Moral Story: ఈ ప్రపంచంలో ఎక్కువ సంతోషంగా ఉండేది ఎవరు..? ఈ రాజు కథ చదవాల్సిందే
Moral Story: జీవితంలో ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లుగా ఉంటున్నారా? ఎంత సంపాదించినా ఆనందం మాత్రం ఉండటం లేదా? అయితే.. నిజమైన ఆనందం పొందడం ఎలాగో ఈ కథ చదివి తెలుసుకోవాల్సిందే.

Moral Story
మనలో చాలా మంది తమకు అన్నీ ఉన్నా కూడా ఏదో లోటు ఉన్నట్లు ఫీలౌతూ ఉంటాం. తమకు నిజంగా ఏది సంతోషం కలిగిస్తుంది అనే విషయం కూడా చాలా మందికి తెలీదు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండటానికి ఇల్లు, చేతిలో డబ్బు ఉన్నా...ఇంకా ఏదో కావాలి అని పరుగులు తీస్తూ ఉంటారు. చాలా మంది కేవలం డబ్బు ఉన్నవారు మాత్రమే సంతోషంగా ఉంటారు అని అనుకుంటూ ఉంటారు. మరి కొందరు... ఖరీదైన బంగ్లాలు, లగ్జరీ లైఫ్ ఉంటేనే సంతోషం ఉంటుందని అనుకుంటారు. అసలు.. నిజమైన ఆనందం ఎవరికి సొంతమో తెలియాలంటే.. ఈ రాజు కథ చదవాల్సిందే.
రాజు కథ
పూర్వం ఓ రాజు ఉండేవాడు. అతని రాజ్యంలో అన్నీ ఉన్నాయి. సంపద, సౌఖ్యం, సేవకులు, విలాసవంతమైన జీవితం అన్నీ ఉన్నాయి. ఏది కోరుకున్నా నిమిషాల్లో తన ముందుకు వచ్చేస్తుంది. తనకు చిన్న కష్టం కలగకుండా చూసుకునే సేవకులు ఉన్నారు. ఇన్ని ఉన్నా కూడా ఆ రాజు ఎప్పుడూ అసంతృప్తిగా, ఆందోళనతో ఉండేవాడు. తనకు అన్నీ ఉన్నా.. ఏదో లోపం ఉన్నట్లు ఫీలయ్యేవాడు.
చాలా రోజులపాటు ఈ విషయంలో బాధపడిన ఆ రాజు... ఓ రోజు మంత్రిని పిలిచి.. తన బాధను వివరించాడు. ‘ నా దగ్గర అన్నీ ఉన్నాయి. అయినా నేను ఎందుకు సంతోషంగా లేను? నేను ఎలా నిజమైన ఆనందాన్ని పొందగలను?’ అని అడిగాడు. ఆ ప్రశ్నకు మంత్రి కాసేపు ఆలోచించి.. నవ్వుతూ ఓ పరిష్కారం చెబుతాడు.
‘రాజ్యంలో అత్యంత సంతోషంగా ఉన్న మనిషి ఎవరో కనుక్కొని.. అతని చొక్కా మీరు ధరిస్తే.. మీకు కూడా సంతోషం కలుగుతుంది’ అని మంత్రి చెబుతాడు. ఆ మాట వినగానే రాజు తన సైనికులను పిలిచి.. ‘ రాజ్యంలో అత్యంత సంతోషంగా ఉన్న మనిషిని కనుక్కొని అతని చొక్కా తీసుకు రండి’ అని ఆదేశిస్తాడు.
వెంటనే సైనికులు చాలా మందిని కలుస్తారు. రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ అడుగుతూనే ఉంటారు. రోజులు గడుస్తున్నాయి కానీ.. సంతోషకరమైన వ్యక్తిని మాత్రం కనుక్కోలేరు. ధనవంతులు, వ్యాపారాలు, రైతులు, కళాకారులు, పండితులు.. ఇలా ఎవరిని కలిసినా.. తమకు ఏదో సమస్య ఉందని.. సంతోషంగా లేమనే చెబుతారు.
పేద కూలీ
చివరగా, ఒక రోజు వారు గ్రామంలో ఒక పేద కూలీని చూశారు. అతను పొలంలో కష్టపడుతూ కనిపిస్తాడు. కానీ, అతని ముఖంలో కొంచెం కూడా చిరాకు, అలసట కూడా కనపడలేదు. నవ్వుకుంటూ పని చేస్తున్నాడు దీంతో.. సైనికులు వెళ్లి.. మీకు ఏమైనా కష్టాలు ఉన్నాయా అని అడుగుతారు. అందుకు... ఆ కూలీ.. తనకు ఏ సమస్యలు లేవని.. చాలా సంతోషంగా ఉన్నాను అని చెబుతాడు. ‘ నాకు శ్రమించడానికి శక్తి ఉంది. నా కుటుంబం నాతో ఉంది. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఇంకేం కావాలి?’ నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెబుతాడు.
ఆ మాట విన్న సైనికులు వెంటనే... ‘ నీ చొక్కా ఒకటి కావాలి, రాజుగారికి ఇవ్వాలి’ అని అడుగుతారు. దానికి ఆ కూలీ నవ్వి తన దగ్గర అసలు చొక్కాలే లేవు అని చెబుతాడు. ఆ మాట విని సైనికులు కూడా షాక్ అయిపోతారు. అతనికి కనీసం వేసుకోవడానికి ఒక చొక్కా కూడా లేదు. కానీ.. జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నాడు అని అర్థం చేసుకుంటారు. ఇదే విషయాన్ని వెళ్లి రాజుకు కూడా చెబుతాడు.
అప్పుడు రాజుకి అసలు విషయం అర్థమౌతుంది. నిజమైన ఆనందం సంపదలో, వస్తువులలో, విలాసంలో ఉండదు. అది మన మనసులో ఉంటుంది. మనకు ఉన్నదాన్ని ప్రేమించగలిగితే, కృతజ్ఞతతో జీవిస్తే, అదే నిజమైన సంతోషం.
కథలో నీతి...
“సంతోషం మనకు బయట దొరకదు, అది మన లోపలే ఉంటుంది.”
నిజమైన ఆనందం అంటే మన దగ్గర ఉన్నదానికి కృతజ్ఞతతో జీవించడం, ప్రేమించడం, ఇతరులను సంతోషపెట్టడం.
ఈ కథను సుధామూర్తి ‘ Grandma's Bag of Stories' అనే పుస్తకంలో రాశారు. దాని ఆధారంగానే మీకు అందిస్తున్నాం.