ఎప్పుడూ కడుపు ఉబ్బరంగా ఉంటుందా.? అల్లం ముక్కతో ఇలా చేస్తే చాలు
మన వంటిల్లే పోషకాల గణి. ఎన్నో ఆయుర్వేద చిట్కాలకు వంటిల్లు పెట్టింది పేరు. పొపుల పెట్టెలో ఉన్న ప్రతీ ఒక వస్తువుకు ఒక ప్రయోజనం ఉంటుంది. అందుకే వంటిల్లును మించిన వైద్యశాల లేదని చెబుతుంటారు. అలాంటి వాటిలో అల్లం ఒకటి. ప్రతీ రోజూ క్రమం తగ్గకుండా అల్లం నీటిని తీసుకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఏ కూర చేయాలన్నా తప్పనిసరిగా కావాల్సిన వాటిలో అల్లం ఒకటి. కూరకు రుచిని ఇవ్వడంలో అల్లానికి ఉండే ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా అల్లంలోని ఔషధ గుణాలు జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి.
ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వేడి నీటిలో అల్లం ముక్క వేసి తీసుకోవడం వల్ల ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. ప్రతీ రోజూ అల్లం నీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
షుగర్ పేషెంట్స్‌కి వరం
డయాబెటిస్‌తో బాధపడేవారికి అల్లం నీరు ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులోని టానిన్, పాలీఫెనోలిక్, ఫ్లేవనాయిడ్స్, ట్రైటెర్పెనాయిడ్స్ సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. అలాగే అల్లంలోని జింజెరాల్ శరీరంలో ఆల్ఫా అమైలేస్, ఆల్ఫా గ్లూకోసిడేస్ ఎంజైమ్‌లను మెరుగుపరచడంలో దోహదపడతాయి ఇది కూడా డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. అల్లంలోని యాంటీ డయాబెటిక్ ఏజెంట్స్ షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి.
బరువు తగ్గాలనుకునే వారు
బరువు తగ్గడానికి వర్కవుట్స్, ఫాస్టింగ్ వంటివి చేస్తున్నారా.? అయితే ప్రతీ రోజూ ఉదయం ఒక గ్లాసు అల్లం నీటిని తాగి చూడండి మార్పు మాములుగా ఉండదు. అల్లం ధర్మోజెనిసిస్‌ను పెంచుతుంది. ఇది శరీంలో వేడిని ఉత్పత్తి చేసే పక్రియను పెంచుతుంది. ఇది బరువు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇందులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు బరువు తగ్గడంలో దోహదపడతాయి.
మెరుగైన జీర్ణ వ్యవస్థకు
మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలకు చెక్ పెట్టడంలో అల్లం నీరు ఉపయోగడపతుంది. డయేరియా బారిన పడిన వారు ఈ నీటిని తీసుకుంటే వెంటనే ఫలితం ఉంటుంది. అల్లంలో ఉండే జింజెరాల్ జీర్ణ వ్యవస్థలోని కండరాలను ఉత్తేజం చేస్తాయి దీంతో జీర్ణక్రియ మెరుగవుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపులో తిమ్మిరి వంటి సమస్యలతో బాధపడేవారికి కూడా అల్లం నీరు దివ్యౌషధంగా పనిచేస్తుంది.
గొంతు నొప్పి నుంచి ఉపశమనం
వాతావరణంలో ఏ చిన్న మార్పు వచ్చినా, తాగే నీటిలో మార్పు వచ్చినా గొంతు నొప్పి రావడం సర్వసాధారణమైన విషయం. ఈ సమస్యకు చెక్ పెట్టడంలో అల్లం నీరు బాగా ఉపయోగపడుతుంది. గోరు వెచ్చని నీటిలో అల్లం ముక్క వేసుకొని తాగితే గొంతు నొప్పి, వాపు నుంచి ఉపశమనం లభిస్తుంది. గొంతు ఇన్ఫెక్షన్‌ను దూరం చేస్తుంది.
కొలెస్ట్రాల్ తగ్గించడంలో
శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించడంలో కూడా అల్లం నీరు కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రెగ్యులర్‌గా అల్లం నీటిని తీసుకుంటే శరీరంలోని లిపిడ్లను తగ్గిస్తుంది. దీంతో శరీరంలో హెచ్‌డిఎల్ (మంచి కొలెస్ట్రాల్) పెరుగుతుంది. ఇది గుండె సమస్యలను తగ్గిస్తుంది, అలాగే రక్తపోటు సమస్య దరిచేరకుండా చూసుకోవడంలో ఉపయోగపడుతుంది.
నోట్: పైన తెలిపిన వివరాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యులను సంప్రదించి, వారి సూచనలు పాటించడమే మంచిది.