ఈ ఎల్లో ఫ్రూట్స్ గుండెపోటును రానీయ్యవు..
మన దేశంలో రానురాను హార్ట్ పేషెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతూనే ఉంది. ఆయిలీ ఫుడ్స్ , చెడు జీవన శైలి వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే కొన్ని రకాల పసుపు రంగు ఆహారాలు గుండెపోటును అడ్డుకుంటాయి.

మనిషిని నిండు నూరేళ్లు బతికించేది గుండెనె గుండె కొట్టుకున్నంత వరకే ప్రాణం ఉంటుంది. గుండె ఆగిన మరుక్షణమే మనం చనిపోతాం. అందుకే డాక్టర్లు అంటుంటారు.. శరీర అవయవాల్లో గుండెను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని. గుండె ఆరోగ్యాన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా.. గుండెపోటు, ట్రిపుల్ వెసల్ డిసీజ్, కొరోనరీ ఆర్టరీ డిసీజ్ వంటి ప్రాణాంతక రోగాలు వచ్చే అవకాశం ఉంది.
గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే.. ఆయిలీ ఫుడ్స్ ను తినడం మానేయాలి. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాలి. నిపుణుల అభిప్రాయ ప్రకారం.. గుండెను ఈ ఎల్లో ఆహారాలు ఆరోగ్యంగా ఉంచుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మామిడి పండ్లు
మామిడి పండ్లు ఒక్క వేసవిలోనే అందుబాటులో ఉంటాయి. ఈ పండ్లు రుచిగానే కాదు.. మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. మామిడిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి5, విటమిన్ బి6, విటమిన్ కె, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, ఫోలేట్, రాగి వంటి ముఖ్యమైన పోషకాలుంటాయి. ఇవన్నీ రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటుగా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది.
నిమ్మకాయ
పసుపు రంగులో ఉండే నిమ్మపండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ సిట్రస్ ఫ్రూట్ లో విటమిస్ సి కి కొదవే ఉండదు. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను పోగొడుతుంది. ముఖ్యంగా ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటుగా గుండె పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. ఈ పండు చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా తయారుచేస్తుంది. బరువును తగ్గించడంలో ఈ పండు ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అంతేకాదు ఈ సిట్రస్ ఫ్రూట్ కిడ్నీల్లో రాళ్లను సైతం కరిగించగలదు.
అరటి పండు
అరటిపండంటే ఇష్టపడని వారుండరు. ఈ పండ్లను తిన్నా.. తినకున్నా పక్కాగా అరటిని మాత్రం తింటారు. అందులోనూ అరటిపండ్లు సీజన్లతో సంబంధం లేకుండా చవకైన ధరలకే లభిస్తాయి. కానీ ఈ పండు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ పండును తినడం వల్ల అధిక బరువు తగ్గుతుంది. అలాగే ఒంటికి తక్షణ శక్తి లభిస్తుంది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ముఖ్యంగా ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
పైనాపిల్
పైనాపిల్ పండ్లు వర్షాకాలంలో చాలా విరివిగా లభిస్తాయి. కొంచెం పుల్లగా, తియ్యగా ఉండే ఈ పండులో ఆరోగ్య ప్రయోజనాలెన్నో దాగున్నాయి. దీనిలో విటమిన్ సి, పొటాషియం, సోడియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఎన్నో రకాల రోగాలను తరిమికొడతాయి. ముఖ్యంగా గుండె సంబంధిత రోగాలు, షుగర్ వ్యాధి, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన రోగాలను తగ్గిస్తాయి. ఇవి శరీరానికి హానికలిగించే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కల్పిస్తాయి. ఈ పండు చర్మ నిగారింపునకు కూడా సహాయపడుతుంది. ఈ పండులో ఉండే ఎంజైమ్ జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది.
క్యాప్సికమ్
పసుపు రంగులో ఉండే క్యాప్సికమ్ లో ఫోలేట్, ఫైబర్ కంటెంట్, ఐరన్ వంటి పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. అలాగే ఇది శరీరంలో రక్తం కొరత లేకుండా చూస్తుంది. ముఖ్యంగా దీన్ని తినడం వల్ల గుండె ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంటుంది.