Kitchen Hacks: చపాతీలు గుండ్రంగా, సాఫ్ట్ గా రావాలంటే ఈ ట్రిక్స్ ను ఫాలో అవ్వాల్సిందే..!
itchen Hacks: ఈ రోజుల్లో జొన్న రొట్టెలకు బదులుగా గోదుమ చపాతీలనే ఎక్కువగా తింటున్నారు. అయితే ఇవి గుండ్రంగా, మెత్తగా, బాగా ఉబ్బాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ చపాతీలు అలా కానేకావు. కానీ కొన్ని సింపుల్ ట్రిక్స్ ను పాటిస్తే మాత్రం.. అచ్చం టీవీ యాడ్ లో చూపించే విధంగా చపాతీలు రెడీ అవుతాయి.

చపాతీల (Chapati)ను చేయడం చాలా సులువు. కానీ కొందరికీ .. చపాతీలను చేయడానికి తలప్రాణం తోకలోకి వచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే చపాతీలను ఎలా పడితే అలా చేస్తే.. అవి గట్టిగా తయారవుతాయి. వాటిని చూస్తే తినాలన్న కోరిక కాస్త పోతుంది. గుండ్రని చపాతీ (Round chapati) తయారు చేయడం కష్టంగా అనిపించే మహిళలు చాలా మందే ఉన్నారు. కానీ కొంతమంది మహిళలు వంటలో పట్టా పొందిన వారుంటారు. అలాంటి వారు ఫటా ఫట్ మని చిటికెలో.. గుండ్రని.. మెత్త మెత్తని.. చపాతీలను తయారు చేస్తుంటారు.
ఇంకొంతమంది మహిళలు ఏమి చేసినా.. చపాతీలను గుండ్రంగా చేయలేకపోతుంటారు. అంతే కాదు చపాతీ చాలా గట్టిగా లేదా చాలా మృదువుగా ఉంటుంది. ఈ రెండింటినీ తినడం కష్టమే. అదే విధంగా కొందరు మహిళలు చేసే చపాతీలు ఉబ్బవు. అయితే చపాతీలు గుండ్రంగా, స్మూత్ గా రావడానికి కొన్ని ట్రిక్స్ (Tricks)ఉంటాయి. అవి ఫాలో అయిపోతే చాలు.. మీరు కోరుకున్న విధంగా చపాతీలు రెడీ అవుతాయి.
చపాతీలు టీవీలో చూపించిన విధంగా రావాలంటే ముందుగా మీరు పిండిని సరిగ్గా కలపడం నేర్చుకోవాలి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పిండిని సరైన పాత్రలో కలపాలి: పిండిని బాగా కలపాలనుకుకుంటే దానికి సరైన పాత్రను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా పిండిని కలపడానికి చిన్న పాత్రను ఉపయోగించకూడదు. కొంచెం వెడల్పుగా ఉండి, పిండిని బయటకు రానివ్వని పాత్రను ఎంచుకోవాలి. చిన్న పాత్రలో ఎక్కువ పిండిని కలపడానికి రాదు. అంతేకాదు పిండి కూడా కింద పడిపోతూ ఉంటుంది. పిండి ఎక్కువగా ఉన్నప్పుడు దీనిని పెద్ద పాత్రలో కలడమే మంచిది. అప్పుడే పిండి బాగా సాఫ్టగా మారుతుంది.
గోరువెచ్చని నీటిని ఉపయోగించండి: చాలా మంది ఆడవాళ్లు పిండిని కలపడానికి సాధారణ నీటిని ఉపయోగిస్తారు. పిండిని సాధారణ నీటిలో కలిపితే పిండికి సరైన మొత్తంలో నీరు అందక పోవడంతో గట్టిపడుతుంది. దీంతో చపాతీని తయారు చేయడం కష్టమవుతుంది. అది తొందరగా సాగదు. అలాగే పిండిలో నీళ్లను ఎక్కువగా కలుపుకుంటే పిండి మరీ మెత్తగా మారుతుంది. ఈ కారణంగా చపాతీ సరిగ్గా రావు. మూలలు అటూ ఇటూ వెలతాయి. చపాతీలు గుండ్రంగా కూడా రావు. పిండిని కలపడానికి గోరు వెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి. పిండిని గోరు వెచ్చని నీళ్లతో కలిపితే చపాతీలు మెత్తగా వస్తాయి. అలాగే చపాతీ ఉబ్బుతుంది.
పిండి మెత్తగా ఉంటే ఇలా చేయండి: పిండిని కలుపుకునేటప్పుడు మనకు తెలియకుండానే వాటిలో నీళ్లను ఎక్కువగా పోస్తుంటాం. దీంతో పిండి మరింత మెత్తగా అయ్యి.. చేతులకు గిన్నెలకు అత్తుకపోతుంటుంది. దీంతో చాలా మంది దీనిలో కొంచెం పొడి పిండిని వేస్తుంటారు. ఈ కారణంగా పిండి ముద్దగా మారుతుంది. అప్పుడు అందమైన చపాతీ తయారు చేయడం సాధ్యం కాదు. పిండిలో నీటి పరిమాణం ఎక్కువగా ఉంటే దానిలో కొద్దిగా నూనెను వేయండి. ఇలా చేస్తే మీరు తయారుచేసిన చపాతీ మెత్తగా ఉబ్బుతుంది.
సమయం కూడా అవసరమే: తొందర తొందరగా చపాతీ పిండిని కలపకూడదు. దీని కోసం కూడా కాస్త సమయాన్ని కేటాయించాలి. పిండిని మీరు కనీసం 10 నిమిషాలైనా కలపాలి. పిండిని సరిగ్గా కలిపితేనే చపాతీని మీకు కావలసిన ఆకారంలో తయారు చేసుకోవచ్చు. చపాతీ కూడా మెత్తగా ఉంటుంది. పాన్ మీద పెట్టిన వెంటనే ఉబ్బుతుంది.