సెకండ్ హ్యాండ్ బైక్ కొనే ముందు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సి విషయాలివి.. !
పాత బైక్ లను కొనడానికి చాలా రీజన్స్ ఉంటాయి. వీటిని పక్కన పెడితే పాత బైక్ లను కొనేటప్పుడు మీరు కొన్ని విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. లేదంటే మీరు మోసపోయే ప్రమాదం ఉంది.
డబ్బులు లేకనో, పురాతన బైక్ లంటే ప్రేమతోనే చాలా మంది సెకండ్ హ్యాండ్ బైక్ ను కొంటుంటారు. కానీ పాత బైక్ లను కొనేముందు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు నెల రెండు నెలలు వాడిన తర్వాత బైక్ లు పూర్తిగా పాడవుతుంటాయి. దీనివల్ల ఈ బైక్ ను అనవసరంగా కొన్నానే అని ఫీలవుతుంటారు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మీరు వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్, ఛాసిస్ నెంబర్, ఇంజిన్ నెంబర్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. అసలు మీరు పాత బైక్ ను కొనడానికి ముందు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చాలా మంది పాతబైక్ లను కొన్ని తర్వాత చెడిపోయిందని చెప్తుంటారు. అందుకే సాధారణంగా బైక్ కొనడానికి ముందు వాటిని క్షుణ్ణంగా పరిశీలించి దాని కండిషన్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు కొనే బైక్ ఇంజిన్, గేర్లు, బ్రేకులు, టైర్లు, ఇతర భాగాలన్నింటినీ జాగ్రత్తగా చెక్ చేయాలి. అలాగే బైక్ ను ఖచ్చితంగా నడపాలి. అది ఎలా నడుస్తుందో తెలుసుకోవాలి. ముఖ్యంగా బైక్ ను మంచి మెకానిక్ తో చెక్ చేయించాలి.
పాత బైక్ ను కొనేముందు దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ పేపర్స్, బైక్ రిజిస్ట్రేషన్ పేపర్ (ఆర్సీ), ఇతర డాక్యుమెంట్లను చెక్ చేయాలి. అన్ని పేపర్లు చెల్లుబాటు అవుతాయో, లేదో చూసుకోవాలి. అయితే చాలా మంది కారును కొనేముందు అన్ని సక్రమంగా ఉన్నాయో లేదో చెక్ చేస్తారు. బైక్ ను కొనేముందు కూడా ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.
పీడీఐ చెక్ చేయండి
పీడీఐ అంటే ప్రీ-డెలివరీ ఇన్ స్పెక్షన్. మీరు కొనే బైక్ మంచి కండిషన్ లో ఉందని, అందులో ఎలాంటి లోపం లేదని నిర్ణయించుకునే ముఖ్యమైన ప్రక్రియ ఇది. బైక్ కంపెనీ స్వయంగా అనేక పారా మీటర్లపై చెక్ మార్క్ లను పెడుతుంది. పీడీఐ సాధారణంగా కొత్త బైక్ కొనేటప్పుడు కంపెనీ చేస్తుంది. కానీ పాత బైక్ కొనేటప్పుడు మీరే చేయాలి.
ఛాసిస్ నంబర్లు
బైక్ కు ఛాసిస్ నంబర్ ప్రత్యేకమైన గుర్తింపు. ఇది 17 అంకెల సంఖ్య. అంటే ఇది తయారీదారు, మోడల్, సంవత్సరం, వీఐఎన్ వంటి బైక్ గురించి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తుంది. అందుకే మీరు పాత బైక్ ను కొనేటప్పుడు ఛాసిస్ నంబర్ లేదా ఫ్రేమ్ నంబర్ ను ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. బైక్ డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్ కార్డుపై రాసిన ఛాసిస్ నంబర్ మీకు కనిపిస్తుంది. ఇవన్నీ మీరు చెక్ చేసుకుని బైక్ ను కొనడమే మేలు. లేదంటే మీరు మోసపోయే ప్రమాదం ఉంది.