క్యాన్సర్ రావొద్దంటే వీటికి దూరంగా ఉండాల్సిందే..!
పాశ్చాత్య దేశాల్లో.. మొత్తం క్యాన్సర్లలో మూడింట ఒక వంతు ఆహారం వల్లే క్యాన్సర్ బారిన పడుతున్నారని సర్వేలు తేల్చి చెబుతున్నాయి.

ప్రస్తుత కాలంలో క్యాన్సర్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. క్యాన్సర్ కు దారితీసే కారకాలు ఎన్నో ఉన్నాయి. క్యాన్సర్ కేసులలో సగానికి పైగా చెడు జీవనశైలి, వ్యాయామం చేయకపోవడం, ధూమపానం, మద్యపానం, అధిక బరువు మొదలైన వాటి వల్లే సంభవిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
మీకు తెలుసా.. పాశ్చాత్య దేశాలలో మొత్తం క్యాన్సర్లలో మూడింట ఒక వంతు ఆహారంలో లోపం వల్లే సంభవిస్తున్నాయట. ఒక నిర్దిష్ట ఆహారం మాత్రమే క్యాన్సర్ కు కారణం కాదు. అయితే జీవనశైలి క్యాన్సర్ పై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఆరోగ్యకరమైన ఆహారాలను అలవాటు చేసుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పు తప్పే అవకాశం తక్కువగా ఉంది.
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహారాలు క్యాన్సర్ తో పోరాడటానికి సహాయపడతాయి. అలాగే క్యాన్సర్ నివారణకు, చికిత్సకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటుగా మానసిక ఆరోగ్యం బాగుండాలి. క్యాన్సర్ ను నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.
రెడ్ మీట్
రెడ్ మీట్ లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ దీన్ని అతిగా తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే మీరు తినే ఆహారంలో రెడ్ మీట్ తక్కువగా ఉండేట్టు చూసుకోండి. ముఖ్యంగా దీన్ని తరచుగా తినడం ఏ మాత్రం మంచిది కాదు.
బూజు పట్టిన ఆహారాలు
ఎట్టి పరిస్థితిలో పాడైపోయిన లేదా బూజుపట్టిన ఆహారాలను తినకూడదు. చిక్కుళ్లు, తృణధాన్యాల్లో కనిపించే అఫ్లాటాక్సిన్ అనే బూజు సంక్రమణ క్యాన్సర్ కు కారణమవుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
నూనెను పదే పదే వేడి చేసి వాడటం
నూనెను మళ్లీ మళ్లీ వేడి చేసి.. వాడటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇలా వేడి చేసి వాడితే ఆ నూనెలో క్యాన్సర్ ను ప్రేరేపించే రసాయనాలు ఏర్పడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
కృత్రిమ రంగు, వాసన, రుచిని కలిపే ఆహారాలు కానీ, పానీయాలు కానీ, కోలాలను కానీ ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఇవి క్యాన్సర్ కు దారితీస్తాయి.
సాల్టెడ్ ఫుడ్స్
సాల్టెడ్, ఎండిన ఆహార పదార్థాలను మోతాదుకు మించి తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఈ ఆహారాల్లో ఉండే నైట్రేట్ కడుపులోని జీర్ణ రసాలతో ప్రతిస్పందిస్తుంది. నైట్రోసమైన్ అని పిలువబడే క్యాన్సర్-ప్రేరిత పదార్థంగా మారుతుంది. ఈ రసాయనం క్యాన్సర్ కు కారణమవుతుంది.
మధ్యపానం
మితిమీరి మధ్యపానం తాగడం వల్ల కూడా క్యాన్సర్ బారిన పడొచ్చు. ఆల్కహాల్ తాగే వారు స్మోకింగ్ చేస్తే గొంతు క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. అందుకే ధూమపానం, మధ్యపానం అలవాట్లను వదులుకోవడం ఆరోగ్యానికి మంచిది.
healthy food
కొన్ని రకాల కూరగాయలను మీ రోజు వారి ఆహారంలో చేర్చడం వల్ల కొంతవరకు క్యాన్సర్ రిస్క్ తగ్గించుకున్నవారవుతారు. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను రోజూ తినాలి. క్యాబేజీ, బచ్చలికూర, కాలీఫ్లవర్, క్యారెట్లు, బ్రోకలీ, టమోటాలు, స్ట్రాబెర్రీలు, బ్లాక్ బెర్రీలు, రాస్ప్ బెర్రీస్, బ్లూబెర్రీలను మీ డైట్ లో చేర్చుకోండి. చిక్కుళ్లు, తృణధాన్యాలు, గింజలను మీ రోజు వారి ఆహారంలో చేర్చండి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.