ఎలాంటి వాటర్ హీటర్ ను కొనాలో తెలుసా?
వానాకాలం, చలికాలంలో చల్లనీళ్లతో స్నానం చేయడం చాలా కష్టం. అందుకే ఈ సీజన్లలో వాటర్ హీటర్లను చాలా మంది కొంటుంటారు. కానీ ఎలాంటి వాటర్ హీటర్ ను వాడాలో తెలుసా?
చలికాలంలో వేడి నీళ్లు లేనిదే స్నానం చేయాలనిపించదు. ఎందుకంటే ఈ చల్లని గాలులకు నీళ్లు ఐస్ లా అయిపోతాయి. ఇక నీళ్లను వేడి చేయాలంటే ఇంట్లో గీజర్ అన్నా ఉండాలి. లేదంటే వాటర్ హీటర్ అన్నా ఉండాలి. గ్యాస్ మీద వేడి చేస్తే గ్యాస్ తొందరగా అయిపోతుంది. అందుకే చాలా మంది వాటర్ హీటర్ నే ఎక్కువగా వాడుతుంటారు. ఈ వాటర్ హీటర్లు నీళ్లను తొందరగా వేడి చేస్తాయి. కానీ వాటర్ హీటర్ ను చాలా జాగ్రత్తగా వాడాలి.లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
అయితే ఇప్పుడు మార్కెట్ లో ఎన్నో రకాల వాటర్ హీటర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఆటోమేటిక్ సిస్టమ్ తో వాటర్ హీటర్లు దొరుకుతున్నాయి. అంటే నీళ్లు వేడెక్కిన వెంటనే స్విచ్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేకుండా వాటంతట అవే ఆటోమేటిక్ గా ఆగిపోతున్నాయి. వాటర్ హీటర్ ను ఉపయోగించి నీళ్లను సులువుగా, ఫాస్ట్ గా హీట్ చేయొచ్చు. కానీ వీటిని వాడేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే షాక్ వచ్చే ప్రమాదం ఉంది.
అయితే పాత మోడల్ వాటర్ హీటర్లకు ఇలా ఆటోమేటిక్ ఆఫ్ ఆప్షన్ ఉండదు. కాబట్టి వీటిని వాడేటప్పుడు చుట్టు పక్కలకు ఎవరూ రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా పిల్లల్ని. అలాగే వాటర్ వేడెక్కాయా? లేదా? అని నీళ్లలో చేయి పెట్టే తప్పు చేయకూడదు.
అలాగే పాత మోడల్ వాటర్ హీటర్ ను వాడేటప్పుడు బకెట్ లో నీటి కొలత సరిగ్గా ఉండాలి. కొలతకు మించి మునగకుండా హీటర్ ను చూసుకోవాలి. లేదంటే కరెంట్ షాక్ కొట్టే అవకాశం ఉంది. ఒకవేళ కరెంట్ లీకేజ్ ఉంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
ఎలాంటి వాటర్ హీటర్ ను కొనాలి?
మీరు ఈసీజన్ లో వాటర్ హీటర్ ను కొనాలనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో పాత మోడల్ వాటర్ హీటర్లను కొనకండి. ఇవి ప్రమాదకరం. వీటికంటే కొత్త మోడల్ వాటర్ హీటర్లే చాలా కంఫర్ట్ గా ఉంటాయి. అయితే ఈ కొత్త వాటర్ హీటర్ ను కొనాలనుకుంటే ఐఎస్ఐ మార్క్ ఉన్నదే కొనండి.
అలాగే దానికి ఎన్ని స్టార్ రేటింగ్ ఉందో కూడా చెక్ చేయండి. ఎక్కువ స్టార్ రేటింగ్, ఐఎస్ఐ మార్క్ ఉన్న హీటర్లు చాలా సురక్షితం. తక్కువ ధరకే వస్తున్నాయని పాత మోడల్ వాటర్ హీటర్లను కొనడం మానుకోండి. తక్కువ ధర ఉన్నా వీటి నాణ్యత బాగుండదు. నాణ్యత లేని వాటర్ హీటర్లు వేడిని తట్టుకోలేక పోలిపోయే ప్రమాదం ఉంది.
మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే? ఇంట్లో వాటర్ హీటర్ ను పెట్టించాలనుకుంటే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ప్రమాదాలు జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇకపోతే వాటర్ హీటర్ పవర్ అవుట్ లెట్ ఎప్పుడూ గోడకు తగలకూడదు. ఈ విషయంలో మీరు చాలా కేర్ ఫుల్ గా ఉండాలి.
అలాగే వాటర్ హీటర్ ని బాత్రూమ్ పై భాగంలోనే పెట్టాలి. దీన్ని ఆన్ చేయడానికి వీలైనట్టుగా సాకెట్ ని హీటర్ దగ్గర ఏర్పాటు చేయాలి. ఈ రెండింటినీ ఎత్తుగా పెట్టాలి. స్నానం చేసేటప్పుడు హీటర్ మీద నీళ్లు పడకుండా చూసుకోవాలి. తరచుగా హీటర్ మీద నీళ్లు పడితే హీటర్ పాడయ్యే అవకాశం ఉంది.