగడంతో రకరకాల సమస్యలు వస్తాయి. అందుకే నైట్ షిఫ్ట్ లో పనిచేసేటప్పుడు ఆకలిగా అనిపిస్తే హెల్తీ స్నాక్స్ ను కొన్ని కొన్ని తినండి.
dinner
ఒకవేళ మీరు బరువు తగ్గాలనుకుంటే మాత్రం రాత్రిపూట 7 గంటల్లోపే భోజనం చేసేయాలి. అప్పుడే మీ జీవక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. అలాగే శరీరంలో కొవ్వు పేరుకుపోదు. అయితే మీ భోజనంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండకూడదు. అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రాత్రిళ్లు చపాతీ, జొన్న రొట్టె తినడం మంచిది. ఇకపోతే రాత్రిపూట తినేటప్పుడు ఫోన్, టీవీ లాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను చూడకపోవడమే మంచిది. ఎందుకంటే వీటిని చూస్తూ మీరు ఎక్కువగా తినే అవకాశం ఉంది. దీంతో మీకు జీర్ణం సరిగ్గా కాదు.
రాత్రిపూట లేట్ గా తినడం వల్ల వచ్చే సమస్యలు
రాత్రిపూట మీరు సమయానికి భోజనం చేసేస్తే బాగా నిద్రపడుతుంది. అయితే మీరు సమయానికి తినకపోతే మాత్రం తిన్నది అరగక అంటే జీర్ణక్రియ సక్రమంగా జరగక నిద్రకూడా పట్టదు. దీనివల్ల మీకు నిద్రలేమి, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. అజీర్ణం వల్ల మీరు తిన్న ఆహారం నుంచి మీ శరీరానికి పోషకాలేమీ అందవు. ఇకపోతే ఎప్పుడైనా సరే తిన్న వెంటనే అస్సలు పడుకోకూడదు. ఇది మీ శరీరానికి మంచిది కాదు.