మీరు ఓవర్ గా ఆలోచిస్తారా? దీన్ని ఎలా తగ్గించుకోవాలంటే?
కొంతమంది చిన్నా, పెద్దా అంటూ ప్రతి విషయానికి ఓవర్ గా ఆలోచిస్తుంటారు. కానీ ఇది మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అతిగా ఆలోచించే అలవాటు మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తుంది. అందుకే ఈ అలవాటును వీలైనంత తొందరగా వదిలించుకోవాలి.
టెన్షన్ లేని జీవితం ఉండదు. కానీ ప్రతి విషయానికి టెన్షన్ పడటం, అతిగా ఆలోచించడం మంచిది కాదు. కానీ మనలో కొంతమంది అయిన దానికి, కాని దానికి దానికి ఓవర్ గా ఆలోచిస్తుంటారు. కానీ అతిగా ఆలోచించే అలవాటు మీ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మానసిక ఆరోగ్యం మన శారీరక ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. అంటే ఈ అలవాటు ఎన్నో రోగాలకు కారణమవుతుందన్న మాట. అందుకే దీన్ని లైట్ తీసుకోకూడదు. మరి ఈ అలవాటును వదిలించుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
overthinking
భావోద్వేగానికి ఎక్కువగా గురయ్యే వ్యక్తులు అతిగా ఆలోచిస్తారని నిపుణులు చెబుతున్నారు. వీళ్లు ప్రతి విషయాన్ని మనసులో పెట్టుకుని ఇతరులు ఏమనుకుంటారోనని ఆలోచిస్తూనే ఉంటారు. దీని వల్ల వారి వ్యక్తిగత, వృత్తి జీవితం దెబ్బతింటుంది. ఒక్కోసారి వీళ్లు డిప్రెషన్ లోకి కూడా వెళ్తుంటారు.
మీకు తెలుసా? అతిగా ఆలోచించే అలవాటు మీ రక్తపోటును బాగా పెంచుతుంది. ఇది గుండెపోటు లేదా స్ట్రోక్ కు దారితీస్తుంది. చాలాసార్లు అతిగా ఆలోచించడం కోసం కొంతమంది సిగరెట్లను కాల్చడం, ఆల్కహాల్ ను తాగడం చేస్తుంటారు. ఇవి మీ ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. అందుకే ఈ అలవాటును వదిలించుకోవడానికి కొన్ని పద్దుతులను తప్పకుండా పాటించాలి.
మంచి పనుల్లో నిమగ్నమవ్వండి
నిజం చెప్పాలంటే ఖాళీగా ఉంటేనే ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. లేని పోని విషయాలు గుర్తొస్తాయి. అందుకే మిమ్మల్ని బాధించే విషయం గురించి ఆలోచించకుండా ఉండండి. ఇందుకోసం మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి. మీకు సంతోషం కలిగించే పనుల్లో నిమగ్నమైతే ఎలాంటి ఆలోచనలు రావు.
నెగిటివ్ వ్యక్తులకు దూరంగా
మీలో నెగిటీవ్ విషయాలు పుట్టించే వ్యక్తులకు మీరు దూరంగా ఉండండి. అవతలి వ్యక్తి ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని బాధపెడితే.. మీరు కూడా అతనితో ఆ విధంగానే మాట్లాడండి. వ్యవహరించండి. ఒకవేళ అలా మాట్లాడేందుకు మీ మనస్సు ఒప్పుకోకపోతే వారితో సంబంధాన్ని కట్ చేసుకోవడమే నిమ్మలం.
మనసు ప్రశాంతం
మనసును ప్రశాంతంగా, రిలాక్స్ గా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఇందుకోసం మీరు ప్రతి రోజూ యోగా, మెడిటేషన్ చేయండి. ధ్యానం మిమ్మల్ని మానసికంగా దృఢంగా చేస్తుంది. అలాగే ఇది అతిగా ఆలోచించే అలవాటును వదిలించుకోవడం కూడా సులువు అవుతుంది.