- Home
- Life
- భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గాలంటే ఈ క్షేత్రాలకు వెళ్లాలి. తెలుగు రాష్ట్రాల్లో ఏ దేవాలయాలకు వెళ్లాలంటే?
భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గాలంటే ఈ క్షేత్రాలకు వెళ్లాలి. తెలుగు రాష్ట్రాల్లో ఏ దేవాలయాలకు వెళ్లాలంటే?
భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు జరుగుతుంటాయి. ఒక్కోసారి అవి తీవ్రమై విడాకులు కూడా తీసుకుంటారు. కొందరైతే తొందరపడి ప్రాణాలు వదిలేస్తారు. కొన్ని క్షేత్రాలను సందర్శిస్తే భార్యాభర్తల మధ్య ఐక్యత పెరుగుతుందని పండితులు తెలిపారు. అవేంటో చూద్దాం.

కల్యాణం చేయిస్తే దోషాలు తొలగుతాయి
దంపతుల మధ్య తరచుగా గొడవలు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అయితే ఆధ్యాత్మికత ప్రకారం కొన్ని దేవాలయాలకు వెళ్లి పూజించడం ద్వారా దంపతుల మధ్య ఐక్యత పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ పూజలు మనశ్శాంతిని, సంబంధంలో సామరస్యాన్ని కలిగించడంలో సహాయపడతాయి. తెలుగు రాష్ట్రాల్లో అనేక ఆలయాల్లో ఇలాంటి ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
శ్రీనివాస మంగాపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలో ఉన్న శ్రీనివాస మంగాపురం చాలా ప్రసిద్ధి చెందింది. తిరుపతికి వచ్చిన ప్రతి ఒక్కరూ శ్రీనివాస మంగాపురాన్ని దర్శిస్తారు. ఇక్కడే శ్రీనివాసుడికి పద్మావతమ్మతో కల్యాణం జరిగిందని స్థల పురాణం చెబుతోంది. అందువల్ల ఇక్కడ కల్యాణం చేయించుకున్న దంపతులకు వివాహ బంధంలోని ఇబ్బందులు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
శ్రీశైల క్షేత్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
శ్రీశైల క్షేత్రం సాక్షాత్తూ పరమశివుడు కొలువైన ప్రాంతంగా భక్తులు నమ్ముతారు. శ్రీశైలంలో శివపార్వతుల కల్యాణం చేయించడం అనేది పురాతన హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రమైన, శుభమైన కార్యంగా భావిస్తారు. శ్రీశైల ఆలయం దక్షిణ భారతదేశంలో అత్యంత పవిత్రమైన ద్వాదశ జ్యోతి లింగాలలో ఒకటి. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి కావడం విశేషం.
శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి కల్యాణం చేయించడం వల్ల భర్త, భార్య మధ్య కలహాలు, అపార్థాలు తొలగిపోతాయని నమ్మకం. కల్యాణం చేసిన దంపతుల మధ్య పరస్పర ప్రేమ, అవగాహన పెరుగుతుంది.
కొమరవెల్లి, తెలంగాణ రాష్ట్రం
కొమురవెల్లి.. తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా, కొమురవెల్లి గ్రామంలో కొలువైన ఒక ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇది శివుని అవతారమైన మల్లికార్జున స్వామి ఆలయం. ఈ ఆలయం కొండపై ఉంది. దీనిని "మల్లన్న దేవాలయం" అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం, ఇక్కడ మూడు నెలల పాటు జాతర జరుగుతుంది. దీనిని "మల్లన్న జాతర" అని పిలుస్తారు.
ఇక్కడ స్వామివారికి విశేషమైన పూజలు చేయించడం ద్వారా దంపతుల మధ్య గొడవలు తగ్గి సఖ్యత ఏర్పడుతుందని భక్తుల విశ్వాసం.
తమిళనాడులోని కొన్ని క్షేత్రాలు
తమిళనాడు రాష్ట్రంలోని కొన్ని ఆలయాలు కూడా దంపతుల మధ్య బంధాలను బలోపేతం చేస్తాయని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా మయిలాడుతురై జిల్లాలో ఉన్న తిరుమణంచేరి పెళ్లి కాని వారు సందర్శిస్తే వివాహం అవుతుందని నమ్మకం. అయితే ఇక్కడ దంపతులు పూజలు చేసినా వారి గ్రహదోషాలు తొలగి సత్సంబంధాలు ఏర్పడతాయని నమ్మకం.
అదేవిధంగా తిరుచ్చి జిల్లా లాల్ గుడి, ఎడయత్తుమంగళం, తిరుచ్చతిముట్రం, కుంభకోణంలో వైద్యనాథస్వామి ఆలయం, తిరుచ్చెంగోడు అర్ధనారీశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం ద్వారా దంపతుల మధ్య గొడవలు తగ్గుతాయని పండితులు చెబుతున్నారు.