ఎవరినీ గుడ్డిగా ఎందుకు నమ్మకూడదో తెలుసా? ఈ నక్క కథ చదవాల్సిందే
Moral Story: చాలా మంది ఎవరినైనా చాలా సులభంగా నమ్మేస్తూ ఉంటారు. గతంలో వారు చెడ్డవారు అయినా.. ఇప్పుడు మారిపోయారు, మంచి వారు అయిపోయారు అనగానే వారిని నమ్మి.. వారికి కావాల్సిన పనులు చేస్తారు. చివరకు వారి చేతిలో ఘోరంగా మోసపోతారు.

నీతి కథ
మానవ సంబంధాలు నమ్మకం మీదే ఆధారపడి ఉంటాయి. ఎదుటివారిని నమ్మకంగా ఈ ప్రపంచంలో బతకలేం. నిజమే, కానీ.. ఎవరినైనా నమ్మడానికి ముందు, వారికి సహాయం చేయడానికి ముందు ఒక్కసారైనా ఆలోచించాలి. అలా ఆలోచించకపోతే.. ఈ కథలోని జంతువుల్లా బలైపోతారు. మరి, ఆ కథ ఏంటో తెలుసుకుందామా....
సింహం మాస్టర్ ప్లాన్
అనగనగా ఒక అడవిలో బలమైన సింహం ఉండేది. అది అడవికి రాజు. అందరూ దానిని చూసి భయపడేవారు. అది అడవిలో తనకు నచ్చిన జంతువును వేటాడి తినేసేది. చిన్న , పెద్ద అనే తేడా ఉండేది కాదు.. కంటికి కనిపిస్తే చాలు.. తనకు ఆహారం చేసుకునేది. అయితే.. కొంతకాలానికి ఆ సింహం ముసలిది అయిపోయింది. దాని ఒంట్లో బలం తగ్గిపోయింది. మునపటిలా వేటాడి, ఇతర జంతువులను తాను చంపలేను అనే విషయం సింహానికి బాగా అర్థం అయ్యింది. అలా అని... ఆకలికి అలమటించి చనిపోవాలని దానికి లేదు. అందుకే.. బాగా ఆలోచించి ఓ మాస్టర్ ప్లాన్ వేసింది.
అడవిలో జంతువులన్నింటికీ ఓ విషయాన్ని తెలియజేసింది. ‘ నా ఆరోగ్యం క్షీణించింది. నేను చాలా బలహీనంగా ఉన్నాను. నేను ఇంకా ఎక్కువ రోజులు బతకలేను. కాబట్టి, నా స్నేహితులంతా చివరిసారిగా వచ్చి నన్ను పలకరిస్తే సంతోషిస్తాను. ఆనందంగా ప్రాణాలు వదులుతాను. ’ అని చెప్పింది.
నమ్మి మోసపోయిన జంతువులు..
సింహం చెప్పిన మాటలను అడవిలోని జంతువులన్నీ నమ్మేశాయి. ముందుగా ఒక చిన్న కుందేలు సింహాన్ని పలకరించడానికి వెళ్లింది. గుహ బయట నిలపడి... ‘మహారాజా.. మీకు ఏమైంది?’ అని అడిగింది. దానికి సింహం.. ‘ నేను అనారోగ్యం బారిన పడ్డాను. నేను ఇప్పుడు నా ముందు ఆహారం పెట్టినా కూడా తినే పరిస్థితిలో లేను. నేను నిన్ను చంపి తింటాను అని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా వచ్చి నన్ను చూసి వెళ్లు’ అని చెప్పింది. ఆ మాటలను కుందేలు నమ్మి లోపలికి వెళ్లింది. అంతే.. సింహం ఒక్కసారి తన పంజాతో ఆ కుందేలును పట్టుకొని తినేసింది.
ఈ విషయం తెలియని ఇతర జంతువులు కూడా ఒక దాని వెంట మరొకటి సింహం గుహ దగ్గరకు వెళ్లాయి. ఆ సింహం వాటిని సంతోషంగా ఆరగించి తినడం మొదలుపెట్టింది. ఇక... తాను వేటకు వెళ్లాల్సిన అవసరం లేదు అని సంబరపడిపోయింది.
నక్క తెలివి...
కొద్ది రోజుల తర్వాత సింహం అనారోగ్యం సంగతి తెలుసుకున్న ఓ నక్క కూడా... సింహాన్ని పలకరించడానికి వెళ్లింది. లోపలికి వెళ్లే ముందు నక్క ఒక్కసారిగా ఆ గుహ చుట్టూ పరిశీలనగా చూసింది. చాలా జంతువులు లోపలికి వెళ్లినట్లు పాదాల గుర్తులు ఉన్నాయి. కానీ.. బయటకు వెళ్లినట్టు అడుగుల గుర్తులు లేకపోవడంతో నక్కకు విషయం అర్థం అయ్యింది.
అయితే.. లోపలికి వెళ్లకుండా, బయట నుంచే సింహాన్ని పిలిచింది. అన్ని జంతువులను నమ్మించినట్లే... నక్కకు కూడా మాయ మాటలు చెప్పి, లోపలికి రమ్మని పిలిచింది. కానీ.. నక్క లోపలికి వెళ్లలేదు. “ఓ సింహ రాజా! నీ ఆరోగ్యం బాగోలేదని విన్నాను. కానీ ఇక్కడి అడుగుల ముద్రలు చూసి ఒక విషయం అర్థమైంది — అందరూ లోపలికి వెళ్లారు, కానీ ఎవరూ తిరిగి రాలేదు. కాబట్టి నేను లోపలికి రావడం లేదు!” అని చెప్పి వెంటనే అక్కడినుంచి పరుగెత్తింది. అలా తెలివిగా నక్క తన ప్రాణాలను కాపాడుకుంది.
కథలో నీతి...
ఆలోచించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. మరీ ముఖ్యంగా చెడ్డవారు తాము మారిపోయాం అని చెబితే గుడ్డిగా అస్సలు నమ్మకూడదు.