అబార్షన్ కావడానికి కొన్ని సాధారణ కారణాలు..!
తల్లిని కాబోతున్నాను.. అన్న వార్త ఆడవారికి ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో మాటల్లో చెప్పడం కష్టమే. మొదటి నెల నుంచి ‘అమ్మా’ అని ఎప్పుడు పిలిపించుకుంటానో అని ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తుంటారో..! కానీ కొన్ని కొన్ని సార్లు ఈ ఆనందం మధ్యలోనే మటుమాయం అవుతుంది. గర్భస్రావం తీరని శోకాన్ని కలిగిస్తుంది. అయితే గర్భస్రావం కావడం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి తెలుసా?
గర్భధారణ సమయంలో ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రెగ్నెన్సీ సమయంలో ఖచ్చితంగా రెండు విషయాలు జరుగుతాయి. మొదటిది ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టొచ్చు. రెండోది శిశువు పుట్టకముందే కొన్ని సమస్యలు రావొచ్చు. ఇవి ప్రతి ఒక్కరికీ వస్తాయని చెప్పలేం. ప్రస్తుత కాలంలో చాలా మంది ఆడవారు తరచుగా అబార్షన్ సమస్యలను ఫేస్ చేస్తున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అబార్షన్ కు ఎన్నో కారణాలు ఉన్నాయి. వాస్తవానికి గర్భస్రావానికి ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించడం చాలా కష్టం. అయినప్పటికీ.. గర్భస్రావం సాధారణ కారణాలను తెలుసుకోవడం చాలా ముఖ్యంగా. దీనివల్ల ప్రెగ్నెన్సీ నిలబడే అవకాశాలు పెరుగుతాయి. అవేంటంటే..
అసాధారణ క్రోమోజోములు
మొదటి 12 వారాలలో జరిగే గర్భస్రావాలలో సగానికి పైగా క్రోమోజోమ్ల అసాధారణ సంఖ్యే బాధ్యత వహిస్తుందని నిపుణులు చెబుతున్నారు. క్రోమోజోములు శిశువు జుట్టు, కంటి రంగు వంటి లక్షణాలను నిర్ణయిస్తాయి. క్రోమోజోములు దెబ్బతినడం లేదా అసాధారణంగా ఉండటం వల్ల పిల్లల అభివృద్ధి సరిగ్గా ఉండదు. ముఖ్యంగా 35 సంవత్సరాల తర్వాత క్రోమోజోమ్ సమస్యలు, గర్భస్రావం సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
అనారోగ్య సమస్యలు
ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీకి తల్లి ఆరోగ్యం కీలక పాత్ర పోషిస్తుంది. రుబెల్లా లేదా సైటోమెగలోవైరస్, హెచ్ఐవి లేదా సిఫిలిస్, థైరాయిడ్ వ్యాధి, స్వయం ప్రతిరక్షక రుగ్మతలు వంటి అంటువ్యాధులు ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి నుంచి బిడ్డకు వ్యాపించే అవకాశం ఉంది. ఇవేకాకుండా డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక సమస్యలను నియంత్రణలో ఉంచుకోకపోవడం వల్ల కూడా అబార్షన్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ ఆరోగ్య సమస్యలతో పాటుగా మీ అలవాట్ల వల్ల కూడా గర్భం పోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంటే ధూమపానం, మద్యపానం, మాదకద్రవ్యాల వినియోగం వల్ల గర్భస్రావం ప్రమాదం పెరుగుతుంది.
మందులు
కొన్ని రకాల మందులు కూడా అబార్షన్ కు దారితీస్తాయంటున్నారు నిపుణులు. నొప్పి , మంట కోసం నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్ఎస్డిఎస్), రుమటాయిడ్ ఆర్థరైటిస్ చికిత్సకు ఉపయోగించే మందులు వీటిలో ఉన్నాయి. తామర వంటి కొన్ని చర్మ సమస్యలకు తీసుకునే మందులు కూడా ఈ ప్రమాదాన్ని పెంచుతాయి.
పర్యావరణ ప్రమాదాలు
ఇంట్లో లేదా మీ ఆఫీసుల్లో మీ చుట్టూ ఉన్న వాతావరణంలో ఉండే కొన్ని పదార్థాలు గర్భధారణకు ముప్పు కలిగిస్తాయి. పురుగులు లేదా ఎలుకలను చంపడానికి ఉపయోగించే పురుగుమందులు, ఇంటికి వేసే కొన్ని రంగులు, నీటి పైపులలో ఉండే పెయింట్ లేదా సీసం వంటి ద్రావకాలు కూడా గర్భస్రావం ప్రమాదాన్ని పెంచుతాయి.
ఫుడ్ పాయిజనింగ్
గర్భిణులు రకరకాల వంటలను తినాలనుకుంటారు. కానీ ఈ సమయంలో ఫుడ్ పాయిజన్ కు గురైతే గర్భం పోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. సాల్మొనెల్లా సాధారణంగా ముడి లేదా తక్కువ ఉడికించిన గుడ్లలో కనిపిస్తుంది. ఇది గర్భస్రావంతో పాటుగా ఎన్నో సమస్యలను కలిగిస్తుంది.